మంఖాల్‌లో భూ కైంకర్యం అసైన్డ్ ఖల్లాస్.. బిగ్ విల్లాస్!
అవి ఔటర్ రింగు రోడ్డుకు దగ్గర్లో ఉన్న భూములు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ హయాంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వమే నిరుపేదలకు లావణి పట్టాల కింద పంచిన భూములు. మూడేండ్ల కిందటి వరకు అసైన్డ్ భూమిగా నిషేధిత జాబితాలో ఉన్న ఆ భూములపై రాబందుల కన్ను పడింది. ప్రభుత్వం మారగానే పరిస్థితి అనుకూలించింది. ఓ బడా బిల్డర్‌ను ముందుపెట్టి.. బిగ్‌బ్రదర్, ముఖ్యనేత సన్నిహితుడు కథ నడిపించారు.
- 1000 కోట్ల విలువైన 33 ఎకరాలు ప్రైవేట్‌కు
- లావణి భూములను పట్టా భూములుగా మార్చి హైడ్రామా
- విచారణ నిర్వహిస్తున్నామంటూ 2024లో దాటవేసిన అధికారులు
- ఏడాదిన్నరపాటు ఎంక్వైరీ సాగదీసి.. చివరికి చేతులెత్తేసిన యంత్రాంగం
- అటు విచారణ అటకెక్కగానే, ఇటు విల్లాల నిర్మాణానికి కసరత్తు మొదలు
- విల్లాల ప్రాజెక్ట్‌కు అనుమతులేవీ లేకున్నా.. కన్నెత్తి చూడని అధికారులు
- తెరపైకి వీకేఆర్ బిల్డర్స్.. వెనుక ‘బిగ్ బ్రదర్’, ‘ముఖ్య’నేత సన్నిహితుడు!
- ఇదేం అన్యాయమంటూ ఇటీవల అడ్డుకున్న మంఖాల్ గ్రామస్తులు, రైతులు
- జనతాగ్యారేజ్ ‘తెలంగాణభవన్’కు వచ్చి భూదోపిడీపై బాధితుల ఫిర్యాదు
ఎకరం రూ.20-30 కోట్లు పలికే చోట.. 33.08 ఎకరాలకు ఎసరుపె ట్టారు. ఏడు దశాబ్దాలుగా సాగుచే సుకుంటున్న రైతుల రికార్డులను గుట్టుచప్పుడు కాకుండా మార్చేశారు. 2024లోనే విషయా న్ని నమస్తే తెలంగాణ బయట పెట్టిన తర్వాత ఆ భూములపై విచారణ జరిపిన అధికారుల నివేదిక నేటికీ వెలుగుచూడలేదు.
తాజాగా ఆ పట్టాలు మారిపోయాయి. లావణి భూములేనని ధ్రువీకరించిన అధికారులూ సైలెంట్ అయిపోయారు. అ భూముల్లో బిగ్‌బ్రదర్ అండతో విల్లాల నిర్మాణానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. బాధిత రైతులు మాత్రం న్యాయంకోసం ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు.

హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, అక్టోబర్ 25 (నమస్తే తెలంగాణ): అది రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం మం ఖాల్ గ్రామం. అక్కడ కొన్ని ప్రభుత్వ భూ ములు ఉన్నాయి. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ హయాంలో భూమిలేని నిరుపేదలకు లావణి పట్టాల కింద వాటిని పంపిణీ చేశారు. కాలక్రమేణా నగరం విస్తరించడంతోపాటు ఔటర్ రింగ్ రోడ్డు ఆ గ్రామానికి అత్యంత సమీపంలోకి వచ్చింది. పైగా వంద ఫీట్ల రహదారి కూడా అక్కడి నుంచే పోతున్నది. దీంతో ఎక రం కనీసంగా రూ.20 కోట్ల వరకు ధర పలుకుతున్నది. అంతే, బడాబాబుల కన్ను వాటి పై పడింది.
