ఏటవాలు పథంపై పాదరసంలా కదిలిపోతుంది. గాలివాలులో నావలా గిర్రున తిరుగుతుంది. నాగుపాములా మెలికలతో మాయచేస్తుంది. బిరబిర పరిగెడుతూ, గిరగిర తిరుగుతూ చేసే జంపింగ్స్ చూపరులకు కంగారు పుట్టిస్తాయి. ప్రదర్శించే విన్యాసాలూ ఔరా! అనిపిస్తాయి. అరుదైన రోలర్ స్కేటింగ్‌లో ఆర్టిస్టిక్ స్కేటర్‌గా అద్భుత విన్యాసాలు ఆవిష్కరిస్తున్నది.. హైదరాబాదీ చిన్నది 17 ఏండ్ల ఖ్యాతి. పేరుకు తగ్గట్లే చిన్నవయసులోనే అనేక పతకాలతో ‘ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్’లో చోటు సాధించి, స్కేటింగ్ క్వీన్‌గా ఖ్యాతి గడించిన ఆ బాలిక ‘జిందగీ’తో పంచుకున్న కబుర్లు..
స్కేటింగ్ వైవిధ్యమైన క్రీడ. చూసేవాళ్లకు ఎంత వింతగా ఉంటుందో, ప్రదర్శించే వాళ్లకు అంత కష్టంగానూ ఉంటుంది. రోలర్ స్కేటింగ్ (నేలపై చేసేది) విభాగంలో.. ఆర్టిస్టిక్ స్కేటింగ్ మరింత ప్రత్యేకమైంది. రకరకాల విన్యాసాలు చేయాల్సి ఉంటుంది. ఒకరకంగా చెప్పాలంటే ఇదీ నృత్యం లాంటిదే! చిన్నప్పుడు మేం మారేడ్‌పల్లిలో ఉండేవాళ్లం. మా ఇంటి పక్కనే యామా స్కేటింగ్ అకాడమీ ఉండేది. బాల్కనీలో నిలబడి అక్కడ స్కేటర్లు చేస్తున్న విన్యాసాలు చూస్తూ కాలక్షేపం చేసేదాన్ని. అప్పుడు నాకు ఎనిమిదేండ్లు. ‘నేనూ స్కేటింగ్ నేర్చుకుంటా’ అని ఇంట్లో అడిగాను. మా అమ్మకు కూడా పిల్లలకు ఏదో ఒక క్రీడ నేర్పించాలని ఉండేది. నా ఆసక్తిని గమనించి స్కేటింగ్ అకాడమీలో జాయిన్ చేసింది.
స్కూలింగ్.. స్కేటింగ్..
మా నాన్న శ్రీధర్, అమ్మ చండీ ప్రసన్న. ఇద్దరూ ఆర్కిటెక్ట్‌లే. సొంతంగా సీకాన్ అనే కన్సల్టెన్సీ పెట్టారు. నేను, చెల్లి కాంతి ఇద్దరం స్కేటర్లమే. యామా అకాడమీలో చేరిన ఏడాదిన్నరకే పోటీల్లో పాల్గొన్నా. తొమ్మిదేండ్ల వయసులో టోర్నమెంట్లకు వెళ్లి మెడల్స్ సాధించడంతో ఈ క్రీడలో రాణించగలననే నమ్మకం ఏర్పడింది. మొదట్లో స్కేటింగ్, చదువు మేనేజ్ చేయడం కష్టంగా ఉండేది. తర్వాత తర్వాత జీవితంలో రెండూ ముఖ్యమైనవే అనిపించింది. చదువును నిర్లక్ష్యం చేయకుండానే స్కేటింగ్‌లో ప్రావీణ్యం సాధించాను. రోజూ తెల్లవారుజామున మూడున్నరకే నిద్రలేచి, నాలుగు గంటలకల్లా స్కేటింగ్ రింక్‌లో ఉండేదాన్ని. మొదట్లో మారేడ్‌పల్లి అకాడమీలో ప్రాక్టీస్ చేసేవాళ్లం. కొన్నిరోజులకు జింఖానా గ్రౌండ్స్‌లో మాకు రింక్ వచ్చింది. ఉదయం 4 నుంచి 6 గంటల వరకు ప్రాక్ట్టీస్ చేసేదాన్ని. ఇంటికి వచ్చి 7 గంటలకల్లా స్కూల్ బస్ ఎక్కేదాన్ని. సాయంత్రం బడి నుంచి రాగానే మళ్లీ రెండు గంటలు ప్రాక్టీస్. ఆ తర్వాత హోమ్‌వర్క్ చేసుకొని, చదువుకొని పడుకునేదాన్ని. అమ్మానాన్న ప్రోత్సాహంతోనే ఇదంతా సాధ్యమైంది. ప్రస్తుతం, నా ఇంటర్ పూర్తయింది. బి.ఆర్క్ ఎంట్రన్స్ కోసం ప్రిపేర్ అవుతున్నాను. చెల్లి తొమ్మిదో తరగతి. తను ఆరేండ్లున్నప్పుడే మెడల్స్ సాధించింది. ఇద్దరం సలహాలు ఇచ్చిపుచ్చుకుంటాం.
