నిట్ వరంగల్‌లో స్ప్రింగ్ స్ప్రీ ఉత్సాహంగా కొనసాగుతోంది. రెండో రోజూ శుక్రవారం విద్యార్థులు పలు ఈవెంట్లను ప్రదర్శించారు. ఉదయం 11 నుంచి రాత్రి 11 గంటల వరకు సందడి చేశారు. ఐపీఎల్ ప్లేయర్ల వేలం నుంచి మొదలు సీడీ పెయింటింగ్, కరౌకే, పాప్డార్ట్(బెలూన్స్ టాస్క్‌లు), ఫిట్ఫిస్టా(ఫిట్నెస్ క్లబ్), ఇమేజ్ స్టార్టర్స్, డబుల్ స్ర్కైబుల్, కుండల తయారీ, హ్యాండ్ ప్రింట్స్, ఫిల్మ్ హౌస్ తదితర ఈవెంట్లు అలరించాయి. మధ్యాహ్నం 3 గంటలకు అంబేద్కర్ లెర్నింగ్ సెంటర్లో లెట్స్ టాక్ టు సుమ కనకాల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో యాంకర్ సుమ ముచ్చటించారు.
– హనుమకొండ చౌరస్తా, ఏప్రిల్ 7
హనుమకొండ చౌరస్తా, ఏప్రిల్ 7 : వరంగల్ నిట్‌లో వసంత్సోవ వేడుక(స్ప్రింగ్ స్ప్రీ) శుక్రవారం రెండో రోజూ హుషారుగా సాగింది. కళాధ్వని పేరిట ఏర్పాటుచేసిన ఈ ఉత్సవాల్లో విద్యార్థుల సృజనాత్మకతను వెలికితీసేలా, నూతన ఆవిష్కరణలకు ఊతమిచ్చేలా ఈవెంట్లు కొనసాగాయి. వీటిలో పాల్గొనేందుకు దేశంలోని 600 ఇంజినీరింగ్ కళాశాలల నుంచి సుమారు 10వేల మంది విద్యార్థులు తరలివచ్చి సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా నైపుణ్యాలను ప్రదర్శించిన తీరు ఆకట్టుకుంది. ఇలా 60కి పైగా ఈవెంట్లతో నిట్ ఆవరణలో ఎటుచూసినా సందడిగా నెలకొంది. చల్లని సాయంత్రం వేళ డీజే పాటలకు స్టెప్పులు వేస్తూ ఎంజాయ్ చేశారు. కేరింతలు కొడుతూ సరదాగా గడిపారు. ఉల్లాసంగా.. ఉత్సాహంగా నృత్యాలు చేస్తూ మైమరిపోయారు.
న్యూఅకాడమిక్ బిల్డింగ్‌లోని వివిధ తరగతి గదుల్లో విద్యార్థుల ఈవెంట్లు ఆలోచింపజేశాయి. మొదటిరోజు ఉదయం 11నుంచి రాత్రి 11గంటల వరకు వివిధ ఈవెంట్లతో సరదాగా గడిపారు. రెండో రోజు ఐపీఎల్ ప్లేయర్ల వేలం పాట మొదలు సీడీ పెయింటింగ్, కరౌకే, పాప్డార్ట్(బెలూన్స్ టాస్క్‌లు), ఫిట్ఫిస్టా(ఫిట్నెస్ క్లబ్), ఇమేజ్ స్టార్టర్స్, డబుల్ స్ర్కైబుల్, కుండల తయారీ, హ్యాండ్ ప్రింట్స్, ఫిల్మ్హౌస్ ఇంకా అనేక వినూత్న కార్యక్రమాలను ఏర్పాటుచేశారు. గ్రామీణ నేపథ్యాన్ని సంతరించుకున్నట్లు కుండల తయారీ విద్యార్థులను ప్రత్యేకంగా ఆకట్టుకుంది.
విద్యార్థులు ఆసక్తిగా చూసి స్వయంగా వారి చేతులతో తయారు చేసి సంబురపడ్డారు. ఇంకా మైక్రో ఆర్టిస్ట్ మట్టెవాడ అజయ్‌కుమార్ బంగారంతో రూపొందించిన సుమారు 20 రకాల సూక్ష్మ వస్తువులను ప్రదర్శనగా ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 3గంటలకు అంబేద్కర్ లర్నింగ్ సెంటర్లో ‘లెట్స్ టాక్ టు సుమ కనకాల’ కార్యక్రమం నిర్వహించగా విద్యార్థులతో ఆమె ముచ్చటించారు. విద్యార్థులు వేసిన ప్రశ్నలకు సమాధానాలిస్తూ వారిలో ఉత్తేజాన్ని నింపారు. సాయంత్రం డీజే పాటలతో నృత్యాలు చేస్తూ విద్యార్థులు ఎంజాయ్ చేస్తూ కేరింతల నడుమ సరదాగా గడిపారు. రాత్రి 10గంటలకు బెదురులంక-2012 చిత్ర బృందంతో ముచ్చటించారు. నిట్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఎన్వీ రమణారావు, స్టూడెంట్ వెల్ఫేర్ డీన్ ప్రొఫెసర్ పులి రవికుమార్, సివిల్ ఇంజినీరింగ్ విభాగం ఫ్యాకల్టీ అడ్వైజర్ ప్రొఫెసర్ ఎం.హీరాలాల్, స్టూడెంట్ కోఆర్డినేటర్స్ పాల్గొన్నారు.
సీడీ పెయింటింగ్ అదరహో..
విద్యార్థుల్లోని సృజనాత్మకతను వెలికితీసేందుకు ఏర్పాటుచేసిన సీడీ పెయింటింగ్ ఆకట్టుకుంది. ఇదివరకు పెయింటింగ్ అంటే పేపర్ లేదా వాల్ పెయింటింగ్ చేసేవారు కానీ.. ఈసారి వెరైటీగా ఉండాలని ఆలోచించి ఈ పోటీ పెట్టారు. ఇందులో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని ప్రతిభను చాటేందుకు పోటీపడ్డారు. సంస్కృతీ సంప్రదాయాలను ప్రతిబింబించేలా సీడీపై పెయింటింగ్ వేయగా మరికొందరు విద్యార్థులు పర్యావరణాన్ని కాపాడేలా చిత్రాలు వేసి అదరహో అనిపించారు.
కరౌకే చిల్
కరౌకే కార్యక్రమం ప్రత్యేకంగా అందరినీ చిల్ చేసేలా రూపొందించారు. ఒక రూంలో మొత్తం చీకటి చేసి డిస్కో లైట్స్ పెడతారు. ఇందులో పాటల ట్యూన్, లిరిక్స్‌తో పాటలు చెప్పలేనివారు ఎమోషన్స్ ద్వారా తెలియజేయాలి. ఇందులో విద్యార్థులు వారి నైపుణ్యాలను ప్రదర్శించేందుకు ఉత్సాహాన్ని చూపించారు. అంతేకాకుండా నేటి పోటీ ప్రపంచంలో జీవన విధానంలో ఒత్తిడికి గురయ్యేవారికి చిల్ అయ్యేలా దీనిని ఏర్పాటు చేశారు. కడుపులో దాచుకున్న వారి బాధను, కష్టాన్ని, సంతోషాన్ని, ఎమోషన్స్‌ను తెలియజేసేలా విద్యార్థులు తమ్మిశెట్టి సాయిసాత్విక్, వెంకట్, షబ్నూర్ రూపొందించారు.