ఇంకేముంది? ఆ భూముల్లో విల్లాల నిర్మాణాన్ని చేపట్టారు. అదేందీ.. ప్రభుత్వ భూముల్లో ప్రైవేట్ వ్యక్తులు విల్లాలు నిర్మించడమేందీ అనుకొంటున్నారా? మీరు చదివింది నిజమే.. సాధారణంగా నిరుపేదలు పది గజాల ప్రభుత్వ స్థలంలో గుడిసెలు వేసుకొంటే హైడ్రా, రెవెన్యూ, పోలీసు శాఖ అధికారులు ఒకరోజు ముందు పెద్ద స్కెచ్ వేసి… తెల్లారేసరికి బుల్డోజర్లతో విరుచుకుపడతారు. అక్కడ ఉన్న గుడిసెల్ని నేలమట్టం చేసి.. ‘వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను కాపా డాం’ అంటూ బోర్డులు పెట్టి, ఫొటోలు దిగి మీడియాకు విడుదల చేస్తారు.
కానీ ఇక్కడ ప్రభుత్వ భూమిలో విలాసవంతమైన విల్లాలు నిర్మించేది పేదోళ్లు కాదు. అరచేతిలో అధికారం పెట్టుకొని ప్రభుత్వ, అధికార యం త్రాంగాలను శాసిస్తున్న పెద్దలు. ఒక్క ముక్క లో చెప్పాలంటే.. తెర వెనుక ‘బిగ్’ బ్రదర్‌తో పాటు ‘ముఖ్య’నేత ఆత్మ ఉన్నారనేది బహిరంగ రహస్యం. అందుకే వెయ్యి కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూములు ప్రైవేట్ వ్యక్తుల రియల్ వ్యాపారానికి కాసులు కురిపించే వేదికగా మారాయి. ‘ఇది గతంలోనే జరిగిన తతంగం కదా’ అని రెవెన్యూ శాఖ ముక్తాయిస్తే.. ఒకవైపు, నిర్మాణ అనుమతులు లేవని పైకి చెప్తున్న మున్సిపల్ అధికారులు వాటిపై చర్యలు మాత్రం తీసుకోవడంలేదు. దీంతో మంఖాల్ గ్రామస్తులే రంగంలోకి దిగి ఇటీవల ఆ పనులను అడ్డుకోవడం గమనార్హం.

1.ప్రభుత్వ భూములను ఆక్రమించి చుట్టూ రేకుల ప్రహరీ నిర్మించిన దృశ్యం
2.ఇవి లావణి భూములని 2012లో మహేశ్వరం ఎమ్మార్వో ఇచ్చిన ధ్రువీకరణ
3.లావణి భూములు రాయపురెడ్డి అనే వ్యక్తిపై పట్టాగా మారినట్టు చూపుతున్న డాక్యుమెంట్
ఏడు దశాబ్దాలుగా రైతులదే..
ట్విస్ట్-1
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం మంఖాల్ గ్రామ పరిధిలోని సర్వే నంబర్లు 608, 609, 610 పక్కా ప్రభుత్వ భూమి. 1954-55 ఖాస్రా పహాణీలో ఖారీజ్ఖాతా సర్కారీ అని నమోదై ఉంది. 608లో 10.37 ఎకరాలు, 609లో 13.12 ఎకరాలు, 610లో 11.27 ఎకరాలు ఇలా మొత్తం 35.36 ఎకరాలుగా రికార్డుల్లో స్పష్టంగా ఉంది. గ్రామంలో ఈ భూములను చామలబండ చెల్కలుగా పిలుస్తారు. దీనిని ఆనుకొని ఉన్న భూములను మసీదు బండ చెల్కలుగా చెబుతారు. ఇందిరమ్మ హయాంలో ఈ భూములను మంఖాల్ గ్రామంలో భూమిలేని నిరుపేదలకు పంపిణీ చేశారు. అప్పటి నుంచి ఆ రైతులే అందులో సాగు చేసుకొంటూ జీవిస్తున్నారు. కాలక్రమేణా రికార్డుల్లో రైతుల పేర్లు వస్తున్నాయి.
