చీరకట్టుపై అవేర్నెస్ ఆమె లక్ష్యం దేశంలో ఎక్కడ మారథాన్ జరిగినా చీరలోనే పాల్గొంటారు భారతీయ మగువ ఆత్మ ‘చీర’ అంటున్న అల్వాల్ మారథాన్ రన్నర్ సుధా తాడికొండ
ఆమె పేరు సుధా తాడికొండ. అల్వాల్ వాసి. ఆమెకు శారీ మారథాన్ రన్నర్‌గా పేరుంది. చీరకట్టుపై ఈ తరానికి అవగాహన కల్పించడమే ఆమె లక్ష్యంగా పెట్టుకుంది. పాశ్చాత్య పోకడలో చీర ప్రాధాన్యతను విస్మరిస్తున్న సందర్భంలో ఆమె చీరకట్టు గొప్పతనాన్ని చాటుతున్నది. 5కే, 10కే, 21కే ఇలా ఏ మారథాన్లోనైనా చీరలోనే రన్నింగ్ చేసి ఆదర్శంగా నిలుస్తున్నది. శారీ సుధా అని అందరూ ఆమెను పిలుస్తారు. చీరకట్టుతో ప్రతీ మారథాన్‌లో పాల్గొన్న ఆమెను అనేక బహుమతులు, మెడల్స్ వరించాయి. 42 ఏండ్ల వయసులో కూడా యువకులతో పోటీపడుతూ రన్నింగ్‌లో తనకు సాటిలేరని నిరూపిస్తున్నారు. చేనేత దుస్తులు ధరించడం, రన్ ఫర్ గర్ల్ చైల్డ్ లాంటి సామాజిక బాధ్యతల్లోనూ ఆమె పాలుపంచుకుంటారు. ఈ సందర్భంగా ఆమె జిందగీతో తన అభిప్రాయాలను పంచుకున్నారు.
నా భర్త రామ్ కుమార్ ఓ కంపెనీలో జనరల్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. మాకు ఇద్దరు పిల్లలు. అబ్బాయి వరుణ్ ఇంటర్ చదువుతున్నాడు. నేషనల్ స్విమ్మర్. అమ్మాయి కృతి(11) చెస్ చాంపియన్. నేను బీటెక్ చేశాను. అమ్మ, అత్తయ్యకు చీర అంటే చాలా ఇష్టం. ఇప్పటి పిల్లలకు చీర కట్టుకోవడమే రావడం లేదని.. పేరేంట్స్ వారికి నేర్పడం లేదని అంటుండేవారు. వారి మాటలు విన్నప్పుడల్లా నిజమే కదా అనిపించేంది. ఏదైనా ఫ్యామిలీ ఫంక్షన్‌కు వెళ్లినప్పుడు కల్చరంతా మారిపోయినట్లు కనిపిస్తుంది. మాడ్రన్ దుస్తుల్లో వేడుకలకు రావడం ఇటీవల బాగా పెరిగింది. ఎవరైనా చీరకట్టులో కనిపిస్తే ఇంకా పాత పద్ధతేనా…కొంచెం అప్డేట్ అవ్వండి అంటూ హేళనలు వినిపిస్తున్నాయి. కొన్ని పాష్ ఏరియాల్లో చీర కట్టుకోవడం అనేది పెద్ద కష్టంగా కొంతమంది భావిస్తారు. చీర గురించి అవేర్నెస్ కల్పించాలనే అవసరం ఇప్పుడు అత్యవసరంగా లేకపోవచ్చు. కానీ భవిష్యత్తులో కచ్చితంగా వస్తుంది. ఎందుకంటే ఈ తరం వారికి చీరకట్టుకోవడం రాకపోతే, వచ్చే తరానికి చీర అనేది కేవలం ఒక వస్త్రంగా ఉండేదని అనుకునే అవకాశం ఉంది. అందుకే చీరకట్టుపై అవేర్నెస్ కల్పించాలని నిర్ణయించుకున్నా. అందుకోసం నా ప్రవృత్తి మారథాన్ కార్యక్రమాలను వేదికగా చేసుకున్నాను. ప్రతీ ఈవెంట్లోనూ నేను చీర ధరించి రన్ చేస్తాను. చాలామంది నన్ను అభినందిస్తుంటారు. చీరతో పరుగు సాధ్యం కాదేమో అని చాలామంది మహిళలు రన్నింగ్ దుస్తులు వేసుకోక వ్యాయామానికి దూరంగా ఉండిపోతున్నారు. చీరలో కూడా రన్నింగ్ చేసి ఆరోగ్యాన్ని కాపాడు కోవచ్చని నేను వారికి చెప్పాలనుకున్నాను.
