అనుముల భూదోపిడీకి.. ఆయుధంగా 22a
‘అధికారాన్ని అడ్డంపెట్టుకోవాలి. తద్వారా రూ. కోట్ల విలువైన భూములను యథేచ్ఛగా దోచుకోవాలి. ఇందుకు కాదేదీ అనర్హం అన్నట్టు.. చివరకు 22ఏ నిషేధిత జాబితాను కూడా ఓ ఆయుధంగా మలుచుకోవాలి. ముఖ్యమంత్రి రేవంత్ కుటుంబం చేస్తున్నదిదే’ అని బీఆర్ఎస్ అధికార ప్రతినిధి, మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మన్నె క్రిశాంక్ విమర్శించారు.
- సీఎం తమ్ముడు కృష్ణారెడ్డి కంపెనీకి నిషేధిత భూములు ధారాదత్తం
- ఆర్9 కన్స్ట్రక్షన్ పేరుపై చందనవల్లిలోని 4.2 ఎకరాల భూములు
- సాక్ష్యాలతో బయటపెట్టిన బీఆర్ఎస్ అధికార ప్రతినిధి మన్నె క్రిశాంక్
- సర్వే నంబర్ 363/3 భూములపై సీబీఐ విచారణ చేపట్టాలని డిమాండ్
- బిష్ణోయ్ గ్యాంగ్ తరహాలో రాష్ట్రంలోని అన్ని సెక్టార్లలోకి చొరబడి
- రేవంత్ అండ్ గ్యాంగ్ దందాలు, దోపిడీలకు పాల్పడుతున్నదని ఫైర్
- ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే, విషయాన్ని డైవర్ట్ చేసేందుకే కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావుపై బురద చల్లుతున్నారంటూ తీవ్రస్థాయిలో ధ్వజం
హైదరాబాద్, అక్టోబర్ 19 (నమస్తే తెలంగాణ): ‘అధికారాన్ని అడ్డంపెట్టుకోవాలి. తద్వారా రూ. కోట్ల విలువైన భూములను యథేచ్ఛగా దోచుకోవాలి. ఇందుకు కాదేదీ అనర్హం అన్నట్టు.. చివరకు 22ఏ నిషేధిత జాబితాను కూడా ఓ ఆయుధంగా మలుచుకోవాలి. ముఖ్యమంత్రి రేవంత్ కుటుంబం చేస్తున్నదిదే’ అని బీఆర్ఎస్ అధికార ప్రతినిధి, మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మన్నె క్రిశాంక్ విమర్శించారు.
నిషేధిత జాబితాలో పెట్టిన భూములకు సంబంధించి సామాన్యులు వేదన అనుభవిస్తుంటే.. అనుముల కుటుంబం మాత్రం దోపిడీకి మార్గంగా దాన్ని మలుచుకున్నదని ఆయన ధ్వజమెత్తారు. నిషేధిత భూములనూ పట్టాలు, రిజిస్ట్రేషన్లు చేసుకుంటున్నారంటూ తీవ్ర విమర్శలు చేశారు. నిషేధ జాబితా మాటున ముఖ్యమంత్రి తమ్ముడు కృష్ణారెడ్డి అక్రమాలకు పాల్పడ్డాడని ఆరోపించిన క్రిశాం క్.. ఈ మేరకు పలు ఆధారాలను, సాక్ష్యాలను ఆయన మీడియా ముందుంచారు.
‘రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలోని చందనవల్లి గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 363లో ఉన్న భూములు అసైన్డ్భూములుగా ఉంటూ నిషేధిత జాబితాలో కొనసాగుతున్నాయి. ఈ నిషేధిత భూముల్లోని 363/3 సర్వే నంబర్లోని సుమారు 4.2 ఎకరాల భూమిని సీఎం రేవం త్ చిన్న తమ్ముడు అనుముల కృష్ణారెడ్డి తన కంపెనీ పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకొన్నారు’ అని క్రిశాంక్ ఆరోపించారు. సామాన్యులకు సాధ్యంకాని నిషేధిత భూముల రిజిస్ట్రేషన్.. కృష్ణారెడ్డికి మాత్రమే ఎలా సాధ్యమైందో సమాధానం చెప్పాలని రేవంత్‌రెడ్డి ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు.
