హైదరాబాద్, అక్టోబర్ 1 (నమస్తే తెలంగాణ) : సీనియర్ల వేధింపులతో హైదరాబాద్ సిద్ధార్థ ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన విద్యార్థి సాయితేజ ఆత్మహత్యకు పాల్పడిన ఘటనపై జాతీయ మానవ హకుల కమిషన్(ఎన్హెచ్ఆర్సీ)తీవ్రంగా స్పందించింది. ఈ ఘటనపై ఢిల్లీ విశ్వవిద్యాలయానికి చెందిన న్యాయశాస్త్ర విద్యార్థి సభావట్ కల్యాణ్ ఎన్హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేశారు. సాయితేజ ప్రైవేట్ హాస్టల్లో ఉన్న సమయంలో సీనియర్లు తీవ్రంగా వేధించారని, బలవన్మరణానికి ముం దు తనకు ఎదురైన పరిస్థితులను వివరిస్తూ బాధితుడు రికార్డు చేసిన సెల్ఫీ వీడియోను ఫిర్యాదులో ప్రస్తావించారు.
కాలేజీ యాజమాన్యం యాంటీర్యాగింగ్ నిబంధనలు, యూజీసీ మార్గదర్శకాలు అమలుచేయడంలో విఫలమైందని ఫిర్యాదుదారు కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయమై గతంలోనే ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శికి ఫిర్యాదు ప్రతిని పంపిన ఎన్హెచ్ఆర్సీ, విచారణ జరిపి నివేదిక సమర్పించాలని ఆదేశించింది. 4నెలలైనా స్పందన లేకపోవడంతో ఎన్హెచ్ఆర్సీ తీవ్రంగా పరిగణించి ప్రొటెక్షన్ ఆఫ్ హ్యూమన్‌రైట్స్ యాక్ట్-1993లోని సెక్షన్-13 కింద సమన్లు జారీ చేసింది. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన నివేదికతో ఈ నెల 28న న్యూఢిల్లీలోని ఎన్హెచ్ఆర్సీ ఎదుట హాజరుకావాల్సి ఉంటుంది.