ఆయా కుటుంబాల్లోని వ్యక్తులకు పౌతి ద్వారా భూముల బదలాయింపు కూడా జరిగింది. ఇలా మూడు సర్వే నంబర్లలో 22 మంది రైతుల పేర్లు వచ్చాయి. 608/5 సర్వే నంబర్లోని రెండెకరాల భూమిని సదరు లావణి పట్టాదారు విక్రయించేందుకు ప్రయత్నించాడు. విషయం తెలుసుకున్న రెవెన్యూ అధికారులు ఆ ప్రక్రియను నిలిపివేశారు. నిబంధనలకు విరుద్ధంగా విక్రయం జరిపేందుకు ప్రయత్నించినందున నిబంధనల మేరకు పీవోటీ కింద ఆ రెండెకరాల భూమిని స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో మంఖాల్ గ్రామంలో పారిశుధ్య నిర్వహణలో భాగంగా డంపింగ్ యార్డుకు భూమి కావాలని అధికార యంత్రాంగం అన్వేషించినప్పుడు పీవోటీ కింద తీసుకున్న ఈ రెండెకరాల భూమి తెరపైకి వచ్చింది.
దీంతో దానిని డంపింగ్ యార్డుకు కేటాయించారు. కాగా హైదరాబాద్ మహా నగరం విస్తరించడంతో మంఖాల్ భూములకు భారీ డిమాండ్ వచ్చింది. ముఖ్యంగా ఈ భూములకు అత్యంత సమీపంలోనే ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం జరిగింది. దీనికితోడు ఈ భూములకు అవతల పోలీస్ క్వార్టర్స్ కోసం ప్రభుత్వం గతంలోనే భూమిని కేటాయించింది. అక్కడికి వెళ్లేందుకుగానూ ఔటర్ సర్వీసు రోడ్డు నుంచి వంద ఫీట్ల రహదారిని ఏర్పాటు చేశారు. అయితే ఆ రహదారి ఈ భూముల ముందు నుంచే వెళుతుండటంతో మూడు సర్వేనంబర్లలోని భూములపై కొందరు పెద్దల కన్నుపడింది.

మొన్నటివరకూ నిషేధిత జాబితాలోనే
ట్విస్ట్-2
వాస్తవానికి 22ఏ నిషేధిత జాబితాలో ఉన్న ఈ భూములపై ఎలాంటి లావాదేవీలు జరుపొద్దు. కానీ మూడేండ్ల కిందట ఒక ప్రైవేట్ కంపెనీ.. పెద్దలతో మిలాఖత్ అయిన అప్పటి అధికారులు కలిసి గుట్టుచప్పుడు కాకుండా వీటిపై లావాదేవీలు నిర్వహించారు. మూడు దఫాలుగా 22 డాక్యుమెంట్ల ద్వారా 33.08 ఎకరాల భూమిని రైతుల పేర్ల నుంచి ఇతరులకు బదలాయించారు. ఇందులో వీకేఆర్ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ ప్రతినిధి వద్దిరెడ్డి రాయపరెడ్డి పేరిట 15.29 ఎకరాలు, మహ్మద్ అబ్దుల్ ఖబీర్ పేరిట 10.36 ఎకరాలు, చెక్కల ఎల్ల య్య పేరిట 3.39 ఎకరాలు, వద్దిరెడ్డి బాల్‌రెడ్డి పేరిట 1.25 ఎకరాలు, నాం పల్లి సిద్దార్ధ పేరిట 13 గుంటలు, ముసినిపల్లి అశ్విని పేరిట 26 గుంటలు రిజిస్ట్రేషన్ చేశారు.
కీలకమైన విషయమేమిటంటే.. ఈ రిజిస్ట్రేషన్లు జరిగినప్పుడు, పూర్తయిన తర్వాత చివరికి భూ భారతి వచ్చే వరకు ఈ మూడు సర్వేనంబర్లను నిషేధిత జాబితాలోనే ఉంచారు. కానీ ఇప్పుడు మాత్రం కేవలం 608/5లోని రెండు ఎకరాల డంపింగ్ యార్డు భూమి మాత్రమే నిషేధిత జాబితాలో కనిపిస్తున్నది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో అందరి దృష్టి ఎన్నికల వైపు ఉన్నప్పుడు అధికారులు, సదరు కంపెనీ, ప్రైవేట్ వ్యక్తులు చడీచప్పుడు కాకుండా ఈ తతంగమంతా నడిపినట్టుగా తెలుస్తున్నది.
