దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారం కూడా ఒడిదుడుకుల్లోనే పయనించవచ్చు. మిడిల్ ఈస్ట్‌లో ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టకపోవడం.. మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీస్తున్నది. దీనికితోడు వర్షాభావ పరిస్థితులు, ఈ ఆర్థిక సంవత్సరానికి (2026-27)గాను దేశ జీడీపీ 1.1 శాతం తగ్గి 6.6 శాతానికే పరిమితం కావచ్చన్న రిజర్వ్ బ్యాంక్ అంచనాలు కొనుగోళ్లను ఆటంకపర్చే వీలున్నది. అంతకుముందు వారంతో పోల్చితే గత వారం సెన్సెక్స్ 532.40 పాయింట్లు లేదా 0.71 శాతం కోల్పోయి 74,243.34 దగ్గర ఆగింది. నిఫ్టీ 181.05 పాయింట్లు లేదా 0.76 శాతం పడిపోయి 23,366.70 వద్ద నిలిచింది.
ఈ క్రమంలో ఈ వారంలోనూ మదుపర్లు అమ్మకాలకు పెద్దపీట వేయవచ్చన్న అంచనాలు వినిపిస్తున్నాయి. అయితే గత శుక్రవారం ఆర్బీఐ వడ్డీరేట్లను యథాతథంగా ఉంచడం, విదేశీ పెట్టుబడులకు ఊతమిచ్చే నిర్ణయాలు రావడం, గత ఆర్థిక సంవత్సరానికి (2025-26)గాను దేశ జీడీపీ 7.7 శాతానికి పెరుగడం వంటివి పెట్టుబడులకు దోహదం చేయవచ్చన్న అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి. కరెన్సీ మార్కెట్లో రూపీ పెరిగితే.. బ్యాంకింగ్, ఆటో, రియల్టీ, ఎఫ్ఎంసీజీ షేర్లు ఆకర్షణీయంగా కనిపించవచ్చు. కాగా, పశ్చిమాసియాలో సంక్షోభ పరిస్థితులు దిగజారిగితే క్రూడాయిల్ రేట్లు పరుగులు పెట్టే అవకాశాలున్నాయి.
ఇది చమురు, సహజ వాయువు ఆధారిత రంగాల్లో అమ్మకాల ఒత్తిడికి దారితీయగలదు. అయితే అమెరికా-ఇరాన్ మధ్య శాంతి స్థాపనకు అడుగులు పడితే మార్కెట్లకు ఉత్సాహమే. తగ్గే ముడి చమురు ధరలు కలిసొస్తాయి. ఇక గ్లోబల్ స్టాక్ మార్కెట్ల తీరుతెన్నులు, డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ, విదేశీ మదుపర్ల పెట్టుబడులు ప్రాధాన్యతను కలిగి ఉంటాయి. అమ్మకాల ఒత్తిడి కనిపిస్తే నిఫ్టీకి 23,100 పాయింట్ల స్థాయి కీలకమైనదనుకోవచ్చు. దీనికి దిగువన ముగిస్తే 23,000 పాయింట్ల స్థాయిని మద్దతుగా చెప్పుకోవచ్చని అత్యధిక నిపుణుల మాట. సూచీలు పరుగందుకుంటే ఈ వారం నిఫ్టీ 23,600-23,800 పాయింట్ల స్థాయికి వెళ్లవచ్చనీ చెప్తున్నారు.
గమనిక..
స్టాక్ మార్కెట్ పెట్టుబడులు రిస్క్‌తో కూడుకున్నవి. వివిధ దేశ, విదేశీ పరిణామాలు ట్రేడింగ్‌ను ఎక్కువగా ప్రభావితం చేస్తుంటాయి. కాబట్టి ఇక్కడ ఒడిదుడుకులు చాలా సహజం. పెట్టుబడులు పెట్టే ముందు ఆర్థిక నిపుణుల సలహా తీసుకోవడం, ఆయా సాధనాల డాక్యుమెంట్లను క్షుణ్ణంగా చదువుకోవడం ఉత్తమం. అలాగే పైన పేర్కొన్న సూచనలు విశ్లేషకుల అభిప్రాయం మాత్రమే. దీనికి మా పత్రిక ఎటువంటి బాధ్యత వహించదు. ఎవరి పెట్టుబడులకు వారిదే పూర్తి బాధ్యత. అవగాహన కోసమే ఈ మార్కెట్ పల్స్.