Soups l చల్లని కాలం.. వెచ్చని నేస్తం!

చల్లని సాయంత్రం. అందులోనూ చలికాలం. వేడివేడిగా ఏదైనా తాగాలనిపించడం సహజం. ఆరోగ్యానికి హాని కలిగించే టీకాఫీలతో పోలిస్తే.. రకరకాల కూరగాయలు, ధాన్యాలతో చేసే సూప్స్ ఉత్తమమని అంటున్నారు పోషకాహార నిపుణులు. దీర్ఘకాలిక సమస్యలతో బాధపడేవారికి, బరువు తగ్గాలనుకునేవారికి, జలుబు, దగ్గు వంటి రుగ్మతలతో ఇబ్బందిపడుతున్నవారికి తిరుగులేని ఔషధం.. వేడివేడి సూప్. ఆరోగ్యంతోపాటు ఆహ్లాదాన్ని పంచే ఆ సూపులేంటో చూద్దాం.
కిడ్నీ బీన్స్ సూప్/ రాజ్మా సూప్

కావలసిన పదార్థాలు: రాజ్మా గింజలు(కిడ్నీ బీన్స్): ఒక కప్పు, టమాట: ఒకటి, ఉల్లిగడ్డ: ఒకటి, పచ్చిమిర్చి: నాలుగు, వెల్లుల్లి రెబ్బలు: నాలుగు, అల్లం: అంగుళం ముక్క, కారం: ఒక టీస్పూన్, మిరియాల పొడి: అర టీస్పూన్, ఉప్పు: తగినంత, నూనె: ఒక టేబుల్ స్పూన్.
తయారీ విధానం: రాజ్మా గింజలను బాగా కడిగి ఆరు గంటలపాటు నానబెట్టుకోవాలి. స్టవ్‌మీద కుక్కర్ పెట్టి నూనెవేసి వేడయ్యాక తరిగిన వెల్లుల్లి, అల్లం, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి వేసి వేయించాలి. అన్నీ బాగా వేగాక తరిగిన టమాట, నానబెట్టిన రాజ్మా వేసి రెండు నిమిషాలు మగ్గనిచ్చి మూడు కప్పుల నీళ్లుపోసి మూతపెట్టి మూడు విజిల్స్ వచ్చే వరకు సన్నటి మంటపై ఉడికించాలి. చల్లారిన మిశ్రమాన్ని మిక్సీలో వేసి మెత్తగా రుబ్బుకోవాలి. స్టవ్‌మీద కడాయి పెట్టి రాజ్మా మిశ్రమం వేసి రెండు కప్పుల నీళ్లు, ఉప్పు, మిరియాల పొడి, కారం వేసి అయిదు నిమిషాలు బాగా మరిగిస్తే రాజ్మా సూప్ సిద్ధం.
టమాట జింజర్ సూప్

కావలసిన పదార్థాలు: టమాట: రెండు, అల్లం: రెండంగుళాల ముక్క, మిరియాల పొడి: అర టీస్పూన్, ఉప్పు: తగినంత, వెన్న: ఒక టేబుల్ స్పూన్, ఫ్రెష్ క్రీం: ఒక టేబుల్ స్పూన్, బిర్యానీ ఆకు: ఒకటి.
తయారీ విధానం: స్టవ్‌మీద పాన్ పెట్టి ఒక టీస్పూన్ వెన్న వేయాలి. వేడయ్యాక తరిగిన టమాట, అల్లం వేసి మూతపెట్టి సన్నని మంటపై ఐదు నిమిషాలు మగ్గించి దించేయాలి. టమాట ముక్కలు చల్లారాక మిక్సీలో వేసి మెత్తగా రుబ్బుకోవాలి. ఇప్పుడు స్టవ్‌మీద మరో పాన్ పెట్టి వెన్న వేయాలి. వేడయ్యాక బిర్యానీ ఆకు, టమాట మిశ్రమం, మిరియాల పొడి, ఉప్పు వేసి అర కప్పు నీళ్లు పోసి మరిగించాలి. చివరిగా ఫ్రెష్ క్రీం వేసి దించుకుంటే వేడివేడి టమాట జింజర్ సూప్ రెడీ.
కార్న్ వెజ్ సూప్

