విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైన వేళ వైసీపీ అభ్యర్థి, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికల్లో వైసీపీకి 600కి పైగా బలం ఉందని.. కూటమి ప్రభుత్వానికి 200 సభ్యుల బలం మాత్రమే ఉందని తెలిపారు. రెండు పార్టీల మధ్య 400 ఓట్ల తేడా ఉండందని చెప్పారు. దీంతో డబ్బులతో ఓట్లు కొనేందుకు ఏపీ సీఎం చంద్రబాబు కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. నర్సీపట్నం నియోజకవర్గంలోని ఎంపీటీసీలు, జడ్పీటీసీలతో మంగళవారం బొత్స సమావేశమయ్యారు. ఈ సందర్భంగా బొత్స మాట్లాడుతూ.. ఓట్లు కొనడం ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి కాదని హితవు పలికారు.
గతంలో టీడీపీ కంటే తమకు 50 ఓట్లు తక్కువగా ఉండటంతో పోటీ నుంచి తప్పుకున్న విషయాన్ని బొత్స గుర్తుచేశారు. ప్రజాస్వామ్యాన్ని నమ్మిన వ్యక్తి వైఎస్ జగన్ అని.. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన వ్యక్తి చంద్రబాబు అని విమర్శించారు. ఎన్నికల ముందు సంపద సృష్టిస్తానని చెప్పిన చంద్రబాబు.. ఎన్నికల తర్వాత రాష్ట్ర ఖజానా ఖాళీ అయ్యిందని అంటున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో ఎన్నికలకు ముందు చంద్రబాబుకు తెలియదా అని ప్రశ్నించారు.
విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు మంగళవారం నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 13వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. 14 వ తేదీ నుంచి 16వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువునిస్తారు. ఈ నెల 30వ తేదీన స్థానిక సంస్థల ఎన్నిక నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 3న ఓట్ల లెక్కింపు జరగనుంది. సెప్టెంబర్ 6వ తేదీ వరకు ఎన్నికల కోడ్ కొనసాగనుంది.