మ్యూజియంలో అనేక రకాల అరుదైన వస్తువులెన్నో ప్రదర్శనకు ఉంటాయని తెలిసిందే. అలాంటి మ్యూజియాలకు భిన్నంగా బైక్‌ల కోసమే ఏర్పాటైన సందర్శనాలయం ఒకటి ఉంది. ఇండియన్ రోడ్లపై అడుగుపెట్టిన వందలాది పాతకాలపు ద్విచక్ర వాహనాలు ఇక్కడ దర్జాగా కొలువుదీరాయి.
అదే మహారాష్ట్రలోని మహేబలేశ్వర్ సమీపంలో ఉన్న ‘వింటేజ్ మైల్స్’. ఈ మ్యూజియం చూశారంటే మన దేశ టూ వీలర్ స్టోరీ అంత తెలిసిపోతుంది. దాదాపు 500 ద్విచక్ర వాహనాలు కొలువుదీరిన ఈ మ్యూజియం నెలకొల్పడం వెనుకున్న స్టోరీ ఏంటో చూద్దాం!
– వింటేజ్ బైక్స్
ఓ మూడున్నర దశాబ్దాల కిందటి మాట. మహారాష్ట్రకు చెందిన వినిత్ ప్రభాకర్ కెంజాలె తన స్నేహితుడితో కలిసి రోడ్డు పక్కన వెళ్తున్నాడు. ఆ సందర్భంలో ఓ బైక్ ఆయన కంటపడింది. లోపల ఉన్న యంత్ర భాగాలు కనిపిస్తూ ఉన్న ఆ బైక్‌ని చూడగానే బైక్ నగ్నంగా ఉన్న ఆలోచన కలిగింది వినిత్కి. అంతే .. పకపకా నవ్వుతూ మనసులో మెదిలిన ఆలోచనను స్నేహితుడితో పంచుకున్నాడు. ఆ క్షణం తన జీవితాన్నే మలుపు తిప్పుతుందని వినిత్ ఎప్పుడూ అనుకోలేదు. ఆ మాటలు విన్న ఓ వ్యక్తి వచ్చి ‘ఎందుకు నవ్వుతున్నావ్? ఇందులో నవ్వు తెప్పించేంత తప్పేముంది?’ అని ప్రశ్నించాడు. ఆ అడిగింది ఎవరో కాదు, ఆ బైక్ యజమానే. వినిత్కి అప్పుడేం చెప్పాలో పాలుపోలేదు. వింటేజ్ బైక్ ప్రత్యేకత, ప్రాధాన్యం, ఆ ప్రయాణ అనుభూతి గురించి తనకున్న అభిమానాన్ని ఆ వ్యక్తి ద్వారా విన్న వినిత్ ఆలోచనల్లో ఊహించని మార్పు కలిగింది. వింటేజ్ బైక్‌ల పట్ల అమాంతం ఆసక్తి ఏర్పడింది. అప్పటి నుంచి రోడ్డెక్కినప్పుడల్లా ప్రత్యేకమైన వాహనాలను గమనిస్తూ ఉండేవాడు. అవకాశం ఉన్న ప్రతిసారీ వాటిని సేకరించడమే పనిగా పెట్టుకున్నాడు. వాటిపై విపరీతమైన ప్రేమను పెంచుకున్నాడు. వింటేజ్ బైక్‌ల మీద ఆయకు ఏర్పడిన అభిమానానికి తార్కాణమే ఈ ‘వింటేజ్ మైల్స్’.
