4 వేల కోట్ల భూమికి ‘బిగ్’ ఎసరు
గుడిసెలు వేసుకున్న పేదలకు 2005లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇండ్లు కేటాయించింది. కానీ ఇప్పుడు అదే కాంగ్రెస్ పాలన.. వారి నీడను కబళిస్తున్నది. రౌడీమూకతో చేతులు కలిపిన అధికార పార్టీ పెద్దలు హనుమకొండ జిల్లా కాజీపేటలోని 12.37 ఎకరాల ప్రభుత్వ భూమిపై కన్నేశారు. వైఎస్ఆర్ కాలనీని కబళిం చేందుకు బుల్డోజర్లు, గూండాలను దింపి పేద ప్రజలను భయపెడుతున్నారు.
- కాజీపేటలో 12.37 ఎకరాల ప్రభుత్వ భూమిపై పంజా
- మహారాష్ట్ర ఎమ్మెల్యే ద్వారా ‘ముఖ్యనేత’ టీమ్‌కు డీల్
- మంత్రి, ఎమ్మెల్యేను రంగంలోకి దింపిన బిగ్ బ్రదర్స్
- ఎమ్మెల్యే సామ, దాన, భేద దండోపాయాలు ప్రయోగం
- డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇప్పిస్తానని కాలనీవాసులకు ఆశ
- వినకపోవడంతో పేదల ఇండ్లపైకి కదంతొక్కిన బుల్డోజర్లు
- ప్రాణాలు పోయినా కదలమని తేల్చిచెప్పిన కాలనీవాసులు
- మీ అంతుచూస్తామని బెదిరిస్తున్న రౌడీలు, గూండాలు
- పోలీసుల ప్రేక్షకపాత్ర.. రికార్డుల్లేవంటున్న రెవెన్యూశాఖ
గుడిసెలు వేసుకున్న పేదలకు 2005లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇండ్లు కేటాయించింది. కానీ ఇప్పుడు అదే కాంగ్రెస్ పాలన.. వారి నీడను కబళిస్తున్నది. రౌడీమూకతో చేతులు కలిపిన అధికార పార్టీ పెద్దలు హనుమకొండ జిల్లా కాజీపేటలోని 12.37 ఎకరాల ప్రభుత్వ భూమిపై కన్నేశారు. వైఎస్ఆర్ కాలనీని కబళిం చేందుకు బుల్డోజర్లు, గూండాలను దింపి పేద ప్రజలను భయపెడుతున్నారు.
(నూర శ్రీనివాస్)
వరంగల్, నవంబర్ 10 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : అది హనుమకొండ జిల్లా కాజీపేట మండలం కడిపికొండ శివారులోని సర్వే నంబర్లు 64,70,71,72,73. ఉత్తర, దక్షిణ భారతదేశానికి వారధిగా ఉన్న కాజీపేట రైల్వే స్టేషన్‌కు 150 మీటర్లు, కాజీపేట చౌరస్తాకు కేవలం 50 అడుగుల దూరం. కాజీపేట పోలీస్‌స్టేషన్ దాటి పది అడుగుల దూరం వెళ్లగానే (సోమిడికి వెళ్లే దారి) ఎదురుగా ‘మైసమ్మతల్లి దేవాలయం’.. వైఎస్ఆర్నగర్ పేరుతో ఆర్చ్లాంటి గేటు. దాన్ని దాటుకొని 10 అడుగులు లోనికి వేయగానే పక్కపక్కనే మైసమ్మతల్లి, పోచమ్మతల్లి ఆలయాలు. వాటి వెనుకకు తొంగిచూస్తే అంతులేని విషాదం అలముకున్న మనుషుల గుంపు. వృద్ధులు, మహిళలు, చిన్నపిల్లలు.. ఇలా ఎవరితో మాట్లాడినా కన్నీటి ఎగపోతలే. ‘పగలో.. రాత్రో తెలియక బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నం. మేమిక్కడ గుడిసెలు వేసుకున్నప్పుడు వచ్చిన పాములు, తేళ్లకు భయపడలేదు. కానీ ఇప్పుడు ఎటు నుంచి ఏ గూండాగాడో.. ఏ రౌడీషీటరో కత్తులు పట్టుకొని వచ్చి కుత్తుకలు తెగ్గోస్తాడోనని భయపడిపోతున్నం. ఏ ట్రాక్టరో.. ఏ బుల్డోజరో వచ్చి మా ఇంటిని కూలగొడుతదో, ఎవరు వచ్చి ఆ శిథిలాల కింద మమ్ములను పాతిపెట్టిపోతరోనని గజగజ వణుకుతున్నం’ అని ఉలిక్కిపడుతున్నారు.
