గేమింగ్ ప్రియులను దృష్టిలో పెట్టుకొని చైనాకు చెందిన ఐక్యూ సంస్థ.. సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను రూపొందించింది. ‘ఐక్యూ 15 అల్ట్రా’ పేరుతో.. ప్రీమియం గేమింగ్, ఫ్లాగ్షిప్ మోడల్‌ను విడుదల చేయనున్నది. ఈ స్మార్ట్‌ఫోన్.. ఆధునిక గేమింగ్‌ను మరోమెట్టు ఎక్కించగలదని సంస్థ ప్రతినిధులు అంటున్నారు. ఎంత పెద్ద వీడియో గేమ్స్ అయినా స్మూత్‌గా రన్ చేయడానికి.. ఇందులో అత్యంత వేగవంతమైన స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 ప్రాసెసర్‌ను వాడారు. 16 జీబీ ర్యామ్‌తో.. ఫోన్ ఎలాంటి ల్యాగ్ లేకుండా పనిచేస్తుంది. గేమర్లకు చికాకు కలిగించే హీట్ సమస్యకు పరిష్కారంగా.. మెరుగైన కూలింగ్ కోసం ఇందులో ఐస్డోమ్ ఎయిర్ కూలింగ్ సిస్టమ్‌ను పొందుపరిచారు. కళ్లకు ఇబ్బంది కలగకుండా.. 6.85-అంగుళాల 2కే OLED డిస్ప్లేను ఏర్పాటు చేశారు.
65 Hzహై రిఫ్రెష్ రేట్ సపోర్ట్ ఉండటం వల్ల గేమింగ్ మరింత స్మూత్‌గా నడుస్తుంది. ఇక గేమింగ్ కన్సోల్ లాంటి అనుభవం కోసం ప్రత్యేకంగా షోల్డర్ ట్రిగ్గర్ బటన్లు కూడా ఉన్నాయి. కెమెరాల విషయానికి వస్తే.. 50 ఎంపీ ప్రధాన కెమెరా, 50ఎంపీ అల్ట్రా వైడ్, 50ఎంపీ సోనీ పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్‌ను అందిస్తున్నారు. 3x ఆప్టికల్ జూమ్ సపోర్ట్‌కూడా అందిస్తాయి. బ్యాటరీ, చార్జింగ్లోనూ అదిరిపోయే ఫీచర్లు అందిస్తున్నారు. 7,400 ఎంఏహెచ్ బ్యాటరీ ఏర్పాటు చేయగా, 100 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సర్, డాల్బీ అట్మాస్ స్టీరియో స్పీకర్లు, ఐపీ68/ఐపీ 69 వాటర్/డస్ట్ రెసిస్టెన్స్ లాంటి మరిన్ని ఫీచర్లు ఉన్నాయి. మెటల్ ఫ్రేమ్‌తో మరింత ప్రీమియం లుక్ అందిస్తుంది.