ఆశా కార్యకర్తల ఉక్కిరి బిక్కిరి
ప్రజారోగ్య పరిరక్షణలో కీలక భూమిక పోషిస్తున్న ఆశా కార్యకర్తలు ఊపిరి సలుపని పనిభారంతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. నేషనల్ హెల్త్ మిషన్ మార్గదర్శకాల ప్రకారం కేవల ఆరోగ్యసంబంధ విధులు, సంబంధిత సర్వేలు నిర్వర్తించాల్సి ఉంటుంది.
- ఐదువేల ఖాళీల భర్తీలో సర్కార్ నిర్లక్ష్యం
- ‘సర్’, బీఎల్వో విధుల అప్పగింత
- అమలుకాని జాబ్‌చార్ట్.. పనిభారంతో సతమతం
హైదరాబాద్, నవంబర్ 9 (నమస్తే తెలంగాణ): ప్రజారోగ్య పరిరక్షణలో కీలక భూమిక పోషిస్తున్న ఆశా కార్యకర్తలు ఊపిరి సలుపని పనిభారంతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. నేషనల్ హెల్త్ మిషన్ మార్గదర్శకాల ప్రకారం కేవల ఆరోగ్యసంబంధ విధులు, సంబంధిత సర్వేలు నిర్వర్తించాల్సి ఉంటుంది. కానీ ఇందుకు విరుద్ధంగా ప్రభుత్వం వీరికి అదనపు విధులు అప్పజెప్పుతున్నది. గతంలో కులగణన, ఇటీవల ఓటర్ల నమోదులో బీఎల్వోలుగా, తాజాగా ‘సర్’ నిర్వహణ బాధ్యతలు అప్పగించింది. దీంతో వారు పనిభారంతో తీవ్రమైన శారీకర, మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. అదనపు భారం మోపుతున్న ప్రభుత్వం కనీసం తగిన పారితోషికం కూడా ఇవ్వడంలేదని ఆశా వర్కర్స్ యూనియన్ నాయకులు ఆరోపిస్తున్నారు.
ఎన్హెచ్ఎం నిబంధనల ప్రకారం ఆశా కార్యకర్తలు కేవలం ఆరోగ్యసంబంధ విధులే నిర్వర్తించాల్సి ఉంటుంది. మాతాశిశు ఆరోగ్య సేవల్లో భాగంగా గర్భిణుల వివరాల నమోదు, వారికి ప్రభుత్వ వైద్యశాలల్లో పరీక్షలు చేయించడం, సర్కార్ దవాఖానల్లో ప్రసవాలు జరిగేలా చూడడం, నవజాత శిశువులు, బాలింతల ఆరోగ్య పర్యవేక్షణ, పిల్లలకు టీకాలు వేయించడం, కుటుంబనియంత్రణపై అవగాహన కల్పించడం, క్షయ, మధుమేహం, రక్తపోటు, క్యాన్సర్, అసంక్రమిత వ్యాధులు గుర్తించి, బాధితుల ఆరోగ్య పర్యవేక్షణ చేయాల్సి ఉంటుంది.
వారంలో నాలుగు రోజులు, రోజుకు 2 నుంచి 3 గంటలు వారికి కేటాయించిన గ్రామాల్లో పనిచేయాలి. ఒకవేళ ఆరోగ్యపరమైన సర్వేలు నిర్వహించాల్సి వచ్చినప్పుడు అదనపు పారితోషికం ఇచ్చి మరో రెండు, మూడు గంటలు బాధ్యతలు అప్పగించాలి. ప్రభుత్వం మాత్రం ఎక్కడా జాబ్‌చార్ట్ అమలు చేయడంలేదని ఆశా వర్కర్స్ యూనియన్ నాయకులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. సంబంధంలేని సర్వేలు, ఓటు నమోదు ఇతరత్రా పనులు చేయిస్తున్నదని మండిపడుతున్నారు. గర్భిణుల ప్రసవాల సమయంలో దవాఖానల వద్ద రెండు, మూడు రోజులు పడిగాపులు కాయాల్సి వస్తున్నదని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. కానీ తమ శ్రమను మాత్రం గుర్తించడంలేదని వాపోతున్నారు.
ఖాళీల భర్తీ ఊసే లేదు
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అంటే 2023 వరకు 32 వేల మంది ఆశా కార్యకర్తలు విధులు నిర్వర్తించేవారు. జనాభా ఆధారంగా గ్రామానికి ఇద్దరు నుంచి ఐదుగురు ప్రజారోగ్యాన్ని పర్యవేక్షించేవారు. ఖాళీ పోస్టులను వెనువెంటనే భర్తీ చేసేవారు. కానీ కాంగ్రెస్ అధికారంలో వచ్చిన తర్వాత ఖాళీలను భర్తీ చేయడంలేదని ఆశా వర్కర్స్ యూనియన్ బాధ్యులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం 27 వేల మంది కార్యకర్తలే పనిచేస్తున్నారని, 5 వేల పోస్టులు ఖాళీ ఉన్నాయని చెప్తున్నారు. దీంతో ఉన్నవారిపై అదనపు భారం పడుతున్నదని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఖాళీలు భర్తీ చేయాలని అధికారులు, మంత్రి దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు.
ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవట్లే..
పనిభారంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, ఖాళీలు భర్తీ చేయాలని ప్రభుత్వానికి ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడంలేదు. కొందరు కార్యకర్తలకు సొంత గ్రామంతోపాటు పొరుగున ఉన్న గ్రామంలో ప్రజారోగ్య పరిరక్షణ విధులు కేటాయిస్తున్నారు. దీంతో వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అంతేగాకుండా ‘సర్’తో పాటు ఎన్నికల విధులు, ఇతర సర్వే పనులు కూడా చేయిస్తున్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించి ఖాళీలను భర్తీ చేయాలి.
– రావుల సంతోష, ఆశా కార్యకర్తల యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు, బీఆర్టీయూ
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