ఇదీ వైఎస్ఆర్నగర్ చరిత్ర
దాదాపు రెండున్నర దశాబ్దాల కిందట కాజీపేట రైల్వేస్టేషన్ ముందు అడవిని తలపించే ప్రాంతం ఉండేది. మడికొండ, కడిపికొండ, సోమిడి తదితర ప్రాంతాల నుంచి అనేక మంది వలస వచ్చి కాజీపేట రైల్వేస్టేషన్, బస్‌స్టాండ్, ఇతర చుట్టుపక్కల ప్రాంతాల్లో కూలీపనులు చేసేవాళ్లు, సమోసాలు, బఠానీలు, అరటిపండ్లు, కంకులు, పేలాలు అమ్ముకొని జీవనం సాగించేవారు. వారు రైల్వే ప్లాట్ఫామ్స్పైనో, బస్‌స్టాప్ పక్కనో విసిరేసినట్టు నివసించేవారు. 2005లో వారి దుస్థితిని గమనించిన స్థానిక కాంగ్రెస్ నాయకుడు రావుల సదానందం సర్వే నంబర్లు 64,70,71,72,73లో ప్రభుత్వ భూమి ఉన్నదని పేర్కొంటూ, అందులో గుడిసెలు వేయించారు.
ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పాదయాత్ర చేపట్టిన సందర్భంగా.. అందరూ వెళ్లి ఆ ప్రభుత్వ భూమిలో తాము గుడిసెలు వేసుకుంటామని వినపతిపత్రం అందజేశారు. దీంతో ‘మీ గుడిసెలకు తప్పకుండా పట్టాలు ఇస్తా’ అని రాజశేఖర్‌రెడ్డి వారికి వాగ్దానం చేశారు. ప్రస్తుత వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి ఆ సమయంలో సిటీ కాంగ్రెస్ నాయకుడిగా ఉన్నారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి తమకు మాట ఇవ్వడంతో పేదలు 2005లో గుడిసెలు వేసుకున్నారు.
ఈ విషయం తెలియగానే కాజీపేటకు చెందిన శాపూర్జీ ఇరానీ కుమారుడు కైకుస్రూ ఆ భూమి తమదంటూ ముందుకొచ్చారు. 1976 ఆగస్టు 24న దాఖలు చేసిన డిక్లరేషన్‌లో తనకు కడిపికొండ శివారు పరిధిలోని సర్వేనంబర్లు 64, 70, 71, 72,73 మొత్తం 25.18 ఎకరాల భూమి ఉన్నదని (సీసీ ఫైల్ నంబర్ ఏ3/1139/76లో), అది సీలింగ్ యాక్ట్‌కు లోబడే ఉన్నదని పేర్కొన్నారు. ఈ మేరకు వరంగల్ అర్బన్ ల్యాండ్ సీలింగ్ అధికారులకు కైకుస్రూ డిక్లరేషన్ ఇచ్చారు.
ఇది సరైనదా.. కాదా? అనే విషయాన్ని తేల్చేందుకు అర్బన్ ల్యాండ్ సీలింగ్ అధికారితోపాటు ప్రత్యేక విచారణాధికారి అర్బన్‌ల్యాండ్ సీలింగ్ చట్టంలోని సెక్షన్ 8(4)ను అనుసరించి ప్రభుత్వ రికార్డులనేకాకుండా క్షేత్రస్థాయిలో పరిశీలించి ఒక ముసాయిదా ప్రకటన విడుదల చేశారు. దీనిపై అనేక సంవత్సరాలపాటు ల్యాండ్ సీలింగ్ అప్పిలేట్ అథారిటీ, న్యాయస్థానాల్లో వాదనలు జరిగాయి. చివరికి అర్బన్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్‌ను అనుసరించి శాపూర్జీ దాఖలు చేసిన డిక్లరేషన్‌లో పేర్కొన్నట్టు మొత్తం 25.18 ఎకరాల భూమి వారిది కాదని, అందులో 12.37 ఎకరాలు (52,370 చదరపు మీటర్లు) మిగులు భూమి అని, కాబట్టి అది ప్రభుత్వభూమి అని కోర్టు తేల్చింది.
