హైదరాబాద్, ఆగస్టు 24 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల గ్రామ పంచాయత్ సమగ్ర అభివృద్ధి ప్రణాళిక (జీపీ-సాప్) పోర్టల్‌ను అట్టహాసంగా ప్రారంభించింది. గ్రామ పంచాయతీల అభివృద్ధి ప్రణాళికలు, గ్రామసభ ఆమోదించిన వార్షిక ప్రణాళికలు, పనుల పురోగతిని ఆన్లైన్ ద్వారా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలన్న లక్ష్యంతో ఈ పోర్టల్‌ను తీసుకొచ్చింది. ప్రతి గ్రామంలోని ప్రస్తుత పరిస్థితి, అభివృద్ధి అవసరాలు, భవిష్యత్ లక్ష్యాలు, వార్షిక ప్రణాళిక, పనుల అమలు వంటి అంశాలను ఒకే వేదికపైకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తున్నది. అయితే, తెలంగాణలో ఇప్పటికే ఈ-పంచాయత్, పల్లె సమగ్ర సేవా కేంద్రం, ఈ-గ్రామ్ స్వరాజ్, ఈ- పంచాయత్ సిటిజన్ పోర్టల్ లాంటి ఆన్లైన్ వేదికలు అందుబాటులో ఉన్నాయి.
అయినప్పటికీ తాజాగా రాజేంద్రనగర్‌లోని జాతీయ గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ సంస్థ (ఎన్ఐఆర్డీపీఆర్)లో మంత్రులు ప్రారంభించిన జీపీ-సాప్ పోర్టల్ పారదర్శకతపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ పోర్టల్‌లోని సమాచారం తొలి ముసాయిదా, తాతాలిక డాటా మాత్రమేనని ప్రభుత్వం పేరొనడం, శాఖలవారీగా పూర్తి సమగ్రత లేకపోవడం, పనుల పురోగతిని ప్రజలు ఎలా కొలువగలరనే దానిపై స్పష్టత లేకపోవడం లాంటి అంశాలు ఈ పోర్టల్ నిర్వహణపై అనుమానాలు రేకెత్తిస్తున్నాయి.
https://gpsap-prrd.telangana.gov.in/gpprofile/ లింకును ఓపెన్ చేసి పోర్టల్‌లో ముందుగా జిల్లా, మండలం, గ్రామపంచాయతీని ఎంపికచేస్తే సంబంధిత గ్రామపంచాయతీకి ప్రత్యేకంగా రూపొందించిన పబ్లిక్ ప్రొఫైల్ వస్తుంది. ఇందులో ప్రజాప్రతినిధుల వివరాలు.. (ఆ గ్రామ సర్పంచ్ ఎవరు? ఎంత మంది వార్డు సభ్యులు ఉన్నారు? వారి సంఖ్య ఎంత? అనే వివరాలు) మాత్రమే కనిపిస్తున్నాయి. ప్రస్తుతం పోర్టల్‌లో ఎలాంటి అప్డేట్ లేనందున పాత, తప్పుడు గణాంకాలే దర్శమనిస్తున్నాయి.
ప్రస్తుతం జీపీ-సాప్ ప్రధానంగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ పరిధిలోనే ఉన్నప్పటికీ భవిష్యత్తులో వ్యవసాయం, ఆరోగ్యం, విద్య, మహిళా-శిశు సంక్షేమం తదితర శాఖలను అనుసంధానించే ఉద్దేశం ఉన్నట్టు పోర్టల్‌లో పేర్కొన్నారు. ఇదే ఇప్పుడు ఈ పోర్టల్‌కు అసలు పరీక్షగా మారింది. ఒక గ్రామానికి తాగునీటి సమస్య ఉంటే అది పంచాయతీతోపాటు మిషన్ భగీరథ, ఆరోగ్యం, పారిశుద్ధ్యం లాంటి అనేక అంశాలతో ముడిపడి ఉంటుంది. కాబట్టి అన్ని శాఖల ప్రణాళికలు, నిధులు, పనుల పురోగతి ఒకే వేదికపైకి వచ్చినప్పుడే ‘సమగ్ర అభివృద్ధి ప్రణాళిక’ అనే పేరుకు సార్థకత చేకూరుతుంది. పోర్టల్‌లోని సమాచారాన్ని తొలి ముసాయిదా, తాతాలిక డాటాగా పేరొనడం మరో కీలక అంశం. అసలు జీపీ-సాప్ పోర్టల్ ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తుందన్న అంశంపై మంత్రులు, అధికారులెవరూ స్పష్టత ఇవ్వకపోవడం కొసమెరుపు.