ప్రకృతి మనల్ని ఎప్పుడూ ఆశ్చర్యపరుస్తూ ఉంటుంది. నేచర్ అంటేనే ఓ అద్భుతం. మనం సాధారణంగా యూకలిప్టస్ చెట్లను చూసుంటాం. వీటి బెరడుతోనే వైట్ పేపర్‌ను తయారుచేస్తూ ఉంటారు. అయితే, రెయిన్బో యూకలిప్టస్ బెరడును ఒలిచినప్పుడల్లా ఓ అద్భుతం జరుగుతుంది. చెట్టు మొత్తం ఇంధ్రదనస్సులా మారిపోతుంది. ఈ ఫొటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఇంధ్రదనుస్సులా మెరిసిపోతున్న రెయిన్బో యూకలిప్టస్ చెట్ల ఫొటోలను ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత నంద ట్విటర్లో షేర్ చేశారు. ఆయన షేర్ చేసిన ఫొటోలు చూస్తే అంతా ఫొటోషాప్‌లో మార్చిన ఫొటో అనుకుంటారు. కానీ అవి నిజంగా యూకలిప్టస్ చెట్లే. వీటి బెరడు తొలగిపోయినప్పుడల్లా ఇలా సప్తరంగుల్లో మెరిసిపోతాయట. ఈ రెయిన్బో యూకలిప్టస్ సముద్ర మట్టం నుంచి 1,800 మీ (5,900 అడుగులు) వరకు లోతట్టు, దిగువ పర్వత వర్షారణ్యాలలో పెరుగుతాయి. ఇవి ఇండోనేషియా, పాపువా న్యూ గినియా, ఫిలిప్పీన్స్‌కు చెందినవి. కానీ ఇతర దేశాల్లోనూ ఇప్పుడు విస్తృతంగా కనిపిస్తున్నాయి.