Pawan Kalyan | ఆ బాధ్యత మీరే తీసుకోవాలి.. పవన్ కల్యాణ్‌కు ఉండవల్లి రిక్వెస్ట్
Pawan Kalyan | ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ ఓ బాధ్యత తీసుకోమని కోరారు. ఇంతకీ అదేమింటంటే...
Pawan Kalyan | రాష్ట్ర విభజన కారణంగా ఏపీకి జరిగిన అన్యాయాన్ని సరిదిద్దే బాధ్యతను తీసుకోవాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ కోరారు. బీజేపీతో కలిసి అధికారంలో ఉండటంతో కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినవన్నీ రాబట్టుకోవడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కోరారు. ఈ మేరకు నాలుగు పేజీలతో కూడిన సుదీర్ఘ లేఖను పవన్‌కల్యాణ్‌కు ఉండవల్లి రాశారు. సుప్రీంకోర్టులో చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న రాష్ట్ర విభజన అంశాన్ని కూడా ఒక కొలిక్కి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు.
విభజన కారణంగా ఆంధ్రప్రదేశ్‌కు ఏవిధంగా అన్యాయం జరిగిందో దేశ ప్రధాని, హోంమంత్రిలు పలుపార్లు పార్లమెంటులో ప్రస్తావించారు కానీ.. మన రాష్ట్ర ఎంపీలు మాత్రం దీనిపై చర్చ జరగాలని కోరలేదని ఉండవల్లి అరుణ్‌కుమార్ తెలిపారు. అందుకే ఈ విషయంలో శ్రద్ధ తీసుకుని పార్లమెంటు ఉభయ సభల్లోనూ విభజన జరిగిన తీరు, తద్వారా మనకు జరిగిన అన్యాయంపై చర్చకు నోటీసులు ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు. సుప్రీంకోర్టులో చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలపై త్వరితగతిన ఓ కొలిక్కి తీసుకురావాలని కోరారు.
ఉండవల్లి లేఖ..
గౌరవనీయులైన పవన్ కళ్యాణ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు, ఆంధ్రప్రదేశ్ గారికి .
ది. 18-2-2014న రాష్ట్ర విభజన బిల్లు విషయమై ఏ విధమైన చర్చా జరగకుండా..ఎంతమంది విభజనకు అనుకూలమో… ఎంతమంది వ్యతిరేకమో డివిజన్ ద్వారా లెక్క తేల్చకుండా, తలుపులు మూసేసి(డివిజన్ జరిగితేనే తలుపులు మూస్తారు) టెలివిజన్ ప్రత్యక్ష ప్రసారం నిలిపివేసి, రాష్ట్ర విభజన జరిగిపోయిందని లోక్ సభలో ప్రకటించిన విషయం మీకు తెలిసిందే.
ఈవిషయమై నేను సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ పదేళ్లుగా నడుస్తూనే ఉంది. ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం కనీసం కౌంటర్ దాఖలు చేయలేదు.
18-2-2018న మీ చే ఏర్పాటు చేయబడిన ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ, కేంద్రం నుంచి ఆంధ్రప్రదేశ్ కు రావాల్సిన బకాయిలు రూ. 74542 కోట్లుగా లెక్క తేల్చింది.
16-7-2018న అప్పటి ముఖ్యమంత్రి గౌరవ శ్రీ చంద్రబాబునాయుడు గారిని కలిసి లోక్ సభలో జరిగిన అఘాయిత్యం గురించి వివరించాను. నేను చూపించిన లోక్ సభ రికార్డులను పరిశీలించిన చంద్రబాబునాయుడు గారు నా వాదనతో ఏకీభవించి, లోక్ సభలో ఈవిషయం చర్చించేందుకు నోటీసు ఇవ్వాలని, అలాగే సుప్రీంకోర్టులో రాష్ట్రం తరుఫున అఫిడవిట్ దాఖలు చేయాలని నిర్ణయించారు. కారణాలేమైనప్పటికీ అవి అమలు కాలేదు.
