ఊరు పొమ్మంది.. ఉపాధి రమ్మంది!
ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి పాలకుల పుణ్యమా అని వెనుకబాటు ముద్ర పడింది సంగారెడ్డి జిల్లాలోని నారాయణఖేడ్ నియోజకవర్గం. సాగునీటి వనరులు లేక, ఉపాధి అవకాశాలు లేక, వ్యవసాయం అనుకూలించక కేవలం వర్షాధార పంటలను నమ్ముకుని బతుకీడ్చాల్సిన దుస్థితి ఇక్కడి రైతులది. చాలీచాలని భూము లు కలిగిన రైతులు, కూలీలు పనులు వెతుక్కుంటూ ఇతర ప్రాంతాలకు వలస వెళ్లాల్సిన అనివార్య పరిస్థితులు తలెత్తగా..
- కరువు ధాటికి పెరిగిన వలసలు
- పొట్టకూటి కోసం పడరాని పాట్లు
- సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ ప్రాంత రైతులు, ప్రజల పరిస్థితి దైన్యం
నారాయణఖేడ్, నవంబర్ 16: ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి పాలకుల పుణ్యమా అని వెనుకబాటు ముద్ర పడింది సంగారెడ్డి జిల్లాలోని నారాయణఖేడ్ నియోజకవర్గం. సాగునీటి వనరులు లేక, ఉపాధి అవకాశాలు లేక, వ్యవసాయం అనుకూలించక కేవలం వర్షాధార పంటలను నమ్ముకుని బతుకీడ్చాల్సిన దుస్థితి ఇక్కడి రైతులది. చాలీచాలని భూము లు కలిగిన రైతులు, కూలీలు పనులు వెతుక్కుంటూ ఇతర ప్రాంతాలకు వలస వెళ్లాల్సిన అనివార్య పరిస్థితులు తలెత్తగా.. ఏటా కర్మాగారాల్లో పనులు చేసేందుకు ఆరు నెలలపాటు వివిధ ప్రాంతాలకు వెళ్లి తమ కుటుంబాలను పోషించుకునే దైన్యం ఇక్కడి రైతులు, ప్రజలది. చెరుకు క్రషింగ్ ప్రారంభమైందంటే నారాయణఖేడ్ నియోజకవర్గంలో వలస గంట మోగినట్టే. ఎక్కువగా ఇక్కడి గిరిజనులే వలస బాటపడుతుండగా చదువుకునే చిన్నారులు సైతం వారితోపాటు వెళ్లడంతో వారి విద్యాభ్యాసానికి ఆటంకం కలుగడం ఇక్కడ సర్వసాధారణ విషయం.
దీపావళి తరువాతే వలసలు..
ఏటా దీపావళి పండుగ తరువాత వలస వెళ్లే వారు తిరిగి మార్చిలో స్వగ్రామాలకు చేరుకుంటారు. అయితే, తెలంగాణ ఏర్పడిన తరువాత వ్యవసాయ రంగానికి సంబంధించి బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాలు వలసలను గణనీయంగా తగ్గించాయి. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ఇక్కడ పరిస్థితులు మళ్లీ మొదటికొచ్చాయి. బీఆర్ఎస్ హయాంలో క్రమంగా తగ్గుముఖం పట్టిన వలసలు గత మూడేండ్లుగా మళ్లీ పెరుగడం గమనార్హం. ఓ వైపు రైతులకు ప్రభుత్వ ప్రోత్సాహం లేకపోగా ఈ సారి నెలకొన్న కరువు పరిస్థితులు వలస బండిని తోలక తప్పని దుస్థితి నెలకొన్నది. ఉమ్మడి రాష్ట్రంలో ఈ నియోజకవర్గం నుంచి 70 శాతం మంది గిరిజనులు వలస వెళ్లే వారు. ప్రస్తుతం మళ్లీ అవే పరిస్థితులున్నాయి.
వలస జీవనం వర్ణనాతీతం
బతుకుదెరువు కోసం ఊరుగాని ఊరికి వెళ్లి జీవనం సాగించే నిరుపేదల పరిస్థితి వర్ణనాతీతం. జిల్లాలోని సంగారెడ్డి, జహీరాబాద్తోపాటు కామారెడ్డి, మెట్పల్లి, కర్ణాటకలోని బీదర్, గుల్బర్గా, మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లోని చక్కెర కర్మాగారాల పరిధిలో జీవనం కొనసాగిస్తూ చెరుకు నరికే పనులతోపాటు ఎడ్ల బండిపై చెరుకును తరలించే పనులు చేస్తారు. ఆరు నెలలపాటు చెరుకు తోటల సమీపంలోనే గుడిసెలు, గుడారాలు వేసుకుని జీవించే వీరి జీవనం దుర్భరం. పలు సందర్భాల్లో ఎడ్లబండ్లు రోడ్డు ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోగా ఎద్దులు సైతం మరణించిన సందర్భాలు ఉన్నాయి.