‘ముఖ్యనేత’ ఆత్మకు తోడైన బిగ్ బ్రదర్
ట్విస్ట్-3
వాస్తవానికి ఈ తతంగం జరిగినప్పు డు ప్రస్తుతం ‘ముఖ్య’నేత ఆత్మ, వీకేఆర్ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ ప్రతినిధి వద్దిరెడ్డి రాయపరెడ్డి కలిసి ఈ కథంతా నడిపినట్టు తెలిసింది. ఈ మేరకు లావణి భూములను ‘ముఖ్య’నేత ఆత్మ బినామీ పేరిట కూడా చేసుకున్నారు. అసెంబ్లీ ఎన్నికలు పూర్తయి కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో క్రమేణా సీన్లోకి ‘బిగ్’ బ్రదర్ ప్రవేశించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. అంటే వీకేఆర్ బిల్డర్స్ తరపున ‘బిగ్’ బ్రదర్, ‘ముఖ్య’నేత ఆత్మ తరపున నల్లగొండ పట్టణానికి చెందిన మహ్మద్ అబ్దుల్ ఖబీర్ వ్యవహారాన్ని చక్కబెడుతున్నట్టు గ్రామంలోని పలువురు స్పష్టం చేస్తున్నారు.
అయితే ప్రభుత్వానికి చెందాల్సిన సుమారు రూ.వెయ్యి కోట్ల భూమి ప్రైవేట్ వ్యక్తులకు ధారాదత్తం కావడాన్ని ‘నమస్తే తెలంగాణ’ 2024 సెప్టెంబరులోనే ‘కార్పొరేట్ కోరల్లో ఇందిరమ్మ భూములు’ శీర్షికన వెలుగులోకి తెచ్చింది. అప్పటికే సదరు ప్రైవేట్ కంపెనీ ఆ భూముల్ని స్వాధీనం చేసుకొని చుట్టూ రేకుల ప్రహరీ నిర్మించారు. ఈ నేపథ్యంలో అప్పట్లో ‘నమస్తే తెలంగాణ’ ఈ భూముల అంశంపై రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా ఉన్న శశాంకను సంప్రదించగా… లావణి పట్టా భూములు పట్టా భూములుగా మార్చుతూ జరిగిన లావాదేవీలపై విచారణ జరుగుతున్నట్టు స్పష్టం చేశారు. విచారణ పూర్తయి నివేదిక వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటామని కూడా చెప్పారు.

రికార్డులు ఎక్కడ??
ట్విస్ట్-4
ఆ తర్వాత కలెక్టర్ చెప్పినట్టు ఆ విచారణ ఏమైందో? ఏ నివేదిక వచ్చిందో? ఇప్పటికీ పత్తా లేదు. దీనిపైనా ‘నమస్తే తెలంగాణ’ ఆరా తీయగా విచారణ నిర్వహించిన అధికారి తాను విచారణ పూర్తి చేసి, నివేదికను అప్పటి కలెక్టర్ శశాంకకు ఇచ్చినట్టుగా సన్నిహితుల దగ్గర చెబుతున్నారు. అంటే విచారణ నివేదిక కచ్చితంగా కలెక్టరేట్లో భద్రంగా ఉండాలి. కానీ అసలు మంఖాల్ భూములకు సంబంధించిన విచారణ నివేదిక స్థానిక తహసీల్దార్ కార్యాలయం మొదలు కలెక్టరేట్ వరకు ఎక్కడా చిన్న కాగితం కూడా లేదంటే నివేదికను మాయం చేశారా? అసలు విచారణనే చేయలేదా? అనేది తేలాల్సి ఉన్నది. ఇంకో కీలకమైన విషయం… మహేశ్వరం తహసీల్దార్ కార్యాలయంలో ఇప్పటికీ ఈ మూడు సర్వేనంబర్లకు సంబంధించిన పాత పహాణీలు, ఇతర రికార్డులేవీ అందుబాటులో లేకపోవడం గమనార్హం.