29-1-2019న విజయవాడలో నేను ఏర్పాటు చేసిన సమావేశానికి వైఎస్సార్సీపి, మార్క్సిస్టు పార్టీలు తప్ప మిగిలిన ముఖ్యమైన పార్టీలకు చెందిన నాయకులంతా హాజరయ్యారు. జనసేన పార్టీ అధ్యక్ష హెూదాలో మీరే ఈసమావేశానికి స్వయంగా హాజరవడంతో సమావేశం ప్రాముఖ్యతను సంతరించుకుంది. 2019 ఎన్నికల తరువాత ఎవరు అధికారంలోకి వచ్చినా, మనకు జరిగిన అన్యాయం విషయమై పార్లమెంటులో చర్చించాలని, సుప్రీంకోర్టులో ప్రస్తావించాలని ఆ రోజున సమావేశంలో తీర్మానించుకున్నాం. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్సీపి అధికారంలోకి వచ్చింది. వెంటనే నేను ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి(చంద్రబాబుగారికి రాసినట్టే) ఒక లేఖ రాశాను. ఆంధ్రప్రదేశ్ కు జరిగిన అన్యాయం గురించి ప్రస్తావించాలని, సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం తరుపున అఫిడవిట్ దాఖలు చేయాలని, నాటి ప్రధాని రాజ్యసభలో ఇచ్చిన హామీల విషయమై గట్టిగా నిలదీయాలని కోరాను. గౌరవ జగన్మోహన్ రెడ్డి గారి కార్యాలయం నుంచి నాకే సమాధానమూ రాలేదు. 4-3-2022న సుప్రీంకోర్టు విచారణలో ఉన్న నా రిట్ పిటిషన్ లో మార్పులు చేశాను. రాజ్యాంగ విరుద్ధంగా జరిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనను దృష్టిలో ఉంచుకుని ‘ఇక ముందు రాష్ట్రాల విభజన ఎలా చేయాలో స్పష్టమైన గైడ్ లైన్స్ ఇవ్వమని, విభజన ద్వారా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ కు విభజన చట్ట ప్రకారం ఇస్తామన్నవి, రాజ్యసభలో ప్రధాన మంత్రి ఇస్తామని వాగ్దానం చేసినవి ఇప్పించమని, ఆర్ధిక ఒడిదుడుకుల నుంచి బైటపడేసేలా తగు ఆర్డర్లు ఇమ్మని కోరాను.
28-11-2022న సుప్రీంకోర్టులో ఒక అనూహ్యమైన సంఘటన జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరుపున కోర్టుకు హాజరైన సీనియర్ అడ్వకేట్ శ్రీ అభిషేక్ సింఘ్వీ వాదిస్తూ… ఇన్నేళ్ల తరువాత ఈకేసును విచారించడం తేనెతుట్టెను కదిలించినట్టవుతుంది కాబట్టి ఈకేసును ఇక మూసివేయాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరుపున హాజరైన న్యాయవాది ఈవిధమైన వాదన చేయడం నన్నే కాకుండా ఆరోజు కోర్టులో ఉన్న తెలుగు లాయర్లందర్నీ విస్మయానికి గురిచేసింది. సింఘ్వీ చేసిన వాదనను నాతో పాటు మిగతా లాయర్లందరూ గట్టిగా వ్యతిరేకించారు. రాజ్యాంగ మౌలిక సూత్రాలకు విరుద్ధంగా జరిగిన ప్రక్రియపై విచారణే అనవసరమనడం, కేంద్రం కనీసం కౌంటర్ కూడా” దాఖలు చేయకపోవడం కోర్టు దృష్టికి తెచ్చాం.
23-2-2023న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మూణ్ణాళ్ల క్రితం అభిషేక్ సింఘ్వీ చేసిన వాదనతో ఏకీభవించకుండా, ఆంధ్రప్రదేశ్ కు రాజ్యాంగ విరుద్ధంగా జరిగిన విభజన వల్ల జరిగిన నష్టాలన్నీ వివరిస్తూ, నా వాదనను బలపరుస్తూ కౌంటర్ దాఖలు చేసింది.
అటు పార్లమెంటులో….ఈపదేళ్లలో, ఫిబ్రవరి 2014 నాడు ఉభయ సభల్లో జరిగిన ప్రహసనం గురించి టిడిపి వారు గానీ, వైఎస్సార్సీపీ వారు గానీ చర్చకు నోటీసు ఇవ్వలేదు. నేను మన సభ్యులందరినీ ఈవిషయం పార్లమెంటులో చర్చించవలిసిందిగా కోరుతూనే ఉన్నాను. మనందరమూ ఆంధ్రకు జరిగిన అన్యాయం గురించి నిరంతరం మాట్లాడుతూనే ఉంటాం గానీ పార్లమెంటులో ఆ సంఘటన మీద, ఎందుకో గానీ చర్చించేందుకు ఇష్టపడటం లేదు.
7.2.2018న సాక్షాత్తూ భారత ప్రధాని నరేంద్రమోడీ గారు లోక్ సభలో మాట్లాడుతూ “మీరు పార్లమెంటు తలుపులు మూసేశారు. సభ ఆర్డర్ లో లేదు. ఆంధ్రప్రజల మనోభావాలను విస్మరించారు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మీరే విత్తనాలైతే ఆంధ్రాలో నాటారో…. నాలుగేళ్లయినా విభజన సమస్యలు ఇంకా రగులుతూనే ఉన్నాయి.” అన్నారు.
8-2-2022న నరేంద్రమోడీ గారు రాజ్యసభలో మాట్లాడుతూ “మైకులా పేశారు, చిల్లీ స్ప్రే వాడారు. అసలు చర్చే లేదు. ఇదేనా ప్రజాస్వామ్యం… ఇలాగేనా చేయటం” అంటూ నిలదీశారు.