దీనిపై శాపూర్జీ ఇరానీ వారసులకు, అర్బన్ ల్యాండ్ సీలింగ్ అధికారులకు మధ్య హైకోర్టులో వాదనలు సాగుతున్నాయి. 2005లో అప్పటి వరంగల్ ఎమ్మెల్యే (ప్రస్తుత ఎమ్మెల్సీ) బస్వరాజు సారయ్య అసెంబ్లీలో మాట్లాడుతూ కాజీపేటలో ప్రభుత్వ భూములను ఇష్టానుసారం కబ్జా చేస్తున్నారని, వరంగల్ అర్బన్ ల్యాండ్ సీలింగ్ సిబ్బంది వారికి సహకరిస్తున్నారని ఆరోపించారు. దీంతో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం దీనిపై సమగ్ర విచారణకు 2005 జనవరి 8న ఏసీబీని ఆదేశించింది.
ఈ మేరకు అధికారులు నాటి వరంగల్ జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ వరంగల్ అర్బన్ ల్యాండ్ సీలింగ్, వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ రికార్డును, ఆ రికార్డుకు నేపథ్యమైన ఆధారాలను పరిశీలించారు. రికార్డులు, క్షేత్రస్థాయి పరిశోధనల అనంతరం ప్రభుత్వానికి కాజీపేట భూ వ్యవహారంపై నివేదిక సమర్పించారు. కాజీపేట పట్టణం నడిబొడ్డున కడిపికొండ రెవెన్యూ శివారు 69, 70, 71, 72 సర్వే నంబర్లలో శాపూర్జీ ఇరానీ కుటుంబానికి భూమి ఉన్నదని, అయితే సదరు భూమి అర్బన్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ప్రకారం ఉండాల్సిన దానికన్నా ఎక్కువ ఉన్నదని, మొత్తం 12.37 ఎకరాల మిగులు అని తేల్చారు. కాబట్టి అది ప్రభుత్వ భూమేనని స్పష్టంచేశారు. శాపూర్జీ ఇరానీ వారసులు దీనిపై ఎన్నిసార్లు అప్పీలుకు వెళ్లినా, హైకోర్టుకు వెళ్లినా అనేక వ్యాజ్యాలు వేసినా, అనేక సందర్భాల్లో సదరు భూమి ప్రైవేట్ పట్టాభూమి కాదని, అది సర్కార్ భూమేనని ప్రభుత్వం తేల్చిచెప్పింది.

ఇందిరమ్మ ఇండ్ల ఆశ చూపెట్టి
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాకుండా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనూ ఎవరూ వైఎస్ఆర్నగర్ వాసులవైపు కన్నెత్తి చూడలేదు. ఇతరులకు వచ్చినట్టే ఇంటినంబర్లు, రేషన్‌కార్డులు, ఓటర్ ఐడీలు, ఆధార్‌కార్డులు, ఇంటిపన్ను రసీదులు ఇలా అన్నీ వారికి వస్తున్నాయి. కానీ నాలుగైదు నెలలుగా కాలనీలో అలజడి నెలకొన్నది. 2023 ఎన్నికల సందర్భంగా ‘మీరు ఉంటున్నచోటే పక్కా ఇండ్లు నిర్మించి ఇస్తం’ అని కాంగ్రెస్ నేతలు హామీ ఇచ్చారు.
