కోస్గి, ఏప్రిల్ 25 : పేదోడి ఇంటిపై ఓ కాంగ్రెస్ నేత కన్ను పడింది. అధికారమే అండగా అతడి ఇంటిని కూల్చి కొత్తగా తాను ఇంటి నిర్మాణాన్ని దర్జాగా పూర్తిచేశాడు. బాధితుల వివరాల మేరకు.. కోస్గి మండలం మీర్జాపూర్‌కు చెందిన నీలి ప్రభాకర్ ఇంటికి సమీపంలోనే అధికార పార్టీకి చెందిన ఓ నేత ఇల్లు ఉన్నది. ఇటీవల కొత్త ఇల్లు పనులను సదరు కాంగ్రెస్ నేత ప్రారంభించారు. నిర్మాణానికి అడ్డుగా ఉందంటూ ప్రభాకర్ ఇంటిలో కొంత భాగాన్ని కూల్చివేసి కబ్జాకు దిగాడు. ఈ విషయం పంచాయతీ సెక్రటరీ, పోలీసులకు ఫిర్యాదు చేసినా స్పందించలేదని ప్రభాకర్ వాపోయాడు. ఇంటి కబ్జా విషయమై గ్రామ పెద్దల దృష్టికి తీసుకెళ్లగా.. కాంగ్రెస్ నేత ఇంటికి సరిహద్దులు నిర్ణయించారని, అయినా హద్దులు చెరిపేసి ఇంటి నిర్మాణం చేపడుతున్నాడని ఆవేదన చెందాడు. ఇప్పటికైనా అధికారులు స్పందించకుంటే తనకు చావే శరణ్యమని ప్రభాకర్ కుటుంబీకులు పేర్కొన్నారు. సీఎం ఇలాకాలో అధికార పార్టీ నాయకుడు కబ్జా, బెదిరింపులకు దిగడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.