పాలనకు హాలిడే.. ఒకవైపు క్రాప్ హాలిడే.. మరోవైపు పవర్ హాలిడే
ఒకవైపు రాష్ట్రంలో కరువు తాండవిస్తున్నది. అన్ని రంగాలు అతలాకుతలమవుతున్నాయి. సాగునీళ్లు కరువై, కరెంటు కోతలతో పంటలు ఎండిపోయి రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.
- కరువుపై సర్కార్‌కు కార్యాచరణే లేదు
- ఉత్త చేతులతో అఖిలపక్షానికి మంత్రులు
- తూతూ మంత్రంగా సమావేశం నిర్వహణ
హైదరాబాద్, అక్టోబర్ 28 (నమస్తే తెలంగాణ): ఒకవైపు రాష్ట్రంలో కరువు తాండవిస్తున్నది. అన్ని రంగాలు అతలాకుతలమవుతున్నాయి. సాగునీళ్లు కరువై, కరెంటు కోతలతో పంటలు ఎండిపోయి రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఇంత జరుగుతున్నా కాంగ్రెస్ సర్కార్‌కు మాత్రం సోయి రావడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రోమ్ నగరం తగులబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేల్ వాయించినట్టుగా రాష్ట్రంలో పరిస్థితి ఇంత దుర్భరంగా ఉంటే ప్రభుత్వం మాత్రం బిన్దాస్గా ఉన్నది. ఇందుకు బుధవారం సచివాలయంలో ప్రభుత్వం నిర్వహించిన అఖిలపక్ష సమావేశమే ఉదాహరణ. అఖిలపక్ష సమావేశం సాక్షిగా ప్రభుత్వం నిర్లక్ష్యం, పట్టింపులేని తనం బట్టబయలయ్యాయి.
అఖిలపక్ష సమావేశంలో ప్రభుత్వం తరఫు నుంచి కరువును ఎదుర్కొనేందుకు ఎలాంటి ప్రణాళికను పెట్టలేదని తెలిసింది. ముక్తసరిగా అధికారులతో ప్రజెంటేషన్ ఇప్పించి మమా అనిపించినట్టు తెలిసింది. ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీతోపాటు ఇతర పార్టీల నాయకులు మాట్లాడుతూ.. ప్రజలు, రైతులను ఆదుకొనేందుకు ప్రభుత్వం తరఫున ఏం చేయాలో సూచిస్తే, ప్రభుత్వం నుంచి మంత్రులంతా మౌనముద్రలో ఉండటం గమనార్హం. ‘మీరు చెప్పదలుచుకున్నది చెప్పి వెళ్లండి. మేం చేయదలుచుకున్నది చేస్తాం’ అనే ధోరణిలో మంత్రులు వ్యవహరించారని ప్రతిపక్ష పార్టీల ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కరువుతో ప్రజలు, రైతులు ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం వ్యవహరించే తీరు ఇదేనా? అని మండిపడుతున్నారు. సమావేశంలో బీఆర్ఎస్ తరఫున మాజీ ఎంపీ వినోద్‌కుమార్, ఎమ్మెల్సీ ఎల్ రమణ, మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీ కొమురయ్య, ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ, ఎంఐఎంఎల్పీ నేత అక్బరుద్దీన్ ఒవైసీ, సీపీఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకటరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ, మాజీ ఎమ్మెల్యే నంద్యాల నరసింహారెడ్డి, తెలంగాణ జన సమితి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ కోదండరాం, సమాజ్‌వాదీ పార్టీ నాయకులు ప్రొఫెసర్ సింహాద్రి, వెంకటేశ్వర్లు, ఆర్జేడీ నాయకురాలు శోభాయాదవ్, బీఎస్పీ రాష్ట్ర నాయకుడు శ్రీరామ్కృష్ణ, ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు హేమ సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.
మంత్రుల మౌనం
అఖిలపక్ష భేటీ సందర్భంగా ఒక్కరంటే ఒక్క మంత్రి కూడా నోరు విప్పి మాట్లాడలేదట. డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క నేతృత్వంలో జరిగిన సమావేశానికి ప్రభుత్వం తరఫున మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీతక్క, వాకిటి శ్రీహరితోపాటు సీఎస్ సంజయ్ జాజు, నోడల్ ఆఫీసర్ రామకృష్ణారావు హాజరయ్యారు. అయితే వీరిలో ఏ ఒక్క మంత్రి కూడా కరువు ప్రణాళిక, ప్రభుత్వం తీసుకోబోయే చర్యలపై నోరువిప్పలేదని తెలిసింది. సమావేశం ముగింపు సమయంలో డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క సరిగ్గా రెండు నిమిషాలు మాట్లాడి మమ అనిపించినట్టు తెలిసింది. అది కూడా అందరూ సహకరించాలని పార్టీలను కోరినట్టు తెలిసింది. అంతేగానీ ప్రభుత్వం ఏం చేస్తుందనే విషయాలను మాత్రం ఆయన వెల్లడించకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టత ఇవ్వకుండా, మంత్రులు మాట్లాడకుండా ఈ మాత్రం దానికి అఖిలపక్ష భేటీ అంటూ హడావుడి చేయడం ఎందుకని ప్రతిపక్ష పార్టీలు మండిపడుతున్నాయి.
సర్కార్ వద్ద ఇప్పటికీ కరువు ప్రణాళిక లేదు
ముఖ్యమైన కరువు సమస్యపై అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తున్నారంటే, ప్రభుత్వం అన్ని విధాలుగా సంసిద్ధమై ఉండాలి. కరువును ఎదుర్కొనేందుకు, రైతులు, ప్రజలను కాపాడేందుకు ప్రభుత్వం ఎలాంటి ప్రణాళిక రూపొందించిందో అఖిలపక్ష నేతల ముందు పెట్టి చర్చించాలి. దీనిపై ఆయా పార్టీల అభిప్రాయం తీసుకొని, అభ్యంతరాలు, సూచనలు ఉంటే సరిచేసుకోవాలి. కానీ, ప్రభుత్వం తన వైపు నుంచి ఎలాంటి కార్యాచరణ సిద్ధం చేసుకోకపోవడం, కార్యాచరణ లేకుండానే అఖిలపక్ష సమావేశం నిర్వహించడం గమనార్హం.
ప్రజలు, రైతుల నుంచి విమర్శలు రాకుండా ఏదో ఒకటి చేసినట్టు కనిపించాలి కాబట్టి అఖిలపక్ష భేటీ నిర్వహించారనే విమర్శలు వినిపిస్తున్నాయి. కరువును ఎదుర్కోవడం, ప్రజలను ఆదుకోవడం పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి కనిపించడంలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. అఖిలపక్ష భేటీకి వచ్చిన అన్ని పార్టీల నేతలతో మాట్లాడించి.. ప్రభుత్వం తరఫున ప్రణాళిక విడుదల చేయకపోవడమే ప్రభుత్వ నిర్లక్ష్యానికి పరాకాష్ట అనే విమర్శలున్నాయి. వాస్తవానికి, ఈ అఖిలపక్ష సమావేశాన్ని కరువు ప్రారంభంలోనే నిర్వహించాలి. కానీ, చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టుగా రాష్ట్రం కరువుతో అతలాకుతలమవుతున్న సమయంలో నింపాదిగా ఇప్పుడు సమావేశం నిర్వహించింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