కానీ ఇప్పుడు ‘మీ అందరికీ శాయంపేటలో (దాదాపు ఆరేడు కిలోమీటర్ల దూరంలో) నిర్మించిన డబుల్బెడ్రూం ఇండ్లు మంజూరు చేస్తున్నం. ఖాళీ చేసి అక్కడికి వెళ్లిపోవాలి. మీరెంత తొందరగా వెళ్తే అంత మంచిది’ అని ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే వారిని బలవంతం చేస్తున్నారు. ఈ ఇండ్లు కేసీఆర్ హయాంలోనే నిర్మాణం పూర్తయ్యాయి. ప్రస్తుతం వైఎస్ఆర్నగర్లో 120 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. ఇందులో 40 మందికి శాయంపేటలో ఇండ్ల పట్టాలు వచ్చాయని, వారు వైఎస్ఆర్నగర్లోని ఇంటిని తమకు తాముగా కూల్చివేసి వెళ్లాలని, అలా వెళ్లినవారికే పట్టాలు ఇస్తామని స్థానిక కాంగ్రెస్ నేతలు హుకుం జారీ చేశారు. దీంతో ఆ 40 కుటుంబాల వారు సామాను సర్దుకొని శాయంపేటకు వెళ్లారు. తీరా 40 మందిలో కేవలం 12 మందికే డబుల్బెడ్రూమ్ ఫ్లాట్లు కేటాయించారు. దీంతో మిగతా కుటుంబాలు తిరిగి వైఎస్ఆర్ నగర్‌కు వచ్చేశాయి.
బుల్డోజర్తో కూల్చివేతలు.. రౌడీమూకల దాడులు
40 కుటుంబాల వాళ్లు వెళ్లారు కాబట్టి, మిగతావాళ్లు కూడా ఖాళీ చేయాలంటూ ఓ కాంగ్రెస్ మాజీ కార్పొరేటర్ నాయకత్వంలోని ముఠా వైఎస్ఆర్నగర్ కాలనీవాసులపై కొన్నాళ్లుగా ఒత్తిడి చేయడం మొదలుపెట్టింది. తమకు ఇక్కడే ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తామని ప్రభుత్వం వాగ్దానం చేసిందని, కాబట్టి ఎక్కడికీ వెళ్లమని కాలనీవాసులు తెగేసి చెప్పారు. దీంతో మాజీ కార్పొరేటర్లు తమ అనుచరులతో వచ్చి కాలనీలో భయోత్పాతం సృష్టిస్తున్నారు.
ఇండ్లు ఖాళీ చేసి, స్థలాలు వదిలిపెట్టి వెళ్లకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరిస్తున్నారు. అయినా వారు బెదరలేదు. దీంతో వారం కిందట ఉన్నపళంగా కాలనీలో బుల్డోజర్లు ప్రత్యక్షమయ్యాయి. ఇండ్లను నేలమట్టం చేశాయి. వారించినవారిపై రౌడీమూకలు రెచ్చిపోయారు. మహిళలు, వృద్ధులు అని కూడా చూడకుండా భౌతికదాడులకు పాల్పడ్డారు. తమను బూతులు తిట్టారంటూ మహిళలు కన్నీటిపర్యంతమవుతున్నారు. ఆ మూకలతో తమకు ప్రాణభయం ఉన్నదని, తమను రక్షించాలని పోలీసులను వేడుకుంటే.. రక్షణగా నిలువకపోగా తమనే ‘తోలు తీస్తం’ అని బెదిరించారని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
జెండా పాతిన అన్నలు.. బస్‌స్టాండ్‌కు ప్రతిపాదనలు
12.37 ఎకరాల మిగులు భూమిలో ఒకప్పుడు పీపుల్స్‌వార్ నక్సలైట్లు జెండాలు పాతారని, ఆ భూమిని పేదలకు పంచాలని స్థానికంగా పోస్టర్లు వేశారని స్థానికులు చెప్తున్నారు. మరోవైపు 1992 ప్రాంతంలో ఆ భూమిలో బస్‌స్టాండ్ నిర్మించాలని మాజీ మంత్రి దాస్యం ప్రణయ్భాసర్ (ప్రభుత్వ మాజీ చీఫ్‌విప్ దాస్యం వినయభాస్కర్ సోదరుడు) నేతృత్వంలో స్థానిక ప్రజా సంఘాలతో అఖిలపక్షం ఏర్పాటైంది. ఆ స్థలంలో కాజీపేటలో బస్‌స్టాండ్ ఏర్పాటు చేయాలని పెద్ద ఎత్తున పోరాటాలు సాగాయి. దీంతో అప్పటి జిల్లా అధికారులు కాజీపేటలో బస్‌స్టాండ్ ఏర్పాటుకు ఆర్టీసీకి స్థలం కేటాయించారు. ఈ మేరకు ఆర్టీసీ యాజమాన్యం సరిహద్దు దిమ్మెలను ఏర్పాటు చేసింది.
