అది ముమ్మాటికీ రేవంత్ రక్షణ సేన
‘మాజీ ఎమ్మెల్సీ కవిత ఏర్పాటుచేసిన తెలంగాణ రక్షణ సేన పార్టీ.. ముమ్మాటికీ రేవంత్ రక్షణ సేన. సీఎం సౌజన్యం, పాంచజన్యం ఎజెండాతోనే ఆ పార్టీ పురుడుపోసుకొన్నది.
- ముఖ్యమంత్రి సౌజన్యంతోనే కవిత సొంత పార్టీ
- కాంగ్రెస్‌కు టీఆర్ఎస్ నాలుగో అనుబంధ సంస్థ ‘ఆడికోర్ ఇన్ఫ్రా’లో రేవంత్, కవిత డైరెక్టర్లు
- సృజన్‌రెడ్డి కో డైరెక్టర్
- ప్రతిపక్షంపై దాడి దుర్మార్గం
- ఆమె స్క్రిప్ట్‌నే సిద్దిపేటలో రేపు రేవంత్ చదువుతారు
- బీఆర్ఎస్ అధికార ప్రతినిధి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్
హైదరాబాద్, నవంబర్ 14 (నమస్తేతెలంగాణ): ‘మాజీ ఎమ్మెల్సీ కవిత ఏర్పాటుచేసిన తెలంగాణ రక్షణ సేన పార్టీ.. ముమ్మాటికీ రేవంత్ రక్షణ సేన. సీఎం సౌజన్యం, పాంచజన్యం ఎజెండాతోనే ఆ పార్టీ పురుడుపోసుకొన్నది. కాంగ్రెస్‌కు అది నాలుగో అనుబంధ సంఘంగా కొనసాగుతూ రేవంత్‌రెడ్డిపై ఈగవాలనివ్వకుండా కాపాడుతున్నది’ అని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ సంచలన ఆరోపణలు చేశారు. ఇందుకు సంబంధించిన ఆధారాలను బయటపెడుతానని ఆయన ప్రకటించారు.
హైదరాబాద్ తెలంగాణ భవన్లో శనివారం కార్పొరేషన్ మాజీ చైర్మన్లు పల్లె రవికుమార్, రామచంద్రనాయక్, పార్టీ నాయకులు కల్వకుర్తి శ్రీనివాస్‌యాదవ్, రాజుతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. సిద్దిపేటలో కవిత చేసిన నిరాధార ఆరోపణలపై తీవ్రంగా స్పందించారు. కవితను బీఆర్ఎస్ నుంచి బహిష్కరించి దుర్మార్గమైన దోపిడీ, పెనుముప్పు నుంచి తెలంగాణను రక్షించిన కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. నిజంగా టీఆర్ఎస్ ప్రజల పక్షాన పోరాడేందుకు ఏర్పాటుచేసిన పార్టీ అయితే, అధికార కాంగ్రెస్ దోపిడీని నిలదీయకుండా.. ప్రతిపక్ష బీఆర్ఎస్పైనే ఎందుకు దాడిచేస్తుంది? అని సూటిగా ప్రశ్నించారు. సీఎం రేవంత్‌రెడ్డి, కవిత కలిసే బీఆర్ఎస్పై కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు.
అధికార కాంగ్రెస్‌ను వదిలి నిత్యం తన తండ్రి కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావుపై విమర్శలు చేయడంలోని ఔచిత్యమేంది? కన్నతండ్రిని మరమనిషి అని దూషించడంలోని మర్మమేంది? అని నిలదీశారు. బీఆర్ఎస్ నేతలపై నిత్యం గళమెత్తుతున్న టీఆర్ఎస్..కాంగ్రెస్‌కు అనుబంధ సంస్థ కాకుంటే మరేంది? అని ప్రశ్నించారు. ఎన్ని కేసులు పెట్టినా, వేధింపులకు దిగినా అధికార పార్టీ దోపిడీపై ప్రతిపక్ష బీఆర్ఎస్ పోరాడుతుంటే.. కవిత పార్టీ అధికార పార్టీకే వంతపాడుతున్నదని మండిపడ్డారు. తెలంగాణ ప్రజలకు ఎవరేందో స్పష్టంగా తెలుసని ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ పేర్కొన్నారు.
