పంటల సాగు వద్దనడం మూర్ఖత్వం.. కరువును ఎదుర్కోవడంలో ప్రభుత్వం విఫలం
రోజురోజుకూ వేడెక్కుతున్న వాతావరణంతో ఎల్ నినో పరిస్థితులు ప్రతి మూడు, నాలుగేండ్లకూ ఒకసారి వస్తుంటాయని, వాటివల్ల ఎదురయ్యే కరువు పరిస్థితులను ప్రభుత్వాలు బాధ్యతగా ఎదుర్కొని, ప్రజలను కాపాడాలని ప్రముఖ పర్యావరణవేత్త ప్రొఫెసర్ డాక్టర్ కే పురుషోత్తమ్‌రెడ్డి హితవు చెప్పారు.
- గ్రామాలు వట్టిగారిపల్లి మాడల్‌ను మండలాలు ముల్కనూరు సహకార విధానాన్ని అనుసరించాలి
- ప్రభుత్వ అనాలోచిత చర్యలతో పెరుగుతున్న పట్టణాలు, గ్రామాల మధ్య వ్యత్యాసం
- ఏడాదికి మూడు పంటలు పండిస్తున్న రైతుల విజయాలను అధ్యయనం చేయాలి
- ‘నమస్తే తెలంగాణ’తో ప్రముఖ పర్యావరణ వేత్త, ప్రొఫెసర్ డాక్టర్ కే పురుషోత్తమ్‌రెడ్డి
హైదరాబాద్, అక్టోబర్ 27 (నమస్తే తెలంగాణ) : రోజురోజుకూ వేడెక్కుతున్న వాతావరణంతో ఎల్ నినో పరిస్థితులు ప్రతి మూడు, నాలుగేండ్లకూ ఒకసారి వస్తుంటాయని, వాటివల్ల ఎదురయ్యే కరువు పరిస్థితులను ప్రభుత్వాలు బాధ్యతగా ఎదుర్కొని, ప్రజలను కాపాడాలని ప్రముఖ పర్యావరణవేత్త ప్రొఫెసర్ డాక్టర్ కే పురుషోత్తమ్‌రెడ్డి హితవు చెప్పారు. కరువు పరిస్థితులు వచ్చాయనే సాకుతో రైతులను పంట సాగు చెయొద్దని చెప్పడం మూర్ఖత్వ చర్యగా అభిప్రాయపడ్డారు. కరువును ఎదుర్కొనేందుకు ముందస్తు ప్రణాళిక లేకపోవడం ప్రభుత్వ లోపమని పేర్కొన్నారు. శాశ్వతంగా కరువును జయించిన ప్రాంతాలు రాష్ట్రంలో ఉన్నాయని, వాటిని స్పూర్తిగా తీసుకొని రైతులను అప్రమత్తం చేయాలని సూచించారు.
పాలకులు, అధికారులు ఆ దిశగా ఆలోచించకుండా, రైతులను భయపెడుతూ పంటలు వేయొద్దని, క్రాప్‌హాలిడే ప్రకటించడం పిచ్చిచేష్టలని మండిపడ్డారు. ప్రభుత్వాలు ప్రజలకు జవాబుదారీగా ఉండి, వారిని రక్షించాలని, భయపెట్టి మరింత సంక్షోభంలోకి నెట్టేలా వ్యవహరించవద్దని సూచించారు. కరువు పరిస్థితులు నెలకొన్న సమయంలో రాష్ట్ర ప్రకృతి వైపరీత్యాల నివారణ శాఖ (ఎస్డీఎంఏ) అత్యంత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు. రైతులు కూడా సమైక్య స్ఫూర్తితో ప్రభుత్వాలపై ఎక్కువగా ఆధారపడకుండా గ్రామాలు వట్టివారిపల్లిని, మండలాలు ముల్కనూర్ను స్ఫూర్తిగా తీసుకొని భవిష్యత్తు తరాలకు మంచి జీవన విధానాన్నిచ్చేలా నడుచుకోవాలని సూచిస్తున్న ప్రముఖ పర్యావరణ శాస్త్రవేత్త, ప్రొఫెసర్ డాక్టర్ కే పురుషోత్తమ్‌రెడ్డితో ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక ఇంటర్వ్యూ ..
కరువు పరిస్థితులను ఎలా చూడవచ్చు?