కావలసిన పదార్థాలు: క్యారెట్: ఒకటి, బీన్స్: నాలుగు, పచ్చిమిర్చి: రెండు, స్వీట్ కార్న్: అర కప్పు, మిరియాల పొడి: అర టీస్పూన్, ఉప్పు: తగినంత, కార్న్‌ఫ్లోర్: ఒక టీ స్పూన్, కొత్తిమీర తురుము: కొద్దిగా, ఆలివ్ ఆయిల్: ఒక టేబుల్ స్పూన్.
తయారీ విధానం: ముందుగా తరిగిన క్యారెట్, బీన్స్, స్వీట్‌కార్న్ అయిదు నిమిషాలపాటు ఉడికించి నీళ్లు వంపి పక్కన పెట్టాలి. స్టవ్‌మీద పాన్‌పెట్టి నూనె వేయాలి. వేడయ్యాక తరిగిన పచ్చిమిర్చి, ఉడికించిన క్యారెట్, బీన్స్, స్వీట్‌కార్న్ వేసి రెండు నిమిషాలపాటు వేయించాలి. మిరియాల పొడి, ఉప్పు వేసి క్యారెట్ ఉడికించిన నీళ్లు పోసి మరో అయిదు నిమిషాలు మరగనివ్వాలి. పావుకప్పు నీళ్లలో కార్న్‌ఫ్లోర్ వేసి బాగా కలిపి మరుగుతున్న మిశ్రమంలో వేసి మరో రెండు నిమిషాలు ఉడికించాలి. చివరగా తరిగిన కొత్తిమీర చల్లుకుంటే వేడివేడి కార్న్ వెజ్ సూప్ రెడీ.
రాగి వెజ్ సూప్

కావలసిన పదార్థాలు: రాగి పిండి: రెండు టేబుల్ స్పూన్లు, క్యారెట్: ఒకటి, బీన్స్: నాలుగు, పచ్చిబఠాణీ: పావు కప్పు, ఉల్లిపాయ: ఒకటి(చిన్నది), పచ్చిమిర్చి: రెండు, వెల్లుల్లి రెబ్బలు: రెండు, అల్లం: చిన్న ముక్క, ఉప్పు: తగినంత, జీలకర్ర: అర టీస్పూన్, మిరియాలపొడి: పావు టీస్పూన్, నూనె: రెండు టేబుల్ స్పూన్లు, కొత్తిమీర: కొద్దిగా.
తయారీ విధానం: ముందుగా క్యారెట్, బీన్స్, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లిని వీలైనంత చిన్నగా తరిగి పెట్టుకోవాలి. స్టవ్‌మీద పాన్ పెట్టి నూనె వేడయ్యాక జీలకర్ర వేయాలి. వేగాక తరిగిన ముక్కలన్నింటితోపాటు పచ్చిబఠాణీలు కూడా వేసి వేయించాలి. అన్నీ బాగా వేగాక తగినంత ఉప్పు, మిరియాల పొడి వేసి రెండు కప్పుల నీళ్ళు పోసి పదినిమిషాలపాటు మూత పెట్టి ఉడికించాలి. అన్ని ముక్కలూ బాగా ఉడికిన తర్వాత రాగిపిండిని ఒక కప్పు నీళ్ళలో ఉండలు లేకుండా కలిపి మరుగుతున్న మిశ్రమంలో పోయాలి. మరో పదినిమిషాలపాటు సన్నని మంటపై మరిగించి, చివరగా కొత్తిమీర చల్లుకుంటే వేడివేడి రాగి వెజ్ సూప్ రెడీ.
పాలకూర సూప్

కావలసిన పదార్థాలు: పాలకూర: రెండు కప్పులు, మైదా: ఒక టేబుల్ స్పూన్, పాలు: రెండు కప్పులు, వెన్న: రెండు టేబుల్ స్పూన్లు, ఉల్లిగడ్డ: ఒకటి, పచ్చిమిర్చి: నాలుగు, మిరియాల పొడి: అర టీస్పూన్, ఉప్పు: తగినంత.
తయారీ విధానం: స్టవ్‌మీద పాన్ పెట్టి ఒక టేబుల్ స్పూన్ వెన్న వేసి, వేడయ్యాక మైదావేసి ఒక నిమిషంపాటు వేయించి, పాలుపోసి దగ్గర పడేవరకు ఉడికించాలి. మిరియాల పొడి, తగినంత ఉప్పు వేసి దింపేయాలి. స్టవ్‌మీద మరో పాన్ పెట్టి బటర్ వేసి వేడయ్యాక తరిగిన ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, పాలకూర, తగినంత ఉప్పు వేసి అయిదు నిమిషాల పాటు వేయించి రెండు కప్పుల నీళ్లు పోసి బాగా ఉడికించాలి. ఈ మిశ్రమం చల్లారాక మిక్సీలో మెత్తగా రుబ్బుకోవాలి. స్టవ్‌మీద పాన్ పెట్టి పాలకూర మిశ్రమం వేసి అర కప్పు నీళ్లు పోసి ఒక నిమిషంపాటు ఉడికాక మైదా మిశ్రమం వేసి కలుపుతూ రెండు నిమిషాలు ఉడికిస్తే పాలకూర సూప్ సిద్ధం.
గుమ్మడి సూప్

