శ్రీరాంపూర్, మార్చి 21 : శ్రీరాంపూర్ ఏరియా ఎస్పార్పీ-1 గనిలో గురువారం ఉద యం జరిగిన ప్రమాదంలో హ్యామర్మెన్(రూప్ ఫ్లేసర్) కార్మికుడు సాడం సత్యనారాయణ రెండు కాళ్లు తొలగిపోయాయి. కార్మికుల కథనం ప్రకారం.. గనిలోని 24వ రేస్ 6వ సీం 6 లెవల్లో సాడం సత్యనారాయణ రూప్ రోలర్‌కు మరమ్మతులు చేస్తుండగా, ఒక్కసారిగా అదుపుతప్పి పడిపోవడంతో తన కాళ్లు రూప్రోలర్ పుల్లీలో పడి నుజ్జు నుజ్జుయి తొలగిపోయాయి.
తోటి కార్మికులు వెంటనే ఉపరితలానికి తీసుకొచ్చి ఆర్కే-8 డిస్పెన్సరీకి తరలించారు. పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో రామకృష్ణాపూర్ ఏరియాస్పత్రికి తరలించారు. అనంతరం కరీంనగర్‌కు తీసుకెళ్లారు. అధికారులు ఘటనా స్థలాన్ని సందర్శించి విచారణ జరుపుతున్నారు. కార్మికుడికి భార్య పద్మ, తండ్రి లచ్చయ్య, తల్లి సత్తెవ్వ, కూతుళ్లు స్వేత, స్వాతి, కుమారుడు సాయికుమార్ ఉన్నారు.