గత ఆరేడు నెలలుగా మొదలైన నిర్మాణ పనులు
ట్విస్ట్-5
చాలాకాలం పాటు ఈ భూములపై స్థబ్దుగా ఉన్నా తెర వెనుక పెద్దలు గత ఆరేడు నెలల కిందట నెమ్మదిగా నిర్మాణ పనులు మొదలుపెట్టారు. గతంలోనే చుట్టూ రేకుల ప్రహరీ ఏర్పాటు చేసినందున అందులో విల్లాల నిర్మాణాన్ని మొదలుపెట్టారు. ఈ మేరకు భూమిని చదును చేసి పిల్లర్ల నిర్మాణాన్ని ప్రారంభించారు. అయితే విల్లాల నిర్మాణానికి అనుమతులు తీసుకున్నారా? అనేది కూడా ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా తయారైంది. హెచ్ఎండీఏ రికార్డులను పరిశీలిస్తే ఈ మూడు సర్వేనంబర్లపై ఎలాంటి అనుమతులు ఇచ్చినట్టుగా లేదు.
గతంలో తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధిలో… ప్రస్తుతం జీహెచ్ఎంసీ పరిధిలోని శంషాబాద్ జోనల్ పరిధిలోకి వచ్చే ఈ భూముల్లో నిర్మాణ అనుమతులు ఇచ్చినట్టు ఎవరూ ధ్రువీకరించడం లేదు. గతంలో పని చేసిన మున్సిపల్ కమిషనర్‌ను సంప్రదిస్తే తన హయాంలో ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని చెబుతున్నారు. శంషాబాద్ జోనల్ కమిషనర్ చంద్రకళను సంప్రదించగా సంబంధిత డిప్యూటీ కమిషనర్‌ను అడగాలని సూచించారు. ఆయన్ని అడిగితే ఆ విల్లాలకు ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని కుండబద్దలు కొట్టారు. మరి అలాంటప్పుడు చర్యలు తీసుకోవాలి కదా? అని ప్రశ్నిస్తే, ఎవరి నుంచీ సమాధానం లేదు. పేదోళ్లు ప్రభుత్వ భూమిలో చిన్న గుడిసెలు వేసుకుంటే రెవెన్యూ, మున్సిపల్ అధికారులు పోలీసు శాఖకు లేఖ రాసి.. భారీ బందోబస్తుతో యుద్ధానికి వెళ్లినట్టుగా బుల్డోజర్లతో దండయాత్ర చేసిన సందర్భాలను గత రెండున్నరేండ్లలో అనేకం చూశాం. కానీ ఇక్కడ మాత్రం ఏ ఒక్క శాఖ అధికారి కూడా అటువైపు కన్నెత్తి చూడటం లేదంటే తెర వెనుక పెద్దల ఒత్తిడి, అల్టిమేటమ్ ఏస్థాయిలో ఉన్నదో అర్థం చేసుకోవచ్చు.

రెవెన్యూ శాఖలో అంతా గప్‌చుప్..
ట్విస్ట్-6
అసెంబ్లీ ఎన్నికల హడావిడి వేళ.. అప్పటి అధికారులతో కుమ్మక్కయిన ప్రస్తుత ‘ముఖ్య’నేత ఆత్మతో పాటు మరో బిల్డర్ ఈ తతంగాన్ని నడిపించారనేది బహిరంగ రహస్యం. అనంతరం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. అనుమతులు లేని ఈ విల్లా ప్రాజెక్టు మీద ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. దీనిపై ప్రస్తుత రెవెన్యూ అధికారులు మాత్రం.. ‘అది గతంలో జరిగిన వ్యవహారం’ అని కొట్టిపారేస్తున్నారు. మరి.. గతంలో జరిగిన వ్యవహారాలపై సీఎం రేవంత్‌రెడ్డి రోజుకో సిట్, పూటకో కమిటీ వేస్తున్న ఈ తరుణంలో ఈ భూముల మీద కూడా విచారణ జరిపించాలి కదా..! కానీ అలా జరుగడంలేదంటే తెరవెనుక ‘బిగ్’ హస్తంతోపాటు ముఖ్యనేత ఆత్మ ఉన్నారనేందుకు మరింత బలాన్ని చేకూర్చినట్లయింది.