కావలసిన పదార్థాలు : తీపి గుమ్మడి ముక్కలు: అరకప్పు, కూరగాయలు ఉడికించిన నీళ్లు: ఐదు కప్పులు, వెన్న: పావుకప్పు, బాదంముద్ద: ఒక చెంచా, ఉప్పు: తగినంత, మిరియాలపొడి: పావు టీస్పూన్, నూనె: రెండు టీస్పూన్లు, సోంపు పొడి: రెండు టీస్పూన్లు, ఉల్లిపాయ: ఒకటి (చిన్నది), పుదీనా తరుగు: కొద్దిగా.
తయారీ విధానం: ముందుగా స్టవ్‌మీద కడాయి పెట్టి నూనె వేడయ్యాక సోంపు పొడి, పుదీనా తరుగు వేయాలి. పుదీనా వేగాక ఉల్లిపాయ, గుమ్మడి ముక్కలు, తగినంత ఉప్పు, మిరియాల పొడి వేయాలి. అన్నీ వేగాక కూరగాయ ముక్కలు ఉడికించిన నీళ్లు పోసి బాగా ఉడికించాలి. నీళ్లు సగం అయ్యేంతవరకు ఉడికాక.. దింపి చల్లార్చి ముక్కలతోసహా నీళ్లను మిక్సీ జారులోకి తీసుకొని మెత్తని గుజ్జులా చేసుకోవాలి. ఈ గుజ్జుకు బాదం ముద్ద, వెన్న కలిపి మళ్ళీ ఐదు నిమిషాలపాటు స్టవ్ మీదపెట్టి చిక్కగా అయ్యేంతవరకు కలుపుతూ మరిగించాలి. చిక్కబడ్డ గుమ్మడి సూప్‌ను బౌల్లోకి తీసుకుని.. పైనుంచి కాస్త వెన్న వేసుకుని సర్వ్ చేసుకోవాలి.
మునగాకు సూప్

కావలసిన పదార్థాలు: మునగాకు: రెండు కప్పులు, క్యారెట్ తురుము: అర కప్పు, కొబ్బరి తురుము: అర కప్పు, ఉల్లి తరుగు: అర కప్పు, అల్లం, వెల్లుల్లి పేస్ట్: ఒక స్పూన్, కొత్తిమీర తరుగు: పావు కప్పు, ఉప్పు: తగినంత, మిరియాల పొడి: ఒక టేబుల్ స్పూన్, జీలకర్ర: ఒక టేబుల్ స్పూన్, నూనె: రెండు టీ స్పూన్లు, ఇంగువ: చిటికెడు, నెయ్యి: ఒక టేబుల్ స్పూన్.
తయారీ విధానం: ముందుగా ఒక గిన్నెలో ఉల్లి తరుగు, క్యారెట్ తురుము, కొబ్బరి తురుము, అల్లం, ఉప్పు, వెల్లుల్లి పేస్ట్ వేసి ఐదు కప్పుల నీళ్ళుపోసి కాసేపు ఉడికించాలి. ఇప్పుడు స్టవ్‌మీద కడాయి పెట్టి నెయ్యి వేసి.. వేడయ్యాక జీలకర్ర, మునగాకు వేసి దోరగా వేయించి ఉడుకుతున్న క్యారెట్, కొబ్బరి తురుము మిశ్రమంలో వెయ్యాలి. మిశ్రమం బాగా ఉడికాక చల్లార్చుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు సూప్‌ను బౌల్లోకి తీసుకుని పైనుంచి కొత్తిమీర, మిరియాల పొడి చల్లి సర్వ్ చేసుకుంటే చాలు. మునగాకు సూప్ రెడీ.
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘సర్వభ్రష్ట ప్రభుత్వాన్ని మార్చేందుకు ప్రజలు సన్నద్ధం’
Srinidhi Shetty | బ్లాస్ట్ సినిమాతో ఎలాంటి కనెక్షన్ లేదు.. ‘ఆదర్శకుటుంబం’ హీరోయిన్ శ్రీనిధి శెట్టి
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
ఇరవెండి పంచాయతీ నిర్వహణపై డీపీవో అనూష ప్రశంస
Former Minister Talasani | ఓటరు నమోదు ముమ్మాటికీ ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలోనే జరగాలి : మాజీ మంత్రి జరగాలని తలసాని
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