5-8-2019న కేంద్ర హెూంమంత్రి అమిత్ షా గారు రాజ్యసభలో ” ఒక్కసారి కళ్లుమూసుకుని ఆరోజున రాష్ట్ర విభజన మీరెలా చేశారో గుర్తుకు తెచ్చుకోండి…సభ్యులందర్నీ బైటకు పంపేసి, తలుపులు మూసేసి, ప్రత్యక్ష టీవీ ప్రసారాలు ఆపేసి, ఆంధ్ర-తెలంగాణాలను విడదీశారు. అంటూ దుయ్యబట్టారు.
6-8-2019న అమిత్ షా గారు లోక్ సభలో ” ఈసభ ద్వారా ఆంధ్ర-తెలంగాణా ప్రజలకే కాక యావత్ దేశ ప్రజలకూ చెప్పదలిచాను. ఏమి చర్చించారు. ఒక ప్రతిపాదన పంపారు. మూడింట రెండొంతుల మెజార్టీతో అసెంబ్లీ తిరస్కరించింది. ఉభయ సభలూ తిరస్కరించాయి. ముఖ్యమంత్రి రాజీనామా చేశారు. అయినా రాష్ట్ర విభజన చేసేశారు. ఏం చర్చించారు.!? లోక్ సభ తలుపులు మూసేసి, మార్షల్స్ ఎంపిలను ఎత్తి బయట పారేసి, బ్లాక్ డే ఈ వేళ కాదు. ఆరోజు బ్లాక్ డే. ఆరోజున మీరు పార్లమెంటు పవిత్రతను దిగజార్చిన రోజు” అంటూ ధ్వజమెత్తారు.
పార్లమెంటులో దేశ ప్రధాని, హోంమంత్రి ఆంధ్రప్రదేశ్ కు ఏ విధంగా అన్యాయం జరిగిందో పలుమార్లు ప్రస్తావించారు గానీ… మన రాష్ట్ర ఎంపిలు మాత్రం సభలో ప్రధాని, హెూంమంత్రుల ప్రకటనలపై చర్చ జరగాలని కోరలేదు. “ఇన్నేళ్లయి పోయాక ఇప్పుడిక ఏం లాభం” అంటూ కొందరంటారు. ఎక్కడైతే మన నోరునొక్కి సభా నిబంధనలను తుంగలో తొక్కి భారత రాజ్యాంగాన్ని బ్రష్టు పట్టించారో… అక్కడే మనకు జరిగిన అన్యాయాన్ని ఎలుగెత్తి చాటాలి అనేదే నా వాదన. చంద్రబాబు గారికి, మీకూ పార్లమెంటు రికార్డులు చూపించి మననెంత తీసిపారేశారో వివరించడం జరిగింది. ఇప్పుడు మీరిద్దరూ భారతీయ జనతా పార్టీతో కలిసి రాష్ట్రంలోనూ, కేంద్రంలోనూ అధికారంలోకి రావడం… విభజన సమయంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణాలోనూ, సహకరించిన భారతీయ జనతా పార్టీ కేంద్రంలోనూ అధికారంలో ఉండటం…. మన రాష్ట్రానికి రావాల్సినవి రాబట్టుకోవడానికి, జరిగిన అన్యాయాన్ని సరిదిద్దడానికి ఇదే సరైన సమయమని నా భావన. మీరీ విషయమై శ్రద్ధ తీసుకుని, పార్లమెంటు ఉభయ సభల్లోనూ విభజన జరిగిన తీరూ తద్వారా మనకు జరిగిన అన్యాయం విషయమై చర్చకు నోటీసులిప్పించాలనీ, సుప్రీంకోర్టులో చాలా కాలంగా పెండింగ్ లో పడిపోయిన రాష్ట్ర విభజన అంశాన్ని త్వరితగతిన ఒక కొలిక్కి తీసుకురావాలని కోరుతున్నాను.
అభినందనలతో….
మీ శ్రేయోభిలాషి
ఉండవల్లి అరుణకుమార్
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tirumala | తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ..హుండీకి రూ. 4.01 కోట్లు ఆదాయం
Students cry | మమ్మల్ని విడిచి వెళ్లకండి సార్ అంటూ.. కంటతడి పెట్టుకున్న విద్యార్థులు : వీడియో
Janhvi Kapoor | ఇండస్ట్రీలోకి రాకముందే ముక్కుకు సర్జరీ చేయించుకున్నా.. ఆసక్తికర విషయాలు బయటపెట్టిన జాన్వీ కపూర్!
Retirement | ఉద్యోగ విరమణ అనంతరం చాలా మంది చేయాల్సిన పనులు ఇవే.. ఆరోగ్యంగా ఉండవచ్చు..
Dandari celebrations | ఆదివాసి గుడేల్లో మార్మోగుతున్న దండారి వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