గురువుల ప్రోత్సాహం
యామా స్కేటింగ్ అకాడమీలో నా తొలిగురువు వీరేశ్ సర్. ఏడాదిపాటు ఆయన శిక్షణలో నేర్చుకున్నా. తర్వాత నుంచి ఆయన పెద్ద కొడుకు అమర్‌నాగ్ యామా సర్ నాకు ట్రైనింగ్ ఇస్తున్నారు. ఆయన గేమ్ విషయంలో చాలా స్ట్రిక్ట్‌గా ఉంటారు. అమర్గారి తమ్ముడు అనూప్ కుమార్ సర్ స్కేటింగ్‌లో అర్జున అవార్డు గ్రహీత. ఎన్నో అంతర్జాతీయ పోటీల్లో పతకాలు సాధించారు. టోర్నమెంట్‌కు ఎలా సన్నద్ధం కావాలో సూచనలిస్తుంటారు. ఇలాంటి గురువులు లభించడం నిజంగా నా అదృష్టం.
వారి అండతోనే ఎన్నో టోర్నమెంట్లలో పతకాలు సాధించాను. చిన్నప్పటి నుంచీ మా స్కూల్ టీచర్స్ కూడా బాగా ప్రోత్సహించేవాళ్లు. నేను కాంపిటీషన్లకు వెళ్లినప్పుడు క్లాసులేమైనా మిస్సయితే, నాకోసం ప్రత్యేకంగా చెప్పేవారు. ముఖ్యంగా టెన్త్ క్లాస్‌లో ఉన్నప్పుడు చదువు విషయంలో నాకు చాలా సాయపడ్డారు. కాబట్టే ధైర్యంగా పోటీల్లో పాల్గొనగలిగాను. ఫ్రెండ్స్ సపోర్ట్ కూడా చాలా ఎక్కువే.
అంతర్జాతీయ స్థాయిలో..
నా స్కేటింగ్ జర్నీ 2013లో నాలుగు రజత పతకాలతో మొదలైంది. అప్పటికి నా వయసు తొమ్మిదేండ్లు. ఆ మరుసటి ఏడాది అయిదు బంగారు పతకాలు సాధించాను. తర్వాత హైదరాబాద్ చాంపియన్‌షిప్స్‌లో ఎన్నో బంగారు, రజత పతకాలు వరించాయి. జాతీయస్థాయిలోనూ వివిధ రాష్ర్టాలతో పోటీపడి బంగారు, వెండి పతకాలు సొంతం చేసుకొన్నాను. 2018లో దక్షిణ కొరియాలో జరిగిన 18వ ఏషియన్ రోలర్స్ స్కేటింగ్ చాంపియన్‌షిప్‌లో రజత పతకం గెలిచాను. 2020లో జరగాల్సిన ఆ టోర్నమెంట్ కరోనా కారణంగా రద్దయింది. భవిష్యత్‌లో మరిన్ని అంతర్జాతీయ పోటీల్లో పాల్గొని పతకాలు సాధిస్తాను. ఆర్టిస్టిక్ రోలర్‌గా ‘ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్’లో చోటు దక్కడం గర్వించదగ్గ విషయం. ఆరేండ్లలో 71 పతకాలు (అందులో.. జిల్లాస్థాయిలో 33, రాష్ట్ర స్థాయిలో 9, ఒక అంతర్జాతీయ పతకం కూడా ఉన్నాయి) పొందాను. ఈ ప్రయాణం ఇలాగే కొనసాగుతుందని ఆశిస్తున్నాను. దేశానికి ప్రాతినిధ్యం వహించి, అంతర్జాతీయ గుర్తింపు తెచ్చుకోవాలన్నదే నా ఆశయం.
… నిఖిత నెల్లుట్ల
వరల్డ్ చాంపియన్ అవ్వాలి
మా గురువు అనూప్ సర్లా ప్రపంచస్థాయి క్రీడాకారిణిగా గుర్తింపు సాధించాలి. చదువు విషయానికి వస్తే అమ్మానాన్నలా ఆర్కిటెక్ట్ అవ్వాలని ఉంది. అందుకే కష్టపడి చదువుతున్నా. ఇప్పుడిప్పుడే స్కేటింగ్‌కు మంచి గుర్తింపు వస్తున్నది. స్కేటర్స్కు ప్రజల్లో ఆదరణ పెరగాలని నా ఆశ. స్కేటింగ్ అనేకాదు, ఆడపిల్లలు నచ్చిన రంగాల్లో రాణించేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలి. అప్పుడే అద్భుతాలు సాధిస్తారు.