టాటా ముంబై 21 మారథాన్, విజయవాడ 10కే మారథాన్, నెక్లెస్‌రోడ్ వైటథాన్, హైదరాబాద్ రన్నర్స్ క్లబ్(21) సేవాభారతి 10కే, ఢిల్లీ వేదాంత, స్టార్‌లైట్ ్రైస్టెడ్స్ తదితర మారథాన్లలో చీరలోనే పాల్గొని నా వంతుగా చీరకట్టు ప్రచారం చేశాను. చీరలో రన్ చేసినందుకుగాను ‘స్పెషల్ రికగ్నైజేషన్ ఫర్ రన్నింగ్ ఇన్ శారీ’ బహుమతి లభించింది. ఇప్పటివరకు 362 ఈవెంట్స్‌లో పాల్గొన్నాను. 2,230 కిలో మీటర్లు పరిగెత్తాను. హైదరాబాద్ రన్నర్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నాను. స్టార్‌లైట్ ్రైస్టెడ్స్ ఆధ్వర్యంలో ప్రతి ఏడాది జరిగే 5కే రన్లో పెద్ద ఎత్తున జనం పాల్గొంటారు. నన్ను చూసి ఇంకెవరైనా నాలాగ చీరలో పరిగెత్తడానికి ఆసక్తి చూపిస్తారని అనుకునేదాన్ని. ఈ 5కే రన్లో 35 మంది మహిళలు చీరలో రన్నింగ్ చేశారు. అది చూసి నాకు చాలా సంతోషంగా అనిపించింది. నా స్నేహితులు దీప్తి, సునీత కూడా మంచి రన్నర్స్. వారితోనే ఎక్కువగా రన్నింగ్ ఈవెంట్స్‌లో పాల్గొంటాను. నా కోచ్ జై సూర్య రన్నింగ్‌కు సంబంధించిన మెలకువలు నేర్పిస్తాడు. నేను రన్లో పేసర్‌గా కూడా బాధ్యతలు నిర్వర్తిస్తాను. రన్లో వెనకబడిపోయిన వారిని గమ్యం చేరేలా మోటివేట్ చేయడం పేసర్ బాధ్యత.
కొందరు వైటథాన్, మారథాన్, సైక్లింగ్ ఈవెంట్స్‌లో నేను చీరకట్టులో పాల్గొనడంపై అసంతృప్తి వ్యక్తం చేసేవారు. చీరలో ఎందుకు రావడం.. ఇలాంటి కార్యక్రమాలకు తగిన దుస్తులు ధరించడం మంచిది కదా అనేవారు. అయితే నా ఉద్దేశం వారికి తెలియదు. గచ్చిబౌలి, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, హైటెక్ సిటీ తదితర ప్రాంతాల్లో మహిళలు, యువతులు పెద్ద ఎత్తున మారథాన్‌లో పాల్గొంటారు. అందులో చాలామందికి చీరకట్టుకోవడం తెలియదు. నేను ప్రతీ కార్యక్రమంలో తగ్గిపోతున్న చీరకట్టు ప్రాధాన్యాన్ని చాటాలని ప్రయత్నిస్తుంటా. నాటి మన చీరకట్టు ఎంత ఘన మైందో.. నేడు ఆ చరిత్ర ఎందుకు మరిచిపోతున్నామో గుర్తు చేస్తుంటాను. మొదట్లో చీరకట్టుకుని ఇలాంటి ఈవెంట్స్‌లో పాల్గొన్నప్పుడు కొంచెం ఇబ్బందిపడేదాన్ని. అందరూ సంబంధిత ఈవెంట్ దుస్తులు ధరిస్తే నేనొక్కదాన్నే చీర కట్టుకోవడం అవసరమా అనిపించేది. కానీ నా లక్ష్యం చీర గొప్పతనం కాపాడటం. కాబట్టి.. అది ఎక్కువమందిని చేరుకోవాలనే ఉద్దేశంతో ప్రతీ ఈవెంట్లో చీరతో పాల్గొంటాను.
మన చీరలకు గిన్నిస్ రికార్డు చరిత్ర ఉంది. నేను ప్రతీ సోమవారం చేనేత దుస్తులను ధరిస్తాను. సిరిసిల్ల చేనేత చీరలకు ప్రసిద్ధి. చేనేత నిపుణుడు నల్లా పరంధాములు అగ్గిపెట్టెలో పట్టే చీరను నేసి 1990లో ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. అటువంటి చేనేతను కాపాడిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిది. ఇప్పుడు చేనేత దుస్తులు ధరించడం ఒక ఉద్యమంలా తీసుకొచ్చింది. చీర ఎలాంటి వాతావరణానికైనా అనువుగా ఉంటుంది. చందేరి, మహేశ్వరి, బాందిని, పైతాని, పటోలా, మైసూర్ సిల్క్, కంచిపట్టు, చెట్టినాడు, పోచంపల్లి, గద్వాల, బనారస్ పట్టుచీరలు విదేశాలోన్లూ ప్రాచుర్యం పొందాయి. అయితే చీరకట్టును కాపాడుకోవాల్సిన బాధ్యత ఈ తరంపైన ఉంది.
-సుధా, మారథాన్ రన్నర్.
-ఇడుమాల కిరణ్ కుమార్
-నర్రె రాజేశ్వర్