ఒకే కంపెనీలో ఆ ముగ్గురూ భాగస్వాములు
ఆడికోర్ ఇన్ఫ్రా కంపెనీలో 2012లో రేవంత్‌రెడ్డి, 2010లో కవిత డైరెక్టర్లు కాగా, సూదిని సృజన్‌రెడ్డి (రేవంత్‌రెడ్డి బావమరిది) కో డైరెక్టర్‌గా ఉన్నారని ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ సంచలన విషయాలు వెల్లడించారు. ఇది కల్పితం కాదని, పచ్చి నిజమని స్పష్టంచేశారు. రేవంత్‌రెడ్డి, కవిత, సృజన్‌రెడ్డి కలిసి వ్యాపారాలు చేశారని, ఒకే చిరునామాతో 30 కంపెనీలు ఏర్పాటు చేశారని ఆరోపించారు. మల్లన్నసాగర్ భూకంపం జోన్లో నిర్మించారని కవిత చేసిన ఆరోపణలను ఆర్ఎస్పీ కొట్టిపారేశారు. ‘కేంద్ర జలసంఘం, జీఎస్ఐ నుంచి అనుమతులు వచ్చిన తర్వాతే 50 టీఎంసీల రిజర్వాయర్ నిర్మించారు. కేసీఆర్ ఆదేశాలు, హరీశ్‌రావు పర్యవేక్షణలో ఇంజినీర్లు నిర్ణయం తీసుకున్నారు’ అని గుర్తుచేశారు. ‘కవిత చదివింది కంప్యూటర్ ఇంజినీరింగ్.. ఆమె జియాలజీ ఎక్స్పర్ట్ కాదు.. సివిల్ ఇంజినీర్ అంతకన్నా కాదు..’ అని స్పష్టంచేశారు.
విజిలెన్స్ రిపోర్ట్ కవిత చేతికెలా వచ్చింది?
మల్లన్నసాగర్ నిర్మించిన ఇంజినీర్లపై రూపొందించిన విజిలెన్స్ రిపోర్ట్ ఆధారంగా ఇటీవల సిద్దిపేటలో కవిత మాట్లాడిన విషయాలను ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ప్రస్తావించారు. విజిలెన్స్ విభాగం తన నివేదికలను సీఎంకు పంపుతుందని, మరి ఆ రహస్య నివేదికలు కవిత చేతికి ఎలా వచ్చాయి? అని ప్రశ్నించారు. అంటే ఆమెకు సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చినట్టే కదా.. అది అధికార రహస్యాల ఉల్లంఘన కింద నేరం కాదా? అని నిలదీశారు. విజిలెన్స్ విభాగం వద్ద ఉండాల్సిన నివేదికలు కవిత వద్దకు ఎలా వెళ్తాయి? అని ప్రశ్నించారు.
నకిలీ లెటర్‌ప్యాడ్‌తో హరీశ్‌రావుపై అభాండాలు
మాజీ మంత్రి హరీశ్‌రావు నిమ్స్‌లో 200 కోట్ల స్కామ్ చేశారని కవిత కల్పిత ఆరోపణలు చేశారని ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ మండిపడ్డారు. ‘నిమ్స్‌లోని ఉద్యోగులకు ఈపీఎఫ్, జీపీఎఫ్ ఆప్షన్లు ఇవ్వగా చాలామంది ఈపీఎఫ్‌ను ఎంచుకున్నారు. అయితే మిగిలిన 232 ఉద్యోగులకు 2023లో మళ్లీ అవకాశం కల్పించగా జీపీఎఫ్‌లోకి మారారు. వాస్తవాలు ఇలా ఉంటే కవిత మాత్రం ఉద్యోగులు తనకు ఫిర్యాదు చేశారని పచ్చి అబద్ధాలు చెప్పారు’ అని ధ్వజమెత్తారు. సిద్దిపేటలో కవిత చూపిన లెటర్ నకిలీదని, అందులో తేదీ లేనేలేదని, రిజిస్ట్రేషన్ నంబర్ కూడా లేదని, ఫ్యాకల్టీ అండ్ జీపీఎఫ్ అసోసియేషన్ పేరిట లెటర్ వచ్చిందని, వాస్తవానికి నిమ్స్‌లో ఆ పేరుతో అసోసియేషన్ లేనేలేదని తేల్చి చెప్పారు. పెన్షనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ పేరిట మరోలేఖ వచ్చిందని ఆ సంఘం కూడా నిమ్స్‌లో లేదని, అంటే కవిత చూపింది ఫేక్ లెటర్‌ప్యాడ్ అని అర్థమవుతుందని స్పష్టంచేశారు.