భూములను దోచుకోవడమే కాదు.. మ్యాక్స్బియన్ ఫార్మా, మెడికవర్ ఆసుపత్రులు, మైండ్వాల్ట్ కార్పొరేట్ సూల్స్, టెసరాక్ట్ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్, స్వచ్ఛ్ బయో, గీతా హ్యుందాయ్ షోరూమ్స్.. ఇలా ఏ రంగాన్ని కూడా రేవంత్ ప్రభుత్వం వదలడం లేదని మండిపడ్డారు. ఉత్తర భారతదేశంలో బిష్ణోయ్ గ్యాంగ్ దోచుకుంటున్నట్టుగా ఇక్కడ రేవంత్ కుటుంబం కూడా దోపిడీకి పాల్పడుతున్నదంటూ తీవ్ర విమర్శలు చేశారు.
ఆధారాలతో బయపడ్డవి కొన్నేనని, దొరకనివి అనేకం ఉండొచ్చునని చెప్పారు. ఫార్మా, హెల్త్, డిఫెన్స్, సూల్స్, ఆటోమొబైల్, భూములు.. ఇలా అన్ని రంగాల్లో రేవంత్ కుటుంబం సాగిస్తున్న అక్రమాలపై సీబీఐ విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు తెలంగాణభవన్‌లో సోమవారం నిర్వహించిన ప్రెస్మీట్లో క్రిశాంక్.. కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. రేవంత్ కుటుంబసభ్యుల కుంభకోణాలకు సంబంధించిన ఫొటోలను మీడియా ఎదుట ప్రదర్శించారు. ఈ సందర్భంగా క్రిశాంక్ మాట్లాడుతూ.. రేవంత్‌రెడ్డి కుటుంబం రెండున్నరేండ్లలోనే రూ.50 వేల కోట్ల దోపిడీకి పాల్పడిందని, ఇందుకు సంబంధించిన ఆధారాలను కొన్ని నెలల నుంచి తాము ఒక్కొక్కటిగా బయటపెడుతున్నామని గుర్తుచేశారు.
మరో పవర్ సెంటర్‌గా కృష్ణారెడ్డి
రేవంత్ కుటుంబ సభ్యులు అధికార కేంద్రాలుగా మారుతున్నారని, ఇప్పుడు చిన్న తమ్ముడు కృష్ణారెడ్డి మరో పవర్ సెంటర్‌గా మారారని క్రిశాంక్ ఆరోపించారు. మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి కూడా కృష్ణారెడ్డి పేరు ప్రస్తావించారని గుర్తుచేశారు. కాంగ్రెస్‌లోకి రాని ఎమ్మెల్యేల నియోజకవర్గాలకు రూపాయి కూడా ఇవ్వబోమని కృష్ణారెడ్డి బెదిరించారని, ఇందుకు సంబంధించిన ఆడియో రికార్డును మీడియాకు వినిపించారు. ఎమ్మెల్యేలను బెదిరించడంతోపాటు 22ఏను అడ్డంపెట్టుకొని కృష్ణారెడ్డి భూదందాలు చేస్తున్నారని విమర్శించారు.
చందనవల్లి గ్రామ పరిధిలో ఉన్న సర్వే నంబర్ 363/1, 2, 3, అ, ఆ.. ఇలా అన్ని భూములు అసైన్డ్ జాబితాలో ఉన్నాయని క్రిశాంక్ గుర్తుచేశారు. అయితే, ఇందులో సర్వే నంబర్ 363/3లోని 4.2 ఎకరాల భూమి కోతా శ్రీకాంత్‌రెడ్డి పేరున 2026 జూన్ 10న రిజిస్ట్రేషన్ జరిగిందని చెప్పారు. సర్వే నంబర్ 363లోని భూములన్నీ ఈ రోజు ఉదయం వరకు లావుణి పట్టాల కింద నిషేధిత జాబితాలో ఉన్నాయని, 363/3 ఒక్కదానినే ఎందుకు మినహాయించి పట్టా ఎందుకు చేశారని ప్రశ్నించారు.
కోతా శ్రీకాంత్‌రెడ్డి ఎవరని పరిశీలించగా, ఆర్9 కన్స్ట్రక్షన్ కంపెనీకి చెందిన వ్యక్తిగా తేలిందని, ఆ కంపెనీ యజమాని కృష్ణారెడ్డి అని స్పష్టంచేశారు. ఈ కంపెనీ కూడా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాతే ఏర్పాటైందని చెప్పారు. భూదందాలకు సంబంధించి తొలుత కొందరిని ముందుపెట్టి.. వెనుక అనుముల ఫ్యామిలీ ఉంటుందని, ఇక్కడ కూడా కంపెనీ డైరెక్టర్‌ను ముందు పెట్టి వెనుక రేవంత్ తమ్ముడు ఉన్నారని వెల్లడించారు. మంచిరేవులలో ఆర్9 కన్స్ట్రక్షన్స్ పేరిట విల్లా ఉన్నదని, దాని కూడా కృష్ణారెడ్డే అని ఆరోపించారు. ఇందుకు సంబంధించిన ఆధారాలను మీడియాకు చూపించారు.