అవి ఇప్పటికీ ఉన్నాయి. ఆ తర్వాత కాజీపేటకు చెందిన మాజీ కార్పొరేటర్ రావుల సదానందం 2005లో ఆ భూమిలో గుడిసెలు వేయించారు. ఆ కాలనీకి వైఎస్ఆర్నగర్గా పేరు పెట్టారు. ఈ విషయాన్ని పాదయాత్రగా వచ్చిన వైఎస్ రాజశేఖర్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లటంతో, వారికి పట్టాలు ఇవ్వాలని అధికారులను ఆదేశించడం గమనార్హం. మావోయిస్టు క్రాంతి రణదేవ్ ఎన్కౌంటర్లో మృతి చెందడంతో ఆయన పేరు మీద వైఎస్సార్‌నగర్ వాసులు స్తూపం నిర్మించారు. పోచమ్మ, మైసమ్మ ఆలయాలను నిర్మించుకొని దశాబ్దాలుగా పూజలు చేస్తున్నారు. ఇవన్నీ సాక్ష్యాలుగా ఉన్నా, కాంగ్రెస్ భూ కబ్జాదారుల బుల్డోజర్లు, కాలనీవాసుల కన్నీటి ప్రవాహాన్ని నిరోధించలేకపోయాయి.
ముంబైలో ‘బిగ్’మీట్?
రెండున్నర దశాబ్దాలుగా కాలనీవాసులను కన్నెత్తి చూడనివారు, పైగా ఇందిరమ్మ ఇండ్లు నిర్మిస్తామని వాగ్దానం చేసినవారు ఉన్నపళంగా ఇలా ఎలా మారారు? అసలేం జరిగింది? అని స్థానికులు ఆరా తీయటం మొదలుపెట్టారు. స్థానికులు, సామాజికవేత్తలు లోతుగా పరిశీలించగా భయానక విషయాలు వెలుగుచూసినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. హనుమకొండ జిల్లా కాజీపేట మండలం కడిపికొండ శివారులో సర్వే నంబర్లు 64, 70, 71, 72,73లో శాపూర్జీ ఇరానీ వారసులకు, ప్రభుత్వానికి మధ్య భూ వివాదం ఉన్నదనే విషయం ‘బిగ్’బ్రదర్స్ దృష్టికి వచ్చిందట. వెంటనే ‘ముఖ్యనేత’ కుటుంబ సభ్యులు రంగంలోకి దిగి వివరాలు సేకరించినట్టు తెలిసింది. ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే ద్వారా మహారాష్ట్రలోని ముంబైలో శాపూర్జీ ఇరానీ వారసులకు, బిగ్ టీమ్‌కు మధ్య డీల్ కుదిరిందని చెప్తున్నారు.
