మేము అధ్యయనం చేస్తాం
తమ్మిడిహట్టి వద్ద బరాజ్ నిర్మాణంతో వాటిల్లే ముంపుపై స్వతంత్రంగా మళ్లీ అధ్యయనం చేయాల్సిందేనని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి మహారాష్ట్ర సీఎం ఫడణవీస్ తేల్చిచెప్పారు.
- రాష్ట్ర ప్రయోజనాలకు నష్టం లేకుంటేనే తమ్మిడిహట్టి ఎత్తు పెంపుపై పునఃపరిశీలన
- మహారాష్ట్ర సీఎం స్పష్టీకరణ
- అధ్యయనం కోసం సెక్రటరీల స్థాయిలో కమిటీ ఏర్పాటు
హైదరాబాద్, అక్టోబర్ 26 (నమస్తే తెలంగాణ): తమ్మిడిహట్టి వద్ద బరాజ్ నిర్మాణంతో వాటిల్లే ముంపుపై స్వతంత్రంగా మళ్లీ అధ్యయనం చేయాల్సిందేనని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి మహారాష్ట్ర సీఎం ఫడణవీస్ తేల్చిచెప్పారు. తమ రాష్ర్టానికీ, ప్రజలకు ఎలాంటి నష్టం లేకుంటేనే బరాజ్ ఎత్తు 148 మీటర్ల ఒప్పందాన్ని పునఃపరిశీలిస్తామని స్పష్టం చేశారు. తమ్మిడిహట్టి వద్ద బరాజ్ నిర్మాణానికి సంబంధించిన అంశాలపై చర్చించేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి బృందం మహారాష్ట్రకు వెళ్లిన విషయం తెలిసిందే.
ఈ బృందం ముంబైలోని సహ్యాద్రి స్టేట్ గెస్ట్‌హౌస్‌లో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌తో సోమవారం ఉదయం ప్రత్యేకంగా సమావేశమైంది. తమ్మిడిహట్టి ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలను సీఎం రేవంత్‌రెడ్డి ఈ సందర్భంగా మహారాష్ట్ర సీఎం, అధికారులకు వివరించారు. తమ్మిడిహట్టి వద్ద 148 మీటర్ల ఎత్తుతో కాకుండా 152 మీటర్ల ఎత్తుతో బరాజ్ నిర్మాణానికి సహకరించాలని కోరారు. తద్వారా గోదావరిలో తెలంగాణ తన వాటా నీటిని పూర్తిగా వాడుకొనేందుకు వీలవుతుందని తెలిపారు. ముంపుతోపాటు పర్యావరణ ప్రభావాలకు సంబంధించి పరిహారం ఎంతయినా చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నామని మహారాష్ట్రకు రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు.
నష్టం లేకుంటేనే ఒప్పందం పునఃపరిశీలన: సీఎం ఫడణవీస్
తమ్మిడిహట్టి బరాజ్ ఎత్తు పెంపుపై తెలంగాణ చేసిన అభ్యర్థనలు, ప్రస్తావించిన అంశాలను తాము స్వతంత్రంగా అధ్యయనం చేసిన అనంతరమే పరిశీలిస్తామని మహారాష్ట్ర సీఎం ఫడణవీస్ ఈ సందర్భంగా వెల్లడించారు. రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను కాపాడుకోవడానికి ప్రాధాన్యతనిస్తూనే, తెలంగాణకు సహకరించే విషయంలో నిర్మాణాత్మక దృక్పథంతో ముందుకు సాగుతామని పేర్కొన్నారు. బరాజ్ ఎత్తు పెంపు వల్ల మహారాష్ట్ర ప్రజలకు ఎలాంటి నష్టం లేకుండా ఉంటేనే ప్రతిపాదనలను పరిశీలిస్తామని స్పష్టంచేశారు.
ప్రస్తుతం మారిన ప్రాజెక్టు లొకేషన్ వల్ల అంచనా వేసిన దానికంటే ముంపు ఎకువగా ఉంటుందని, కాబట్టి ప్రతిపాదనలపై క్షుణ్ణంగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉన్నదని పేర్కొన్నారు. సంబంధిత వన్యప్రాణుల అభయారణ్యం పరిధిలోకి వచ్చే అంశాలు, నదీ గర్భం వెలుపల ఎంత భూమి అవసరమవుతుందనే అంశాలనూ స్వతంత్రంగానే అధ్యయనం చేస్తామని ఫడణవీస్ తెలిపారు. మహారాష్ట్ర అంచనాల్లో ఏవైనా లోపాలు, సందేహాలున్నాయని భావిస్తే, ఇరు రాష్ట్రాల అధికారులు వాటిపై చర్చిస్తారని, అవసరమైతే నిపుణుల అభిప్రాయాలను తీసుకుంటామని ఫడణవీస్ ప్రతిపాదించారు.
నీటి కేటాయింపులు, చట్టబద్ధమైన అనుమతుల అంశాలు కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) పరిధిలోకి వస్తాయని, ఆ సంఘం మహారాష్ట్ర అభిప్రాయాన్ని కోరినప్పుడు, వాస్తవాల ఆధారంగా తమ వైఖరిని తెలియజేస్తామని తెలంగాణకు తేల్చిచెప్పారు. ఆయా అంశాలపై అధ్యయనం చేసేందుకు, రెండు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, నీటిపారుదల శాఖ కార్యదర్శులతో కూడిన ఒక ఉమ్మడి కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
ఇన్వెస్ట్ తెలంగాణ సదస్సుకు ఆహ్వానం
హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలో డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో నిర్వహించనున్న ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌కు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడణవీస్‌ను సీఎం రేవంత్‌రెడ్డి ఆహ్వానించారు. అందుకు ఫడణవీస్ సానుకూలంగా స్పందించారు. చర్చల్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, మాజీ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సాగునీటి పారుదల శాఖ ప్రభుత్వ సలహాదారు ఆదిత్యానాథ్ దాస్, సెక్రటరీ శ్రీధర్, ఈఎన్సీ, జాయింట్ సెక్రటరీలు, అంతర్రాష్ట్ర జల విభాగం అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

