సోలార్‌పై సీఎం సోది
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కట్టుకథలకు అంతులేకుండా పోతున్నది. తమ కుటుంబ చరిత్ర, రాజకీయ జీవితం, ముఖ్యమంత్రిగా తన పాలనపై తరుచూ నోటికొచ్చినట్టు అవాస్తవాలు చెప్తున్నారని ఇప్పటికే విమర్శలు ఉన్నాయి.
- కొండారెడ్డిపల్లిపై రేవంత్ కహానీ
- సోలార్‌తో ఇంటికి 20- 30 వేలు వచ్చాయన్న ముఖ్యమంత్రి
- వాటితోనే దసరా చేసుకున్నరట!
- నోరెళ్లబెట్టిన గ్రామస్తులు
- సగటున వచ్చినవి 8,500లోపే
మహబూబ్‌నగర్, అక్టోబర్ 24 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కట్టుకథలకు అంతులేకుండా పోతున్నది. తమ కుటుంబ చరిత్ర, రాజకీయ జీవితం, ముఖ్యమంత్రిగా తన పాలనపై తరుచూ నోటికొచ్చినట్టు అవాస్తవాలు చెప్తున్నారని ఇప్పటికే విమర్శలు ఉన్నాయి. తాజాగా తన సొంత గ్రామం కొండారెడ్డిపల్లి విషయంలోనూ రేవంత్‌రెడ్డి కొత్త కహానీ వినిపించారు.
గ్రామంలోని ప్రతి ఇంటికీ సోలార్ ప్యానల్స్ బిగించామని, దీంతో ఇండ్ల యజమానులు సోలార్ విద్యుత్తును వాడుకుంటూ మిగిలినదాన్ని ప్రభుత్వానికి విక్రయించారని చెప్పారు. ఇలా కరెంటు అమ్ముకోవడం వల్ల ఒక్కొక్కరికీ తక్కువలో తక్కువ రూ.10 వేల నుంచి రూ.30 వేల వరకు వారి ఖాతాల్లో జమ అయ్యాయని చెప్పుకొచ్చారు. ఈ డబ్బుతో దసరా పండుగను కనీవినీ ఎరుగని విధంగా జరుపుకొన్నారని కూడా వ్యాఖ్యానించారు. ఈ మాటలు విని కొండారెడ్డిపల్లి ప్రజలు నోరెళ్లబెట్టారు.
65 శాతం మందికే డబ్బులు
రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత నాగర్‌కర్నూల్ జిల్లా వంగూర్ మండలంలోని తన స్వగ్రామం కొండారెడ్డిపల్లి గ్రామాన్ని సోలార్ విద్యుత్తుకు పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు. గ్రామంలో మొత్తం 514 విద్యుత్తు కనెక్షన్లు ఉన్నాయి. ఇందులో 16 ఇండ్లు (ఇందిరమ్మ ఇండ్లు) అసంపూర్తిగా ఉన్నాయి. దీంతో 498 ఇండ్లకు విడతలవారీగా సోలార్ ప్యానల్స్ బిగించారు.
జూన్ 2025 నుంచి సోలార్ విద్యుత్తు విడతలవారీగా వినియోగంలోకి వచ్చింది. గృహ యజమానులు వాడుకోగా మిగిలిన కరెంటును ప్రభుత్వానికి ఇస్తున్నారు. జూన్ 2025 నుంచి సెప్టెంబర్ 2026 వరకు 16 నెలలకుగాను గృహ యజమానుల నుంచి కొనుగోలు చేసిన కరెంటు డబ్బును ప్రభుత్వం ఇటీవల వారి ఖాతాల్లో జమ చేసింది. 498 ఇండ్లకుగాను 323 ఇండ్ల యజమానులకు మాత్రమే ఈ డబ్బులు జమయ్యా యి. 175 మందికి సాంకేతిక కారణాల వల్ల డబ్బులు పడలేదని అధికారులు చెప్తున్నారు.
వచ్చింది రూ.8,362 మాత్రమే
కొండారెడ్డిపల్లిలో ప్రతి ఇంటిపై మూడు కిలోవాట్ల ఉత్పత్తి సామర్థ్యం కలిగిన సోలార్ ప్యానల్స్ బిగించారు. వీటి ద్వారా మంచి ఎండ ఉంటే రోజుకు 12 యూనిట్ల వరకు విద్యుత్తు ఉత్పత్తి అవుతుంది. గృహ అవసరాలకు పోను సగటున నెలకు ఒక్కో ఇంటి నుంచి 150 నుంచి 180 యూనిట్ల వరకు ప్రభుత్వానికి అమ్ముతున్నట్టు చెప్తున్నారు.
ఇందుకు ప్రభుత్వం యూనిట్‌కు రూ.3.13 పైసలు చెల్లిస్తుంది. ఈ మేరకు 323 గృహాల యజమానుల ఖాతాల్లో ప్రభుత్వం రూ.27,00,961 జమ చేసింది. మిగిలిన 175 ఇండ్లకు రూ.8 లక్షలు జమచేయాల్సి ఉన్నది. 323 ఇండ్లకు వచ్చిన ఆదాయాన్ని సగటున లెక్కస్తే, ఒక్కో ఇంటికి రూ.8,362 మాత్రమే వచ్చాయి. ఇది 16 నెలలకు సంబంధించినవి. ఈ లెక్కన ప్రతి నెల సగటున ఒక్కో ఇంటికి వచ్చింది కేవలం రూ.522. ఊర్లో చాలామందికి రూ.5 వేల వరకే వచ్చాయని, కరెంటు తక్కువగా వాడుకునేవారికి రూ.10 వేల రూ.20 వేల వరకు వచ్చాయని స్థానికులు చెప్తున్నారు.
దీపావళి, సంక్రాంతి కూడా చేసుకుంటాం
దసరా పండుగను గ్రామ ప్రజలు ధూం ధాంగా చేసుకున్నారన్న సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై గ్రామ ప్రజలు వ్యంగ్యంగా స్పందిస్తున్నారు. ఆయన ఇచ్చిన పైసలతోనే దసరా చేసుకున్నామని, దీపావళి, సంక్రాంతి కూడా నిర్వహించుకుంటామని ఎద్దేవా చేస్తున్నారు. 323 మంది ఖాతాల్లోనే డబ్బులు పడ్డాయని, అది కూడా రూ.5వేల నుంచి రూ.10 వేల వరకేనని స్పష్టం చేస్తున్నారు. ఒకవేళ వారు ధూంధాంగా పండుగ చేసుకున్నారని భావించినా, డబ్బులురాని 175 మంది ఇండ్లు, అసంపూర్తిగా ఉన్న 16 ఇందిరమ్మ ఇండ్లవారి పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

