లక్షన్నర కోట్ల విలువైన భూములు అమ్ముతం
తెలంగాణలోని మియాపూర్‌లో ఉన్న 550 ఎకరాల విలువైన వివాదాస్పద భూములపై సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చి 24 గంటలు కూడా గడువకముందే సీఎం రేవంత్‌రెడ్డి ఆ భూములను అమ్మేస్తామని ప్రకటించారు.
- వీలైనంత త్వరగా ప్రక్రియ పూర్తిచేస్తం
- ఖైరతాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి దానమే
- ఎన్డీఎస్ఏ చెప్తేనే కాళేశ్వరంపై నిర్ణయం
- కేసీఆర్ కంటే కూడా నేను శ్రీమంతుడిని
- ఢిల్లీలో విలేకరుల సమావేశంలో సీఎం
‘భూమిగా ఉంటే ఉపయోగం ఉండదు త్వరగా నగదుగా మార్చేస్తే ప్రభుత్వ అవసరాలకు వాడుకోవచ్చు ’
హైదరాబాద్, అక్టోబర్ 30 (నమస్తే తెలంగాణ) : తెలంగాణలోని మియాపూర్‌లో ఉన్న 550 ఎకరాల విలువైన వివాదాస్పద భూములపై సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చి 24 గంటలు కూడా గడువకముందే సీఎం రేవంత్‌రెడ్డి ఆ భూములను అమ్మేస్తామని ప్రకటించారు. వాటిని సంరక్షించి, భవిష్యత్తు తరాలకు ఉపయోగ పడేలా చేస్తామని చెప్పాల్సింది పోయి అమ్మేస్తామని వెంటనే ప్రకటించేశారు. ఒక అడుగు ముందుకు వేసి ఈ భూముల అమ్మ కాల ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘రిసోర్సెస్ మొబిలైజేషన్ సబ్ కమిటీ’ చూస్తుందని కూడా చెప్పారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో లక్షన్నర కోట్ల విలువైన భూములు కాపాడామని, నిధులు సమకూర్చుకునేందుకు వాటని విడతలవారీగా అమ్ముతామని చెప్పారు. వీలైనంత త్వరగా భూముల అమ్మకం ప్రక్రియను పూర్తిచేస్తామని, భూమిగా ఉంటే ఉపయోగం ఉండదని, త్వరగా నగదుగా మార్చేస్తే ప్రభుత్వ అవసరాలకు ఉపయోగించుకోవచ్చంటూ సెలవిచ్చారు. శుక్రవారం ఢిల్లీలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రధానంగా రాష్ట్రంలో కోర్టుల్లో ఉన్న భూములు, తీర్పులు వచ్చిన భూముల గురించే మాట్లాడారు.
రూ.లక్షన్నర కోట్ల భూములు
మియాపూర్‌లో 550 ఎకరాల భూమి సహా రాష్ట్రంలోని ఏడు ప్రాంతాల్లో న్యాయస్థానాల్లో ఉన్న ప్రభుత్వ భూముల చిక్కుముడులు విడిపోయాయని, వాటిని అమ్మేస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. ఈ భూముల విలువ కనీసం రూ.50 వేల కోట్ల దాకా ఉంటుందని తెలిపారు. ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నేతృత్వంలో ఉన్న రిసోర్స్ మొబిలైజేషన్ సబ్ కమిటీ ఈ భూమి అమ్మకం గురించి తగిన చర్యలు తీసుకుంటుందని వివరించారు. మూడేండ్లలో తాము రూ.లక్షన్నర కోట్ల విలువైన భూములను కాపాడామని, వాటిని క్రమంగా అమ్ముతామని చెప్పారు. గచ్చిబౌలి, మామిడిపల్లిల్లో ఉన్న ఐఎంజీ భారత్‌కు చెందిన రూ.40 వేల కోట్ల విలువైన 800 ఎకరాల భూములు, కొండాపూర్‌లోని 36 ఎకరాలు, మంచిరేవులలో 143 ఎకరాలను రక్షించామని, మంచిరేవులలో ఒక స్కూలుకు భూమి కేటాయించామని తెలిపారు. భూపాలపల్లి జిల్లాలో 400 ఎకరాల భూమి ఉన్నదని, ఇలా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో లక్షన్నర కోట్ల విలువైన భూములను కాపాడామని చెప్పారు. నిధులు సమకూర్చుకునేందుకు భూములు అమ్ముతామని, హెచ్ఎండీఏ పరిధిలో ఉండే భూములను లే అవుట్లు వేసి విక్రయిస్తామని, భూములమ్మి రాష్ర్టాన్ని అభివృద్ధి చేస్తామని తెలిపారు. ప్రభుత్వానికి బీఆర్ఎస్ పార్టీ సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
కేసీఆర్‌కంటే శ్రీమంతుడిని
ఖైరతాబాద్ ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి దానం నాగేందరేనని రేవంత్ ప్రకటించారు. ‘తెలంగాణలో పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిషరించా.. కాంగ్రెస్, అనుబంధ సంస్థల నాయకులకు కీలక పదవులిచ్చా.. నేను కేసీఆర్ కంటే శ్రీమంతుడిని.. చిన్ననాటి నుంచి ఆర్థికంగా బాగానే ఉన్నా’ అని చెప్పుకొచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సూచనల మేరకే నిర్ణయం తీసుకుంటానని పాత పాటే పాడారు. బీఆర్ఎస్ చేయని పనులను తమ ప్రభుత్వం చేస్తున్నదని, అందుకే అడ్డుకొనే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు.
హైస్పీడ్ రైల్ పనులు వేగవంతం చేయండి
తెలంగాణకు ప్రకటించిన హైస్పీడ్ రైళ్ల పనులను వేగవంతం చేయాలని రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు ముఖ్యమంత్రి రేవంత్ విజ్ఞప్తి చేశారు. ఆ కారిడార్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి భూ సేకరణ ప్రక్రియ ప్రారంభించలేదని కేంద్ర మంత్రి చెప్పగా కేంద్రం అలైన్‌మెంట్‌ను ఆమోదించిన తర్వాత భూ సేకరణ ప్రారంభిస్తామని సీఎం స్పష్టంచేశారు. వికారాబాద్ – కృష్ణా కొత్త రైలు మార్గాన్ని మంజూరు చేయాలని, హైదరాబాద్ చుట్టూ రీజినల్ రింగ్ రోడ్డు పకనే రీజినల్ రింగ్ రైలు అలైన్మెంట్ చేయాలని రేవంత్ కోరారు. డోర్నకల్- గద్వాల్ , కల్వకుర్తి – మాచర్ల, కాచిగూడ -జగ్గయ్యపేట, పటాన్చెరు – ఆదిలాబాద్, బోధన్ – లాతూర్, అకన్నపేట బైపాస్ లైన్ మార్గాలను మంజూరు చేయాలని, మెగా కోచింగ్, ఫ్రైట్ మెయింటెనెన్స్ డిపోను మహబూబాబాద్ సమీపంలోని అనంతారంలో ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. కేంద్ర మంత్రితో సమావేశంలో మంత్రి వివేక్, ఎంపీలు మల్లు రవి, వేం నరేందర్‌రెడ్డి, చామల కిరణ్ కుమార్‌రెడ్డి, బలరాం నాయక్ , వంశీకృష్ణ , అనిల్ కుమార్, ప్రభుత్వ సలహాదారు కే రామకృష్ణారావు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