‘సామాన్యులు కోర్టుల చుట్టూ తిరిగినా పరిష్కారం కానటువంటి 22ఏ జాబితా భూముల వ్యవహారం.. ఒక్క అనుముల కుటుంబానికి మాత్రం సులభంగా ఎలా పరిష్కారమవుతున్నది? నిషేధిత భూములు పట్టాలుగా ఎలా మారుతున్నాయి? ఇది భూభారతి కాదు.. రేవంత్ కుటుంబసభ్యుల భూహారతి!’ అని క్రిశాంక్ మండిపడ్డారు. ఈ భూముల లావాదేవీలపై సంబంధిత రికార్డులను పరిశీలించి వాస్తవాలను వెల్లడించాలని డిమాండ్ చేశారు. ‘అనుముల కుటుంబానికి సరెండర్ అయినవాళ్లు సరెండర్ అయ్యారు.. భూములు వదిలేసుకున్నవాళ్లు వదిలేసుకున్నరు.. కొందరు కంటతడి పెట్టుకున్నరు. కొందరు రోడ్డు మీడికి వచ్చారు.. ఒకరిద్దరు ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు’ అని పేర్కొన్నారు.
అక్రమ కేసులతో వేధింపులు
రేవంత్‌రెడ్డి, ఆయన కుటుంబ సభ్యుల అక్రమాలను ఆధారాలతోసహా బయటపెడితే.. తమపై అక్రమ కేసులు బనాయిస్తూ బెదిరిస్తున్నారని క్రిశాంక్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ భూ అక్రమాలపై రేవంత్‌రెడ్డి విచారణకు ఆదేశిస్తారా? లేదా రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి విచారణకు ఆదేశిస్తారా? అని ప్రశ్నించారు. రేవంత్‌రెడ్డి కుటుంబం దోపిడీకి ఎలాంటి శిక్ష వేయాలని నిలదీశారు. గతంలో అసెంబ్లీ సాక్షిగా పొంగులేటిని ముఖ్యమంత్రి బెదిరించారని చెప్పారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ.. ఇక్కడి కాంగ్రెస్ ప్రభుత్వంపై విచారణ చేపట్టడం లేదని విమర్శించారు.
రాష్ట్రంలో జరుగుతున్న భూ వ్యవహారాలు, ఇతర ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. రేవంత్‌రెడ్డి కుటుంబానికి చెందిన దవాఖానల కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు. ‘కేసీఆర్ వ్యవసాయం చేసుకొంటే చంపాలని అంటున్నవ్ కదా.. మరి నువ్వు, నీ కుటుంబ సభ్యులు చేస్తున్న దోపిడీకి నిన్నేం చేయాలి రేవంత్?’ అని నిలదీశారు. ‘కాంగ్రెస్ నేతలు బస్సు యాత్రలు చేసి ఏం సాధించారని, రేవంత్‌రెడ్డి కుటుంబ సభ్యుల దందాలపై నడిబజారులో నిలబెట్టి ప్రశ్నించొద్దా? ఈ అక్రమాలపై చర్చకు సిద్ధమా? అని సవాల్ విసిరారు.
అనుముల రియల్ ఎస్టేట్ ఎట్ల పెరుగుతున్నది?