అనంతరం ‘ముఖ్యనేత’ కుటుంబసభ్యుడికి, ఓ మంత్రికి ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యేకు మధ్య ఒప్పందం కుదిరినట్టు ప్రచారం జరుగుతున్నది. తమ చేతులకు మట్టి అంటకుండా వైఎస్సార్నగర్ను ఖాళీ చేయించే బాధ్యతను వారికి అప్పగించినట్టు సమాచారం. అదే జరిగితే ఆ ఎమ్మెల్యే రాజకీయ అవసరాలు, ఆర్థిక అవసరాలు తీర్చడంతోపాటు భవిష్యత్తులో గ్రేటర్ వరంగల్ మేయర్ పదవి కూడా ఇప్పిస్తానని వాగ్దానం చేసినట్టు చెప్పుకొంటున్నారు. ఈ నేపథ్యంలోనే సదరు ఎమ్మెల్యే సామ, దాన, భేద, దండోపాయాలను వాడుతున్నట్టు తెలిసింది. ముందుగా శాయంపేటలో ఇండ్లు ఇప్పిస్తానని చెప్పారని, అది పనిచేయకపోవడంతో కొందరికి ఇండ్లు ఇచ్చి మభ్యపెట్టారని, అయినా కాలనీవాసులు ఒప్పుకోకపోవడంతో తన అనుచరులను ఉసిగొల్పి వైఎస్ఆర్నగర్లోని ఇండ్లపైకి బుల్డోజర్లు పంపి కాలనీవాసులకు నిలువ నీడలేకుండా చేశారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఎస్ఎస్ఎస్ కాంప్లెక్స్.. కాంగ్రెస్ ‘మార్క్’కు దర్పణం
కాంగ్రెస్ పాలనలో వరంగల్‌లో చిత్రవిచిత్రాలు జరుగుతున్నాయి. కాజీపేట పట్టణం నడిబొడ్డున ఉన్న ఎస్ఎస్ఎస్ కాంప్లెక్స్ ఇందుకు మరో ఉదాహరణ. బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో ఇది అసంపూర్తిగా బూత్‌బంగ్లాగా కనిపించింది. కానీ, ఈ మూడేండ్లలో కాంప్లెక్స్ అద్దాల మేడగా మారిపోయి కళకళలాడుతున్నది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కొంతమంది వ్యక్తులు ఒక పాత ఇల్లును కూలగొట్టిన స్థానంలో కొత్త ఇంటి కోసం మున్సిపాలిటీలో రెసిడెన్షియల్ పర్మిషన్ తీసుకున్నారు. కానీ నకిలీ పత్రాలతో సెల్లార్, నాలుగు అంతస్తులతో 2005లో కమర్షియల్ భవనంగా నిర్మించారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కొంతమంది స్థానికులు ఈ భవనంపై జిల్లా అధికారులకు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ భూమిలో అక్రమంగా ఈ భవనాన్ని నిర్మించారని పేర్కొన్నారు. దీంతో కలెక్టర్, మున్సిపల్ కార్పొరేషన్, కుడా ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఆ భవనం నిబంధనలకు విరుద్ధంగా ఉన్నదని, దాన్ని కూల్చివేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీచేశారు. దీంతో మున్సిపల్ అధికారులు ఆ కాంప్లెక్స్ నిర్మాణ పనులు నిలిపివేశారు. ఫలితంగా ఆ భవనం అసంపూర్తిగా మిగిలిపోయి బూత్‌బంగ్లాను తలపించింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితి పూర్తి భిన్నంగా మారింది. కూల్చివేత దశకు చేరుకున్న ఎస్ఎస్ఎస్ కాంప్లెక్స్‌కు రేవంత్సర్కార్ అన్ని రకాల అనుమతులు జారీ చేసింది. దీంతో పడావు పడ్డ కాంప్లెక్స్ కాస్తా అద్దాలమేడలా ముస్తాబైంది. రెండో అంతస్తు చుట్టూ షాపింగ్ మడిగెల నిర్మాణం, మూడు, నాలుగో అంతస్తులో ఓవైపు ఫంక్షన్ హాల్ రూపుదిద్దుకుంటున్నది. దశాబ్దంపాటు ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణంగా ఉన్న భవనం.. ఇప్పుడు ప్రైవేట్ భూమిగా ఎలా మారిందని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. అప్పుడు నిబంధనలను అతిక్రమిస్తే.. ఇప్పుడు ఎలా అనుమతులు వచ్చాయని, దీని వెనుక జరిగిన బాగోతం ఏమిటని ఆరా తీస్తున్నారు. ఈ కాంప్లెక్స్‌ను ఆనుకొనే వైఎస్ఆర్నగర్ ఉండటం గమనార్హం.
పక్షవాతంతో ఎక్కడికి పోవాలె?
