మార్కెట్లో ప్యాక్ చేసిన ఫుడ్ ఐటమ్స్ కొనేటప్పుడు జాగ్రత్తగానే ఉంటాం. కానీ, ఈ ప్యాక్‌లపై ఆకట్టుకునే బొమ్మలు చూసినంతగా వాటి మీద రాసిన వివరాలు పట్టించుకోం. కారణం సరైన అవగాహన లేకపోవడమే. ప్రతి ఫుడ్ ప్యాకెట్‌పై ముద్రించిన సూచికలు.. ఆ వస్తువు తయారీకి ఉపయోగించిన ఆహార పదార్ధాలు, ఏయే పోషకాలు ఎంతెంత ఉన్నాయి? అది ఎంతకాలానికి పాడవుతుంది? అలర్జీని కలిగించేవి ఏవైనా ఉన్నాయా? ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్స్ నంబర్ తెలియజేస్తాయి. కొనుగోలుదారులు వీటిని చదివి ఎంపిక చేసుకునేందుకు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) కొన్ని ప్రమాణాలను నిర్దేశించింది. వాటి పట్ల అవగాహన లేక కంపెనీల ప్రచారాలనే నమ్మి చాలామంది కొనేస్తుంటారు.
కాబట్టి ప్యాక్‌పై ఉండే అయిదు రకాల సూచికలను తప్పకుండా చదివి, అర్థం చేసుకున్న తర్వాత కొనమని ఎఫ్ఎస్ఎస్ఏఐ సూచిస్తున్నది. ఈ పట్టికలో మొదటి మూడు ఆ ఫుడ్‌లో ఉండే ఆహార పదార్థాల వివరాల్ని తెలుపుతాయి. కాబట్టి ఏం తింటున్నామో తెలుసుకునేందుకు మొదటి మూడింటిపై ఆధారపడాలి. ఇంగ్రిడియెంట్స్ జాబితాలో మొదటి మూడిటిలో యాడెడ్ షుగర్, మైదా, హైడ్రోజనేటెడ్ ఆయిల్ ఉంటే ఆ ఆహారం ఆరోగ్యానికి అంత మంచిది కాదు. పోషక విలువల విషయానికి వస్తే.. అందులోని క్యాలరీలు, ప్రొటీన్లు, ఫైబర్, ఫ్యాట్, ఇతర పోషకాలు ఎంతున్నాయన్న వివరాలు కూడా ముద్రించి ఉంటాయి. శారీరక అవసరాలను బట్టి ఎంత తినాలి? ఎవరు తినకూడదో దీనిని బట్టే నిర్ణయించుకోవాలి. స్టోరేజ్ డేట్‌ని తప్పకుండా చూడాలి. ఇంకా ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్స్ నంబర్ ఆధారంగా ఆ ఆహార ఉత్పత్తి గురించి పూర్తిగా తెలుసుకోవచ్చు.