రాష్ట్రంలో ఒకవైపు రియల్ ఎస్టేట్ పడిపోతుంటే అనుముల రియల్ ఎస్టేట్ మాత్రం ఎలా పెరుగుతున్నదని క్రిశాంక్ ప్రశ్నించారు. ‘అక్కడెక్కడో ఉత్తరాన బిష్ణోయ్ గ్యాంగ్ నడుస్తున్నదట.. రేవంత్‌ది కూడా అట్లాంటి గ్యాంగే’నని మండిపడ్డారు. తెలంగాణలో ఏ సెక్టార్‌నూ ఈ అనుముల గ్యాంగ్ వదలడం లేదని అన్నారు. బీఆర్ఎస్ నేతలు అడిగిన ప్రశ్నలకు కాంగ్రెస్ నేతలు సమాధానాలు చెప్పడం మానేసి, బెదింపులకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. మ్యాక్స్బియన్ ఫార్మా, మెడికవర్ ఆసుపత్రులు, మైండ్వాల్ట్ కార్పొరేట్ సూల్స్, టెసెరాక్ట్ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్, స్వచ్ఛ్ బయో, గీతా హ్యుందాయ్ షోరూమ్స్ తదితర సంస్థల వ్యవహారాలపై ముఖ్యమంత్రి వెంటనే స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఆయా సంస్థలకు ప్రభుత్వంలో ఉన్నవారికి గల సంబంధాలు, పెట్టుబడుల వివరాలు, భూముల కేటాయింపులపై ప్రజలకు వాస్తవాలు తెలియజేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఆరోపణలకు రాజకీయ విమర్శలతో సమాధానం చెప్పకుండా, సంబంధిత పత్రాల ఆధారంగా స్పష్టత ఇవ్వాలని కోరారు. కేసీఆర్, బీఆర్ఎస్ నాయకులపై ఆరోపణలు చేస్తున్నప్పుడు, తాము తగిన ఆధారాలతో ఆ ఆరోపణలు అబద్ధమని నిరూపిస్తున్నామన్న క్రిశాంక్.. రేవంత్ కుటుంబంపై తాము చేస్తున్న ఆరోపణల మీద కాంగ్రెస్ నేతలుకానీ, అనుముల కుటుంబం కానీ తగిన ఆధారాలతో ఎందుకు స్పందించడంలేదని ప్రశ్నించారు.
అన్ని అంశాలపై విచారణ చేపట్టాలి
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కుటుంబానికి సంబంధించి ప్రస్తావించిన వ్యాపార సంస్థలు, భూ లావాదేవీలు, ముఖ్యంగా 22ఏ నిషేధిత భూముల నుంచి ప్రస్తుత చందనవల్లి సర్వే నంబర్ 363/3 భూమి రిజిస్ట్రేషన్ వరకు అన్ని అంశాలపై సమగ్ర, స్వతంత్ర దర్యాప్తు జరిపించాలని క్రిశాంక్ డిమాండ్ చేశారు. ఆర్9 కన్స్ట్రక్షన్స్కు సంబంధించిన లావాదేవీల్లో కృష్ణారెడ్డి పాత్రపై వచ్చిన ఆరోపణలపైనా విచారణ జరగాలని అన్నారు. ఈ భూ లావాదేవీల్లో ఎలాంటి అక్రమాలు జరగలేదని ప్రభుత్వం భావిస్తే, స్వతంత్ర దర్యాప్తునకు ఎందుకు ముందుకు రావడం లేదని క్రిశాంక్ ప్రశ్నించారు. సంబంధిత అధికారిక పత్రాలు, కంపెనీల డైరెక్టర్లు, వాటాదారుల వివరాలు, రిజిస్ట్రేషన్ రికార్డులను పరిశీలించి నిజానిజాలు బయటపెట్టాలని కోరారు. భూ లావాదేవీలు, అవినీతి ఆరోపణలపై రాజకీయ ప్రకటనలకే పరిమితం కాకుండా, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కూడా వాస్తవాలను వెలికితీసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని క్రిశాంక్ డిమాండ్ చేశారు.

క్రిశాంక్ ఆరోపిస్తున్నట్టుగా భూములు కొట్టేసిందిలా..!
స్టెప్-1:రేవంత్ ప్రభుత్వం రాగానే ఏర్పాటైన ఆర్9 కన్స్ట్రక్షన్ కంపెనీ
స్టెప్-2: ఆర్9 కన్స్ట్రక్షన్ కంపెనీ హెడ్‌గా రేవంత్ సోదరుడు అనుముల కృష్ణారెడ్డి
స్టెప్-3:స్టెప్-3: షాబాద్ మండలం చందనవల్లిలోని నిషేధిత జాబితాలో ఉన్న 4.2 ఎకరాల భూముల గుర్తింపు
స్టెప్-4:అధికారాన్ని అడ్డంపెట్టుకొని నిషేధిత జాబితాలో ఉన్న ఆ భూములను.. పట్టా భూములుగా మార్పు
స్టెప్-5:ఆర్9 కన్స్ట్రక్షన్ కంపెనీకి చెందిన కోతా శ్రీకాంత్‌రెడ్డి పేరున భూముల రిజిస్ట్రేషన్
స్టెప్-6:అంతిమంగా రూ. కోట్లు విలువజేసే 4.2 ఎకరాలను సొంతం చేసుకొన్న అనుముల ఫ్యామిలీ
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

