పచ్చని పరిసరాలకు మించిన స్వర్గం లేదు. శారీరక శ్రమకు సాటివచ్చే కసరత్తూ లేదు. గ్రామీణుల ఆరోగ్య రహస్యం ఇదేనంటారు పరిశోధకులు. తోట పనితో ఆరోగ్యాన్నీ, ఆనందాన్నీ పొందవచ్చని చెబుతారు.
సహజ వ్యాయామం
తోటపని సహజసిద్ధమైన వ్యాయామం. ఆ కృషి ఫలితంగా.. ఆకుకూరలు, కాయగూరలు ప్రాణంపోసుకుంటాయి. ఆ పచ్చని వాతావరణం మానసిక ఆరోగ్యాన్ని, శారీరక సత్తువను ప్రసాదిస్తుంది.
మెదడుకు కసరత్తు
ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ రీసెర్చ్ అండ్ పబ్లిక్ హెల్త్ ప్రకారం మట్టిపని
మెదడుకూ వ్యాయామాన్ని ఇస్తుంది. అరవైలలోనూ గార్డెనింగ్ చేస్తున్నవారిపై పరిశోధకులు ఓ అధ్యయనం చేశారు. మిగిలినవారితో పోలిస్తే తోట రాముళ్లకు, సీతమ్మలకు జ్ఞాపకశక్తి అధికంగా ఉన్నట్టు గుర్తించారు.
గుండెకు రక్షణ
నిత్యం తోటపని చేస్తే గుండె పదిలంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇది గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తుంది కూడా. ఓ అధ్యయనం ప్రకారం గార్డెనింగ్‌తో 30శాతం మేర జీవితకాలం పెరుగుతుంది. మట్టితో సావాసం పుణ్యమాని ఒత్తిడి నుంచి ఉపశమనమూ కలుగుతుంది.
బరువు నియంత్రణ
గార్డెనింగ్ వల్ల బరువు నియంత్రణలో ఉంటుంది. తోటపని మొదలు పెట్టిన రెండుమూడు నెలల్లోనే మహిళలు ఐదు కిలోలు, పురుషులు ఏడు కిలోలు తగ్గినట్టు అధ్యయనాలు చెబుతున్నాయి.
రోగ నిరోధక శక్తి
తోటపనితో రోగ నిరోధక శక్తి బలపడుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ విషయాన్ని ‘ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఇమ్యునో టార్గెట్స్ అండ్ థెరపీ’లో ప్రస్తావించారు. నేలలోని మంచి బ్యాక్టీరియా కూడా రోగ నిరోధక శక్తికి సహకరిస్తుంది.