తమ డబ్బులు జీపీఎఫ్ వారికి ఇస్తున్నారని ఈపీఎఫ్ ఎంప్లాయీస్ కవితను కలిశారనడం సత్యదూరం, ఎవరైనా ఉద్యోగులు తోటివారిపైనే ఫిర్యాదు చేస్తారా? అని ప్రశ్నించారు. ఆమె రేవంత్ పక్షమా? ఉద్యోగుల పక్షామా? ఉద్యోగులకు పెన్షన్ వస్తే మీకొచ్చిన నష్టమేంది? ఇందులో హరీశ్‌రావు చేసిన తప్పేంది? పెన్షన్ వద్దని ఎవరైనా ఉద్యోగి ఫిర్యాదు చేస్తారా? అని నిలదీశారు. జీపీఎఫ్ నుంచి ఈపీఎఫ్‌కు మార్చిన ఫైల్‌పై ఎంతోమంది డాక్టర్లు, మాజీ సీఎస్ రామకృష్ణారావు, రిజ్వీ సంతకాలు ఉన్నాయని గుర్తుచేశారు. కవితమ్మా? మరి మీరు వారిని ఎందుకు అడగడం లేదని ప్రశ్నించండి..నిర్ణయం ఎలా జరిగిందో నిలదీయండి అని సూచించారు. హరీశ్‌రావుపై సోయిలేకుండా మాట్లాడం.. నోటికొచ్చినట్టు ఆరోపణలు చేయడం సిగ్గుచేటని పేర్కొన్నారు. కవిత పేరు చెప్పి దవాఖానల వద్దకు ఎవరైనా వస్తే దవాఖానల ఉద్యోగులు నిలదీయాలని సూచించారు. కవితకు చేరుతున్న రికార్డులన్నీ రేవంత్ నుంచే వెళ్తున్నాయని, తప్పుడు నివేదికలు సృష్టించే శాఖను రేవంత్‌రెడ్డి సృష్టించి కవితకు అన్ని వివరాలు పంపుతున్నారని ఆరోపించారు.
ఇది ఫస్ట్ ఎపిసోడే.. అన్ని అంశాలు బయటపెడుతం
ఇది మొదటి ఎపిసోడ్ మాత్రమేనని, ఇంకా చాలా అంశాలను ఆధారాలతో సహా బయటపెడతామని ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ తేల్చిచెప్పారు. అబద్ధాలతో ఎకువకాలం రాజకీయాలు చేయలేరని స్పష్టంచేశారు. గతంలో కేటీఆర్‌పై తప్పుడు ఆరోపణలు చేసిన కొండా సురేఖ తన దిగొచ్చి క్షమాపణలు చెప్పారని, కవిత కూడా క్షమాపణలు చెప్పే రోజు వస్తుంది సిద్ధంగా ఉండండి.. అని స్పష్టంచేశారు. హరీశ్‌రావు, బీఆర్ఎస్ నేతలపై కవిత చేసిన నిరాధార ఆరోపణలను ఆయన ఖండించారు.
కవితను ముందు పెట్టి దోపిడీ ఎలా చేయాలో, బీఆర్ఎస్ గొంతు ఎలా నొకాలో రేవంత్‌రెడ్డి చేప్తున్నారని విమర్శించారు. కవిత రాజకీయాలకు పనికిరారని, రాజకీయ సన్యాసం తీసుకోవాలని హితవు పలికారు. తెలంగాణ రేవంత్ సేనను డీప్ ఫ్రీజ్‌లో పెట్టాలని కోరారు. కవిత చాలామంది బీఆర్ఎస్ నేతలపై ఆరోపణలు చేశారని, న్యాయపరంగా వెళ్లే అవకాశాలను పరిశీలిసామని చెప్పారు. సీఎం రేవంత్‌రెడ్డి బీఆర్ఎస్ నేతల భూములపై అక్రమంగా విచారణకు జీవో ఇచ్చారని, దానిపై తమకేం అభ్యంతరంలేదని, ఇందులో కాంగ్రెస్ నేతల భూములనూ చేర్చాలని ఆయన డిమాండ్ చేశారు.
ఫోన్ ట్యాపింగ్ విషయాలు సీఎంకెలా తెలుసు?
ఫోన్‌ట్యాపింగ్ కేసులో చాలా ఆశ్చర్యకర విషయాలు వస్తాయని సీఎం రేవంత్‌రెడ్డి అంటున్నారని, అసలు ఆయనకు ఆ విషయాలు ఎలా తెలుసు? ఆయనేమైనా సిట్ అధిపతా? ఎవరి పేర్లు పెట్టాలో? ఎలా చేయాలో సీఎం చెప్తారా? అని ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ప్రశ్నించారు. ‘రేవంత్‌రెడ్డి సూచనలతోనే కవిత సిద్దిపేట వెళ్లి ఆయన రాసిచ్చిన స్క్రిప్ట్ చదివారు. ఈ నెల 19న సిద్దిపేటకు వెళ్లనున్న సీఎం రేవంత్‌రెడ్డి.. అందులోని ఆంశాలనే మాట్లాడతారు’ అని పేర్కొన్నారు. కవితకు కామన్సెన్స్ లేకపోవడం నవ్వొస్తుందని పేర్కొన్నారు. ‘కొండపోచమ్మ సాగర్ కెపాసిటీ 15 టీఎంసీలు. ఆయకట్టు 1.2 లక్షల ఎకరాలు. అందులో కేసీఆర్ భూమి కూడా ఉన్నది. అందులోకి నీళ్లు వెళ్తే మీకేం ఇబ్బంది’ అని ప్రశ్నించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్