వీరు నివసించే గుడిసెలు అగ్నిప్రమాదానికి గురై చిన్నారులు మృతి చెందిన ఘటనలూ లేకపోలేదు. పనులు చేసేచోట చిన్నచిన్న ప్రమాదాలు, పాముకాట్లకు గురైన ఘటనలు సైతం ఉన్నా యి. ఈ సారి కరువు ప్రభావం కారణంగా జహీరాబాద్, కర్ణాటకలోని వివిధ చక్కెర కర్మాగారాల పరిధిలో రోజువారి కూలీలుగా కూడా పనులు చేపడుతున్నారు. గతంలో పలు స్వచ్ఛంద సంస్థలు వలసలపై అధ్యయనం చేసి స్థానికంగా పరిశ్రమలు కల్పించడమో లేక వ్యవసాయరంగాన్ని అభివృద్ధి చేయడమో చేయాలని సూచించినప్పటికీ అప్పటి ప్రభుత్వాలు పట్టించుకోలేదు. వలస ప్రాంతాల్లో ప్రత్యేక బడులను ఏర్పాటు చేసి వలసబారిన పడుతున్న చిన్నారు ల చదువుకు ఆటంకం కలుగకుండా స్వచ్ఛంద సంస్థలు చేసిన కృషి ఫలించడం లేదు.

వలసలపై హామీలన్నీ తూచ్!
నారాయణఖేడ్ నియోజకవర్గంలో ప్రధాన సమస్యగా ఉన్న వలసల నివారణకు ప్రస్తుత ప్రభుత్వం కనీస చర్యలు చేపట్టకపోగా ఇదే సమస్యపై గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ గాలిలో దీపమయ్యాయి. వ్యవసాయాన్ని ఏ మాత్రం ప్రోత్సహించకుండా వ్యవహరిస్తున్న ప్రభుత్వం తీరు తమకున్న వ్యవసాయ భూములను సాగు చేసుకుని కుటుంబాలను పోషించుకునే అవకాశం లేకుండా చేసిందని రైతులు అంటున్నారు. సాగునీటి వనరుల లేమి కారణంగా వర్షాధార పంటలు లేక బోరుబావులపై మాత్రమే పంటలను సాగు చేసుకునే పరిస్థితి.
ఈ క్రమంలో విద్యుత్తు సమస్యతో బోరుబావుల ద్వారా సరిపడా నీరందక, కరువు పరిస్థితుల దృష్ట్యా వర్షాధార పంటలు పండే అవకాశం లేక బతుకుజీవుడా అంటూ బతుకుదెరువు వెతుక్కుంటూ వెళ్లాల్సిందే. ఈ పరిస్థితులకు తోడు ప్రభుత్వం రైతులకు సాంత్వన కల్పించే దిశగా ఒక్క చర్య కూడా తీసుకోకపోవడం గమనార్హం. రైతుబంధు పథకం గతి తప్పడం మొదలుకొని యూరియా, ఎరువులు, ఎరువుల ధరలు పెరుగడం, సకాలంలో పంట కొనుగోలు చేయకపోవడం, సరైన ధర చెల్లించకపోవడం ఇలా అన్ని ఇబ్బందుల మధ్య రైతుల పరిస్థితి మూలిగే నక్కపై తాటికాయ పడిన చందంగా మారింది. పంటలకు సకాలంలో సరిపడా నీరందక 40 శాతం వరకు పంట దిగుబడులు తగ్గినట్టు రైతులు వాపోతున్నారు.
పనులు లేక బతకనీకి పోతున్నం
మా దగ్గర వానలు పడితేనే పంటలు పండుతయి. నీళ్ల సౌలత్ లేక పెసర, మినుము, సోయా పంటలు పండిస్తం. వానకాలంలో వానలు మంచిగ పడితే యాసంగి పంటలు పండుతయి. లేకపోతే రెండో పంట కాదు. అందుకే కర్ణాటకలోని గుల్బర్గాకు చెరుకు నరికే పనులకు పోతున్నం. మా కుటుంబమంతా చిన్నపిల్లలతో వెళ్లిపోతున్నం. గవర్నమెంట్ మాకు ఏం సౌలత్ చేయక మా సొంత ఊర్లను విడిచి దూరం బతకనీకి పోతున్నం. మా అసుంటి గరీబోల్ల గురించి గవర్నమెంట్ పట్టించుకొని మంచిగ చేయాలని కోరుతున్నా.
-కైలాశ్ రాథోడ్, జీర్గితండా, కంగ్టి మండలం, సంగారెడ్డిజిల్లా
ఆరు నెలలు అక్కడనే ఉంటం
ఇక్కడ మాకు బతకనీకి ఏ ఆధారం లేదు. ఎకరం భూమి మాత్రమే ఉన్నది. కాలం అయితేనే పంట పండుతది. పొట్ట ఎల్లాలంటే కష్టం చేయక తప్పదు. జహీరాబాద్లోని చెరుకు ఫ్యాక్టరీకి పోతున్నం. ఆరు నెలలు అక్కడనే ఉండి చెరుకు సీజన్ అయిపోయినంక మా తండాకు వస్తం. చెరుకు నరుకుడు, ఎడ్ల బండ్ల మీద చెరుకు తోలుడు పనులు చేస్తం. కుటుంబంలో పని చేయలేని పెద్దమనుషులు ఉంటే వాళ్లను ఇంటిదగ్గర ఉంచి అందరం పోతం. ఈ సారి పంటలు కూడా సరిగ్గా పండలేవు. తండాలో పెద్దమనుషులను ఇడిసి పోవాలంటే చాలా కష్టమనిపిస్తది, కాని ఇదే మా బతుకుదెరువు.
-మారొనిబాయి, నాగల్గిద్దతండా, నాగల్గిద్ద మండలం,సంగారెడ్డి జిల్లా
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

