Hyderabad News | హైదరాబాద్లోని అమీర్పేట్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఒక ప్రముఖ షాపింగ్ మాల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. మంటల తీవ్రత ఎక్కువగా ఉండటంతో, అవి క్షణాల్లోనే పక్కనే ఉన్న ఇతర దుకాణాలకు కూడా వేగంగా వ్యాపిస్తున్నాయి.
మరోవైపు ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలను అదుపు చేయడానికి తీవ్రంగా శ్రమిస్తున్నారు. ప్రమాద ప్రాంతంలో దట్టమైన పొగలు అలుముకోవడంతో చుట్టుపక్కల ప్రజలు, స్థానిక వ్యాపారులు తీవ్ర భయాందోళనలకు లోనవుతున్నారు. ప్రస్తుతానికి అధికారులు పరిస్థితిని సమీక్షిస్తూ మంటలు పూర్తిగా అదుపులోకి తెచ్చేందుకు చర్యలు ముమ్మరం చేశారు.