ఎల్ నినో పరిస్థితులు ప్రతి మూడు, నాలుగేండ్లకూ ఒకసారి సంభవిస్తాయి. దీంతో కరువు పరిస్థితులు ఎదురవుతాయి, ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రభుత్వాలు కచ్చితమైన పాలసీలను రూపొందించాలి. ముందస్తు అంచనాలతో వాటిని ఎదుర్కొనేందుకు పాలకులు, అధికారులు సిద్ధంగా ఉండాలి. కానీ, దురదృష్టవశాత్తు రాష్ట్రంలో ఆ పరిస్థితులు లోపించాయి.
కరువును ఎదుర్కోవడం ఎలా?
కరువును ఎదుర్కొనేందుకు ఎక్కడికక్కడ అనుకూలమైన పరిస్థితులు కల్పించాలి. దేశంలో నీటి వసతులు అనగానే సిమెంట్, కాంక్రీట్, ఇనుపపైపులతో కట్టే పెద్దపెద్ద ప్రాజెక్టులు అనుకుంటున్నారు. ఇలాంటి పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టడం వల్ల పర్యావరణం దెబ్బతిని, సహజ నీటివనరులు క్షీణిస్తున్నాయి. పెద్దపెద్ద ప్రాజెక్టులు కట్టడం వల్ల స్థానికంగా కార్బన్డయాక్సైడ్ పెరిగి భూసారం దెబ్బతింటుంది. ఫలితంగా కరువు పరిస్థితులు వస్తున్నాయి.
తెలంగాణకు అనుకూలమైన నీటి వసతులు ఏమిటి?
పెద్దపెద్ద ప్రాజెక్టుల స్థానంలో వాటర్‌షెడ్ సౌకర్యాలను పెంచుకోవాలి. నీటిరంగ నిపుణుడు వీ హనుమంతరావు వాటర్‌షెడ్ పథకాన్ని రూపొందించారు. దీన్ని ఉపయోగించి జహీరాబాద్ పరిసరాల్లోని గొట్టిగారిపల్లిలో రైతులు ఎకరానికి రూ.5వేల ఖర్చుతో విస్తృతంగా వాటర్‌షెడ్ ప్రాజెక్టులను ఏర్పాటు చేసుకున్నారు. దీంతో 25 ఏండ్లుగా ఎలాంటి కరువు లేకుండా ఏడాదికి మూడు పంటలను సాగుచేస్తూ, దేశానికి ఆదర్శంగా నిలిచారు.
వాటర్‌షెడ్ పథకంలో ఉన్న ప్రత్యేకతలు ?
వాటర్‌షెడ్ పథకంలో ఎక్కడి నీరు అక్కడే భూమిలోకి పోయి, భూగర్భజలాలు పెరుగుతాయి. ఈ విధానంలో నాలుగు రకాల నీళ్లు అంటే రెయిన్వాటర్, గ్రౌండ్‌వాటర్, సర్ఫేజ్ వాటర్, సేంద్రియ మట్టిపొరలు చేకూరుతాయి. దీంతో ఎలాంటి పర్యావరణ సమస్యలు తలెత్తవు. ఇదే అక్కడి రైతుల విజయానికి కారణం. ప్రస్తుతం రాష్ట్రమంతటా కరువు గురించి భయపడుతున్నప్పటికీ, అక్కడి రైతులు యాసంగి పంటకు సిద్ధమవుతున్నారు. ఇక్కడ పరిస్థితులను అధ్యయనం చేసి రాజస్థాన్‌లోని ఎడారి ప్రాంతంలో మంచి పంటలు పండిస్తుంటే, ఇక్కడి ప్రభుత్వాలకు మాత్రం ఎందుకు పట్టింపు ఉండటంలేదో అర్థం కావడంలేదు.
యాసంగి క్రాప్ హాలిడేపై ఏమంటారు?
యాసంగిలో పంట వేయొద్దని చెప్పడం రాష్ట్ర ప్రభుత్వ బాధ్యతారాహిత్యం. రైతులకు పంటలు పండించడం వారి బతుకుదెరువు. వాటిని వేయొద్దని చెప్పే అధికారం ప్రభుత్వాలు, పాలకులకు లేదు. ప్రభుత్వం వల్ల ప్రజలు ఇబ్బందులు పడొద్దు. ప్రభుత్వ ప్రకటనతో రైతులు బాధపడుతున్నారు. క్రాప్ హాలిడే అంటే వారి జీవన విధానాన్ని అడ్డుకోవడమే. ప్రజలను సంరక్షించడం ప్రభుత్వం బాధ్యత. కరువును ఎదుర్కోవడంలో ప్రభుత్వం, యంత్రాంగం పూర్తిగా విఫలమయ్యాయి.
