హైదరాబాద్, అక్టోబర్ 8 (నమస్తే తెలంగా ణ): ప్రముఖ సాహితీవేత్త, చారిత్రక నవలా రచయిత, ‘చారిత్రక నవలా చక్రవర్తి’గా ప్రసి ద్ధి పొందిన డాక్టర్ ముదిగొండ శివప్రసాద్ గురువారం కన్నుమూశారు. హైదరాబాద్-శివమ్రోడ్లోని ఆయన నివాసంలో గుండెపోటు రావడంతో హుటాహుటిన విద్యానగర్లోని దుర్గాబాయి దేశ్ముఖ్ దవాఖానకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి తుదిశ్వాస విడిచినట్టు కుమారుడు ముదిగొండ ఇందు శేఖర్ తెలిపారు.
ఆయన అంత్యక్రియలను శుక్రవా రం ఉదయం 11గంటలకు నిర్వహిస్తామని చెప్పా రు. ఆయన మృతి పట్ల సాహితీవేత్తలు, రచయిత లు, పాఠకులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఆరు దశాబ్దాలకుపైగా తెలుగు సాహిత్యానికి సేవలందించిన ముదిగొండ శివప్రసాద్.. ముఖ్యంగా చారిత్రక నవలా ప్రక్రియకు తనదైన శైలిని అందించారు. చరిత్రను కేవలం పుస్తకాల్లోని తేదీలు, రాజులు, యుద్ధాల సమాహారంగా కాకుండా.. సజీవమైన కథగా, పాత్రలుగా, సంఘర్షణగా పాఠకుల ముందుంచడం ఆయన ప్రత్యేకత. 1940 డిసెంబర్ 23న అప్పటి ప్రకాశం జిల్లా పరిధిలోని ఆకులల్లూరులో జన్మించిన శివప్రసాద్ ఉన్నత విద్యను అభ్యసించి అధ్యాపకుడిగా పనిచేశారు. చరిత్ర సులభంగా అర్థమయ్యేలా కథా రూపంలో అందించాలనే లక్ష్యంతో ఆయన అనేక నవలలు రచించారు.
వందకుపైగా నవలలు
ముదిగొండ శివప్రసాద్ రచనా ప్రస్థానం అత్యంత విస్తృతమైనది. కాలానుగుణంగా ఆయన రచనల సంఖ్యపై వేర్వేరు లెకలు ప్రచురితమైనప్పటికీ.. ఆయన వందకుపైగా నవలలు, ఇతర సాహిత్య రచనలు చేశారు. ‘శ్రీపదార్చన, ఆవాహన, పట్టాభి, రెసిడె న్సీ, శ్రీలేఖ, శ్రావణి, వంశధార, తంజావూరు విజ యం, మహాసర్గ, బసవగీత, సమ్రాట్ పుష్యమిత్ర, సగం విరిగిన చంద్రుడు, రోహణం’ తదితర రచనలు ఆయన సాహిత్య ప్రస్థానంలో ప్రత్యేకంగా నిలిచాయి. ‘ఆవాహన’ వంటి రచనలు ఆయనకు చారిత్రక నవలా రచయితగా విస్తృత గుర్తింపు తెచ్చాయి. సాహిత్య వర్గాల్లో ఆయనకు ‘చారిత్రక నవలా చక్రవర్తి, చారిత్రక నవలా సమ్రాట్, శివ కవీంద్ర, అభినవ ధూర్జటి, అభినవ పాలురికి’ వంటి బిరుదులు లభించాయి.
శివప్రసాద్ సాహితీ జీవితంలో ప్రముఖ రచయిత, జ్ఞానపీఠ పురసార గ్రహీత రావూరి భరద్వాజతో ఉన్న అనుబంధం ప్రత్యేకమైనది. ఈ అనుబంధానికి ప్రతీకగా నిలిచిన రచనల్లో ‘వంశధార’ ఒకటి. తెలుగు సాహిత్య వర్గాల్లో ఈ రచనకు ప్రత్యేక గుర్తింపు లభించింది. శివప్రసాద్ రచనల్లో కనిపించే ప్రధాన లక్షణం చరిత్రను వర్తమానంతో అనుసంధానించడం. ఆయన నవలలు ఒకవైపు వినోదాన్ని అందిస్తూనే, మరోవైపు పాఠకుడిలో చరిత్రపై ఆసక్తిని పెంచాయి. ఉస్మానియా యూనివర్సిటీ తెలుగు విభాగం అధ్యాపకుడిగా పనిచేసిన ముదిగొండ శివప్రసాద్.. బోధనతోపాటు విసృ్తతంగా అధ్యయనం చేశారు. కాగా ముదిగొండ శివప్రసాద్ మృతిపట్ల తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్ జూలూరు గౌరీ శంకర్ గురువారం ఒక ప్రకటనలో సంతాపం తెలిపారు. ఆయన మరణం తెలుగు సాహిత్యానికి తీరనిలోటు అని పేర్కొన్నారు. ఆయన చారిత్రక నవలా చక్రవర్తిగా పేరుగాంచారని గుర్తుచేశారు.