న్యూఢిల్లీ, ఏప్రిల్ 10: పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన ఫ్యూచర్ రిటైల్ లిమిటెడ్ను హస్తగతం చేసుకునేందుకు దేశ, విదేశాలకు చెందిన కార్పొరేట్లు పెద్ద ఎత్తున పోటీ పడుతున్నారు. ఈ క్రమంలోనే 49 సంస్థలు రిజల్యూషన్ ప్లాన్ సమర్పణకు తమ ఆసక్తి (ఈవోఐ)ని వ్యక్తం చేశాయి. ఈ మేరకు రిజల్యూషన్ దరఖాస్తుదారులుగా ఆస్కారమున్న అర్హుల ముందస్తు జాబితాను ఫ్యూచర్ రిటైల్ విడుదల చేసింది. ఇందులో రిలయన్స్ రిటైల్, జిందాల్ పవర్, సహారా, జేసీ ఫ్లవర్స్ అసెట్ రీకన్స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్, డబ్ల్యూహెచ్ స్మిత్ ట్రావెల్ లిమిటెడ్, గోర్డాన్ బ్రదర్స్ నేతృత్వంలోని కన్సార్టియం తదితర సంస్థలున్నాయి.