ప్రభుత్వం ఏవిధంగా విఫలమైందని మీరు భావిస్తున్నారు?
ఎల్ నినో పరిస్థితులు ప్రతి మూడు, నాలుగేండ్లకూ ఒకసారి వస్తాయని ప్రభుత్వం, పాలకులు గుర్తించుకోవాలి. గత మూడేండ్లుగా ప్రాజెక్టుల్లో ఉన్న నీటిని ముందస్తుగా నిల్వ చేసుకొని ఉంటే ఇలాంటి పరిస్థితులు వచ్చేవి కావు. అందుకే కరువును ఎదుర్కోవడంలో ప్రభుత్వం అంచనా వేయలేకపోవడాన్ని వైఫల్యంగా పేర్కొంటున్నాను. రైతులను ఈ పరిస్థితుల నుంచి బయటపడేసేందుకు ప్రభుత్వం ఆలోచించాలి, అంతేకాని వారిని భయపెట్టేలా ప్రకటనలు చేయొద్దు.
భూగర్భజలాలు తగ్గడానికి ప్రధాన కారణం ఏమిటి?
తెలంగాణలో ఉన్న గుట్టలన్నీ మాయమయ్యాయి. ఎక్కడ గుట్టలు ఉంటే అవి ఆ ప్రాంతంలో నీటి నిల్వలకు ఓవర్‌హెడ్ ట్యాంక్‌గా ఉపయోగపడుతాయి. కానీ, రూ.వందల కోట్ల విలువ వస్తుందని, బహుళ అంతస్తుల భవన నిర్మాణాలకు అనుమతిలివ్వడం, గుట్టలను మైనింగ్‌కు ఇవ్వడం నేటి కరువు పరిస్థితులకు కారణంగా మారాయి.
రాజకీయ పార్టీలు ఎన్నికల మ్యానిఫెస్టోలో పర్యావరణం గురించి ప్రస్తావించవు.. మీరేమంటారు?
దేశంలోని రాజకీయ పార్టీల్లో వ్యాపార దృక్పథం పెరిగింది. అందువల్లే ఎన్నికల ప్రణాళికల్లో పర్యావరణం ప్రస్తావన ఉండదు. అదే పాశ్చాత్య దేశాలతో పాటు ఐక్యరాజ్య సమితి తన ప్రణాళికల్లో ఈ రంగాలకు ప్రాధాన్యత కల్పించి, నిధులు కేటాయిస్తాయి.
ప్రభుత్వానికి, ప్రజలకు మీరిచ్చే సలహా?
తెలంగాణలోని రైతులు, ప్రజలు గొట్టిగారిపల్లిని, ముల్కనూరును స్ఫూర్తిగా తీసుకొని ముందుకెళ్లాలి. ప్రభుత్వాలు కూడా స్థానిక ప్రభుత్వాల స్ఫూర్తిని గౌరవిస్తూ స్థానిక ప్రభుత్వాల అధికారాలను వాటికి అప్పగించాలి.
కరువును ఎదుర్కొనేందుకు యంత్రాంగం ఏం చేయాలి?
రాష్ట్ర విపత్తు నివారణ శాఖ (ఎస్డీఎంఏ) నిరంతరం ప్రకృతి వైపరీత్యాలపై అధ్యయనం చేయాలి. ప్రస్తుత పరిస్థితుల్లో మరింత క్రియాశీలకంగా పనిచేయాలి. కరువు నుంచి బయటపడేందుకు ప్రజలకు అవసరమైన సహకారం అందించాలి. దురదృష్టవశాత్తు రాష్ట్ర విపత్తు నివారణ శాఖ ఆ దిశగా పనిచేయడంలేదు. కేంద్ర ప్రకృతి విపత్తు నివారణ సంస్థతో నిరంతరం అనుసంధానం చేసుకుంటూ కరువు రాకుండా చర్యలు చేపట్టాలి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

