హైదరాబాద్, సెప్టెంబర్ 5 (నమస్తే తెలంగాణ) : బిగ్‌బాస్ షోపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. సిగ్గు, ఎగ్గు లేని జంతువులు ఏమైనా చేయగలవని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అక్కినేని నాగార్జున కనుసన్నల్లో వంద రోజులపాటు బూతుల స్వర్గంలో విలువైన సమయాన్ని వేస్ట్ చేసే బిగ్‌బాస్ షో వచ్చేస్తున్నదని మండిపడ్డారు.
సోమవారం హైదరాబాద్‌లోని సీపీఐ రాష్ట్ర కార్యాల యం మఖ్దూంభవన్‌లో నారాయణ మాట్లాడుతూ ఈ షో నుంచి ఎలాంటి సందేశం ఇస్తారని ప్రేక్షకులు అడగాలని కోరారు. పెళ్లాలను వదిలేసిన మొగుళ్లు, మొగుళ్లను వదిలేసిన పెళ్లాలు అచ్చోసిన ఆంబోతుల్లా జీవించండని సందేశం ఇస్తారేమో అని ఎద్దేవా చేశారు. కాసులకు కక్కుర్తిపడే సిగ్గులేని వ్యక్తులు ఉన్నంత కాలం ఈ పాపాలకు ఆదరణ ఉంటున్నదని విమర్శించారు.