హైదరాబాద్, అక్టోబర్ 7 (నమస్తే తెలంగాణ) : అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్యే కడియం శ్రీహరిని బెదిరించినట్టు వచ్చిన ఆరోపణలపై బీఆర్ఎస్ హుజూరాబాద్ శాసనసభ్యుడు పాడి కౌశిక్‌రెడ్డి ఎథిక్స్ కమిటీకి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. తన వివరణకు కమిటీ విధించిన గడువు బుధవారంతో ముగియనున్న నేపథ్యంలో కౌశిక్‌రెడ్డి తన సమాధానాన్ని రాతపూర్వకంగా సమర్పించారు. అసెంబ్లీలో చోటుచేసుకున్న పరిణామాలను వివరించడంతోపాటు తనపై వచ్చిన ఆరోపణలను ఆయన ఖండించినట్టు తెలిసింది. అసెంబ్లీ సమావేశాల్లో కడియం శ్రీహరిని బెదిరిస్తూ తాను ఎలాంటి వ్యాఖ్యలు, సంజ్ఞలు చేయలేదని, తనపై వచ్చిన ఆరోపణలు అసత్యం, వక్రీకరణతో కూడినవి, అసందర్భమైనవని పేర్కొన్నట్టు సమాచారం. ‘నీ అంతు చూస్తా, నీ సంగతి చూస్తా’నని, ‘షూట్ చేసి కాలుస్తాను’ అని గన్ గురిపెట్టినట్టు సైగలు చేశాననే ఆరోపణలను కూడా ఖండించినట్టు తెలిసింది. ఈ వ్యవహారంపై 13న ఎథిక్స్ కమిటీ మరోసారి సమావేశం కానున్నది. కౌశిక్‌రెడ్డి సమర్పించిన వివరణను పూర్తిగా పరిశీలించిన అనంతరం తదుపరి చర్యలపై కమిటీ నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నది. బీఆర్ఎస్ మీద, ఆ పార్టీ అధినేత కేసీఆర్ మీద కడియం శ్రీహరి తీవ్ర విమర్శలు చేస్తుండటంతో తాను స్పందించాల్సి వచ్చిందని కౌశిక్‌రెడ్డి పేర్కొన్నట్టు సమాచారం. ‘నువ్వు ఏ పార్టీలో గెలిచావు?’ అంటూ కడియంను ప్రశ్నించానని.. ఆయనే ముందుగా తనను దూషించారని, అందువల్లే తాను ప్రతిస్పందించాల్సి వచ్చిందని పేరొన్నట్టు తెలిసింది. తన వ్యాఖ్యలను విడిగా చూడకుండా, అంతకుముందు సభలో జరిగిన మొత్తం సంభాషణను పరిగణనలోకి తీసుకోవాలని కోరినట్టు సమాచారం.
ఎథిక్స్ కమిటీ ముందు కౌశిక్‌రెడ్డి మరో కీల క అంశాన్ని లేవనెత్తినట్టు సమాచారం. తనకు సంబంధించిన వీడియో ఫుటేజ్‌ను మాత్రమే కమిటీకి అందించారని, ఇది ఏకపక్షంగా ఉన్నదని, కడియం సభలో మాట్లాడిన తీరు, తనపై చేసిన వ్యాఖ్యలు, దూషణలకు సంబంధించిన ఫుటేజ్‌ను కూడా పరిశీలించాలని కోరినట్టు తెలిసింది. ఈ ఘటనపై 29.03.2026 నాటి ఆన్-రికార్డ్, ఆఫ్-రికార్డ్ పూర్తి వీడియో రికార్డును తెప్పించి పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేసినట్టు సమాచారం. ఎథిక్స్ కమిటీ విచారణలో తనకు వ్యక్తిగతంగా వివరణ ఇచ్చే అవకాశం కల్పించాలని, తనతోపాటు తన న్యాయవాదిని కూడా కమిటీ ముందుకు నేరుగా పిలిచి వాదనలు వినాలని విజ్ఞప్తి చేసినట్టు సమాచారం. అసెంబ్లీలో జరిగిన సంభాషణను యథాతథంగా తెలుగులో రాసి కమిటీకి సమర్పించినట్టు తెలిసింది. సంఘటనకు సంబంధించిన పూర్తి నేపథ్యం, సభలో జరిగిన వాగ్వాదం, తన స్పందనకు దారితీసిన పరిస్థితులను ఆయన కమిటీ ముందుంచే ప్రయత్నం చేసినట్టు తెలుస్తున్నది.
288 నిబంధన కింద తనది అనైతిక ప్రవర్తన కాదని, తాను ఎకడా అనైతికంగా ప్రవర్తించలేదని, సభలో తనపై జరిగిన దాడికి, విమర్శలకు రాజకీయంగా ప్రతిస్పందించడమే జరిగిందని కౌశిక్‌రెడ్డి వివరణ ఇచ్చినట్టు తెలుస్తున్నది. తన చర్యలను బెదిరింపులుగా చిత్రీకరించడం సరికాదని, సభలో జరిగిన పరిణామాలను మొత్తం దృకోణంలో పరిశీలించాలని కోరినట్టు తెలిసింది. తన వివరణను పరిగణనలోకి తీసుకొని కేసును కొట్టివేయాలని విజ్ఞప్తి చేసినట్టు సమాచారం. తనపై సభలో ఆరోపణలు చేసిన రేవూరి ప్రకాశ్‌రెడ్డి, వెడ్మ బొజ్జు ఎథిక్స్ కమిటీ నుంచి తప్పుకోవాలని, వారికి బదులుగా నిష్పక్షపాతంగా ఉండే ఇతర కమిటీ సభ్యులతో విచారణ జరుపాలని కోరినట్టు తెలిసింది. విచారణ కమిటీ సభ్యుల తటస్థతపై ప్రశ్నలు లేవనెత్తడం ద్వారా తనపై జరిగే విచారణ నిష్పాక్షికంగా ఉండాల్సిన అవసరాన్ని కౌశిక్‌రెడ్డి సమాధానంలో ప్రస్తావించినట్టుగా కనిపిస్తున్నది.
కౌశిక్‌రెడ్డి సమర్పించిన 12 పేజీల వివరణపై చర్చించేందుకు ఈ నెల 13న ఎథిక్స్ కమిటీ సమావేశం కానున్నది. ఈ భేటీలో ఆయన సమాధానంలోని అంశాలను కమిటీ సభ్యులు పరిశీలించే అవకాశం ఉన్నది. కౌశిక్‌రెడ్డి వాదనలను అంగీకరించాలా? పూర్తి అసెంబ్లీ వీడియో ఫుటేజ్‌ను పరిశీలించాలా? ఆయనను, ఆయన న్యాయవాదిని నేరుగా పిలిచి వివరణ తీసుకోవాలా? కమిటీ సభ్యులపై ఆయన చేసిన అభ్యంతరాలపై ఎలా స్పందించాలి? అనే అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉన్నది. అయితే, అందరి దృష్టి ఎథిక్స్ కమిటీ తీసుకునే తుది నిర్ణయంపైనే ఉన్నది. కౌశిక్‌రెడ్డి వివరణను పరిగణనలోకి తీసుకుని కేసును ముగిస్తుందా? లేక అసెంబ్లీలో సభ్యుల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినట్టుగా భావించి తదుపరి చర్యలకు సిఫార్సు చేస్తుందా? అనేది 13న జరిగే సమావేశంతో స్పష్టత వచ్చే అవకాశం ఉన్నది.