హైదరాబాద్, జూన్ 2 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ సేవలందిస్తున్న పోలీసు, అగ్నిమాపకశాఖల్లోని మొత్తం 655 మందికి వివిధ పతకాలను ప్రకటించింది. ఇందులో పోలీసు శాఖ నుంచి 633 మంది, అగ్నిమాపకశాఖ నుంచి 22 మంది ఎంపికయ్యారు. శౌర్య, మహోన్నత సేవ, ఉత్తమ సేవ, సేవా పతకం పేరుతో మొత్తం ఐదు క్యాటగిరీలకు ఎంపికైన అధికారులు, సిబ్బంది జాబితాను రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి రవిగుప్తా గురువారం విడుదల చేశారు.
తెలంగాణ పోలీస్‌శాఖలోని సివిల్, ఏఆర్, టీఎస్ఎస్పీ, గ్రేహౌండ్స్, ఏసీబీ, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, ఎస్పీఎఫ్లోని వివిధ విభాగాల్లో కలిపి ఈ పతకాలకు ఎంపిక చేశారు. పోలీసుశాఖ నుంచి అత్యుత్తుమ శౌర్య పతకానికి తెలంగాణ గ్రేహౌండ్స్‌లో పనిచేస్తున్న 11 మంది ఎంపికయ్యారు. పోలీస్ శాఖ నుంచి మహోన్నత సేవా పతకానికి 8 మంది, ఉత్తమ సేవా పతకానికి 92 మంది, కఠినసేవా పతకానికి 50 మంది, సేవా పతకానికి 472 మందిని ఎంపిక చేశారు.
అగ్నిమాపక శాఖ నుంచి శౌర్య పతకానికి నలుగురు, మహోన్నత సేవా పతకానికి ఒకరు, ఉత్తమ సేవా పతకానికి ముగ్గురు, సేవా పతకానికి 14 మంది ఎంపికయ్యారు. శౌర్యపతకం పొందిన వారికి రూ.10 వేల నగదు పురస్కారంతో పాటు ప్రతి నెలా జీతంలో రూ.500 చొప్పున చెల్లించనున్నారు. మహోన్నత సేవా పతకం పొందిన వారికి రూ.40 వేలు, ఉత్తమ సేవా పతకం పొందిన వారికి రూ.30 వేలు, కఠిన సేవా పతకం పొందిన వారికి రూ.20 వేలు, సేవ పతకాలు పొందిన వారికి రూ.20వేల చొప్పున నగదు పురస్కారం అందజేయనున్నారు.
అగ్నిమాపకశాఖలో కరీంగనర్ డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ టీ వెంకన్న మహోన్నత సేవా పతకానికి ఎంపికయ్యారు. ఉత్తమ సేవా పతకానికి పరకాల ఫైర్‌స్టేషన్ లీడింగ్ ఫైర్‌మెన్ జీ ఉప్పలయ్య, హైదరాబాద్ సివిల్ డిఫెన్స్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ వై ప్రభాకర్‌రెడ్డి, రంగారెడ్డి డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ ఎస్ శ్రీధర్‌రెడ్డి ఎంపికయ్యారు.
సేవా పతకాలకు డిప్యూటీ డైరెక్టర్ బీజేఈ ప్రసన్నకుమార్, సెంట్రల్ రీజియన్ రీజినల్ ఫైర్ ఆఫీసర్ వీ పాపయ్య, కూకట్పల్లి డివిజన్ హజ్మత్ డీఎఫ్‌వో బీ సుధాకర్‌రావు, నిజామాబాద్ అసిస్టెంట్ డీఎఫ్‌వో వీ భానుప్రతాప్, బోధన్ ఫైర్‌స్టేషన్ ఆఫీసర్ బీ గంగాదాస్, కోదాడ ఫైర్‌స్టేషన్ ఆఫీసర్ కే రామలింగం, మొఘల్‌పుర ఫైర్‌స్టేషన్ ఆఫీసర్ ప్రేమ్‌కుమార్, నల్లగొండ ఫైర్‌స్టేషన్ లీడింగ్ ఫైర్‌మెన్ ఎస్ రామచంద్రయ్య, హాలియా ఫైర్‌స్టేషన్ లీడింగ్ ఫైర్‌మెన్ ఎండీ నిరంజన్, హనుమకొండ ఫైర్‌స్టేషన్ లీడింగ్ ఫైర్‌మెన్ బీ సుధాకర్‌రెడ్డి, వరంగల్ ఫైర్‌స్టేషన్ లీడింగ్ ఫైర్‌మెన్ ఎండీ షపీపాషా, కూకట్పల్లి ఫైర్‌స్టేషన్ లీడింగ్ ఫైర్‌మెన్ ఎం యాదగిరి, సెక్రటేరియట్ ఫైర్‌స్టేషన్ లీడింగ్ ఫైర్‌మెన్ వీ చంద్రనాయక్, నారాయణఖేడ్ ఫైర్‌స్టేషన్ డ్రైవర్ ఆపరేటర్ ఎస్ కిషన్ ఎంపికయ్యారు.