ఇంటెలిజెన్స్ విచారణ..రైతుల పోరుబాట
ట్విస్ట్-7
లోకమంతా అది ప్రభుత్వ భూమి అని గళమెత్తుతుంటే రెవెన్యూ, మున్సిపల్ శాఖల అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో కొన్నిరోజుల కిందట ఇంటెలిజెన్స్ వర్గాలు దీనిపై పెద్ద ఎత్తున ఆరా తీసినట్టు తెలిసింది. వీటికి సంబంధించి అధికారుల నుంచి వివరాలు తీసుకున్నారు. గతంలో ‘నమస్తే తెలంగాణ’లో వచ్చిన కథనం ఆధారంగా కొన్నిరోజుల కిందట మంఖాల్ భూముల వద్దకు వెళ్లి రేకుల ప్రహరీ వేసిన ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. కొందరు గ్రామస్తులను కూడా విచారించినట్టు సమాచారం. అనంతరం గ్రామంలో ఈ భూములపై పెద్ద ఎత్తున చర్చ జరిగినట్టు తెలిసింది. అది ప్రభుత్వ భూమి అనే వాస్తవం వారికి తెలియడంతోపాటు దశాబ్దాల పాటు గ్రామానికి చెందిన నిరుపేద రైతులే సాగు చేసుకోవడంతోపాటు రికార్డుల్లో పేర్లు కొనసాగిన విషయం తెలుసు. అందుకే దీనిని ఆపేందుకు కొందరు గ్రామస్తులు సిద్ధమై విల్లాల నిర్మాణంలో భాగంగా జరుగుతున్న పనులను అడ్డుకున్నట్టు తెలిసింది.

విల్లాలు కొనుగోలు చేస్తే అంతే
మంఖాల్ భూముల వెనుక సర్కార్ పెద్దలకు సంబంధించిన వాళ్లు ఉండటంతో అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. గత రెండున్నర సంవత్సరాలుగా పేదోళ్ల ఇండ్లను ఎడాపెడా కూల్చివేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ అవినీతి విల్లా ప్రాజెక్టు జోలికి పోవడం లేదు. ఈ నేపథ్యంలో వాటిని కొనుగోలు చేసిన వాళ్ల పరిస్థితి ఏమిటనే ఆందోళన వ్యక్తమవుతున్నది. ముఖ్యంగా ఎన్ఆర్ఐలు, ఇతర ప్రాంతాల్లో ఉన్న వారు.. బ్రోకర్ల మాటలు నమ్మి ఈ విల్లాలను కొనుగోలు చేస్తారు. భవిష్యత్తులో వీటిపై విచారణ జరిగి లావణి పట్టా భూముల గుట్టు అధికారికంగా రట్టయితే కోట్లు వెచ్చించి కొనుగోలు చేసిన వాళ్ల పరిస్థితి అగమ్యగోచరంగా తయారవుతుంది. అయి తే గతంలోనే హెచ్ఎండీఏకు ఈ విల్లాల నిర్మాణానికి దరఖాస్తు చేసుకోగా ఇప్పటివరకు అనుమతులు జారీ కానట్లు తెలిసింది. అయినప్పటికీ నిర్మా ణ పనులు మాత్రం జోరుగా సాగుతున్నాయి. పైగా అక్రమాలు జరిగిన సమయంలోనే నాలా అనుమతులు కూడా జారీ అయ్యాయి. అంటే రిజిస్ట్రేషన్ శాఖలో పని ముగించేందుకు భారీ స్కెచ్ వేసినట్టు విశ్వసనీయంగా తెలిసింది.
ప్రస్తుతం పట్టా భూములుగా మార్చి నమోదైన వివరాలు ఇలా..
వీకేఆర్ బిల్డర్స్ అండ్ డెవలపర్స్
ప్రతినిధి వద్దిరెడ్డి రాయపరెడ్డి : 15.29 ఎకరాలు
మహ్మద్ అబ్దుల్ ఖబీర్ – 10.36 ఎకరాలు
చెక్కల ఎల్లయ్య : 3.39 ఎకరాలు
వద్దిరెడ్డి బాల్‌రెడ్డి – 1.25 ఎకరాలు
నాంపల్లి సిద్ధార్థ – 13 గుంటలు
ముసినిపల్లి అశ్విని – 26 గుంటలు
మొత్తం : 33.08 ఎకరాలు

Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