2005లో కాంగ్రెస్ నాయకుల సహకారంతో గుడిసెలు వేసుకొని ఇక్కన్నే ఉంటున్నం. కరెంటు లేకున్నా.. దోమలు కుడుతున్నా.. తాగునీరు లేకున్నా అవస్థలు పడుతూ ఈడనే ఉంటున్నం. ఇప్పుడు కొంతమంది వచ్చి, గుడిసెలు ఖాళీ చేసిపోవాల్నని బెదిరిస్తున్నరు. నాకు ముగ్గురు ఆడపిల్లలు. నాకు పక్షవాతం వచ్చింది. బతుకుడే కష్టమైతాంది. ఇప్పుడు పక్షవాతంతో ఏడికి పోవాల్నో తెలుస్తలేదు. – ఎండీ ఖాదర్, వైఎస్ఆర్ నగర్, కాజీపేట
చచ్చినా ఖాళీ చెయ్యం
మేం 20 ఏండ్లుగా ఇక్కన్నే ఉంటున్నం. ఇప్పుడు ఏం జరిగిందో తెల్వదు. కొంతమంది ఎమ్మెల్యే మనుషులు, మాజీ కార్పొరేటర్, వారి గూండాలు, రౌడీ షీటర్లు వచ్చి మమ్మల్ని భయపెడుతున్నరు. ఎందుకని అడిగితే ‘ఈ స్థలం ఖాళీ చేసి వెళ్లిపోవాలి. లేదంటే చంపేస్తం’ అని బెదిరిస్తున్నరు. ఎప్పుడు ఏమైతదోనని పిల్లలు, ముసలోళ్లు, ప్రతిఒక్కరం భయంతో వణికిపోతున్నం. కాజీపేట సీఐ, ఏసీపీ, చివరికి సీపీ దగ్గరికి పోయినం. మా ఎమ్మెల్యే దగ్గరికి ఎన్నిసార్లు తిరిగినమో లెక్కేలేదు. అయినా మేమంటే వాళ్లకు పట్టింపు లేదు. మేం చచ్చినా సరే ఈ భూమిని వదిలిపెట్టం.
– నీరటి పావని, వైఎస్ఆర్నగర్, కాజీపేట
పోలీసులే తోలు తీస్తం అంటున్నరు
కాలనీని వెంటనే ఖాళీ చేసి వెళ్లకపోతే పోలీసులతో అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపిస్తమని భయపెడుతున్నరు. రౌడీషీటర్లు, వాళ్ల మనుషులు పగలూరాత్రి కాలనీలో గుంపులుగుంపులుగా తిరుగుతూ గుడిసెలను కూల్చివేస్తూ దౌర్జన్యం చేస్తున్నరు. అడ్డుకోబోతుంటే నోటికి వచ్చిన బూతులు తిడుతూ దాడి చేస్తున్నరు. పోలీసుల కండ్ల ముందే ఇదంతా జరుగుతున్నా వారిని వద్దని చెప్తలేరు. ఉల్టా మా మీదనే కేసులు పెడుతున్నరు. ఏమన్నా అంటే ‘తోలు తీస్తాం.. ఏమనుకుంటున్నరో’ అని పోలీసులే మమ్ములను బెదిరిస్తున్నారు.
-శనిగరం లక్ష్మి, వైఎస్ఆర్ నగర్, కాజీపేట
నా ఫ్లాట్ వేరేవాళ్లకు ఇచ్చిండ్రు
మీ గుడిసె కూలగొట్టుకొని వస్తే శాయంపేటలో కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తమని చెప్పిండ్రు. నా పేరుతో వచ్చిన ఇంటి ప్రొసీడింగ్‌ను హౌసింగ్ బోర్డు అధికారులు ఇచ్చిండ్రు. అది పట్టుకొని అక్కడికి పోతే, నాకు వచ్చిన ఫ్లాట్‌లో వేరేవాళ్లు ఉన్నరు. ‘ఇది నాది కదా.. నువ్వెట్ల ఉన్నవ్?’ అంటే ‘పైసలు ఇస్తే నాకు మాజీ కార్పొరేటర్ ఇచ్చిండు’ అని చెప్తుండ్రు. ఆఫీసర్‌ను అడిగితే ఏమైందో మీ కార్పొరేటర్‌ను అడుగు అంటున్నడు. ‘50 వేలు ఇస్తే నీకు కూడా ఇస్తా. అవి లేకపోతే..’ అని అసభ్యంగా మాట్లాడిండు. నన్నే కాదు ఇలా ఎవ్వరు అడిగినా బూతులు తిడుతున్నరు. ఆ తిట్లు వినేకన్నా చావడమే నయమనిపిస్తున్నది.
– పిట్టల మౌనిక, కాజీపేట
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