స్వతంత్య్రం వచ్చిన తొమ్మిదేళ్లకు స్వదేశీ కంపెనీలు ద్విచక్ర వాహనాలు తయారు చేసుకునేందుకు భారత ప్రభుత్వం అనుమతిచ్చింది. అలా 1959లో తొలి స్వదేశీ ద్విచక్ర వాహనం ‘యజ్డీ’ రోడ్డెక్కింది. జావా కంపెనీ మార్గదర్శనంలో అనేక కంపెనీలు అదే దారిలో జర్నీకి ప్రయత్నాలు చేశాయి. కొన్ని విజయవంతం అయ్యాయి. అలా ప్రయోగాలతో భారతీయుల ప్రయాణ వేగం ఊపందుకుంది. అరవయ్యో దశకంలో లాంబ్రెట్టా స్కూటర్ భారతీయుల హృదయాలను గెలుచుకుంది. ఏడాదికే బజాజ్ ఆటో రంగంలోకి దిగింది. ‘హమారా బజాజ్’ అంటూ బులంద్ భారత్ కీ బులంద్ తస్వీర్గా మారింది. ఇక ఆ ప్రయాణం ద్విచక్ర వాహన రంగంలో విప్లవం సృష్టించింది. ఆనాటి ద్విచక్ర వాహనాలు సంపన్నుల ప్రయాణమే. ఆ తర్వాత కాలాల్లో వాహనాల తయారీలో ఎన్నో మార్పులు, చేర్పులు జరుగుతూ ఉత్పత్తి వ్యయం తగ్గింది. ద్విచక్ర వాహనాలు సామాన్యులకూ అందుబాటులోకి వచ్చాయి. ద్విచక్ర వాహనం ఎప్పుడైతే మధ్య తరగతికి చేరువైందో అప్పుడు ఆటోమొబైల్ ఇండస్ట్రీ మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లింది. మార్కెట్లో పోటీ పెరిగింది. యువతను ఆకట్టుకునేందుకు యాక్సెలరేషన్ స్పీడందుకుని స్పోర్ట్స్ మోడ్‌లోకి అడుగుపెట్టింది.
ఆరు దశాబ్దాల కాలంలో మైలేజ్ లెక్కలేసుకుని ఎన్నో మోడల్స్ మార్కెట్‌ని ముంచెత్తాయి. సామాన్యులకు అందుబాటులోకి తెచ్చి వాహన రంగాన్ని సుసంపన్నం చేసిన ఘనత సుజుకీ, హీరో హోండా, హోండా, యమహా, టీవీఎస్ కంపెనీలకూ దక్కుతుంది. పోటీ మార్కెట్లో మన్నికైనవి నిలదొక్కుకుని కొత్త సాంకేతికతను అందుకుంటూ ఇప్పటికీ మన రోడ్లపై తిరుగుతూనే ఉన్నాయి. అయితే ఈ మాడల్స్ మైలేజ్, స్పీడ్, ప్రయాణికుల సౌకర్యం, భద్రత కోసం రూపాలను మార్చుకుంటూ పరిణామం చెందాయి.
నేడు వాడుతున్న వాహనాలకు పూర్వ రూపాలైన మోడల్స్ తెరమరుగై కొత్త రూపు దిద్దుకున్నాయి. హై స్పీడ్‌లో రయ్ మంటూ దూసుకుపోతున్న బైక్‌లకు ప్రాణం పోసిన ఆ పాతకాలపు మాడళ్లు రోడ్డెక్కకపోయినా కనుమరుగు కాకూడదన్నది వినిత్ కోరిక. ఎవరింట్లో వాళ్లు అభిమానంతో దాచుకున్న వింటేజ్ వాహనాలను అందరికీ చేరువ చేయడం కోసం ఆయన అనేక కష్టాలుపడ్డాడు. భారత దేశ రహదారులపై 1940 నుంచి 2017 వరకు పరుగులు తీసిన ద్విచక్ర వాహనాలన్నిటినీ వినిత్ సేకరించాడు. విశాలమైన మూడు షెడ్లలో ‘వింటేజ్ మైల్స్’ పేరుతో ద్విచక్ర వాహన ప్రదర్శనశాలను ఏర్పాటు చేసి, అనుకున్న మైలురాయిని చేరుకున్నాడు. అత్యధిక బ్రాండ్ల ద్విచక్ర వాహనాలు ఉన్న మ్యూజియంగా వింటేజ్ మైల్స్ లిమ్కా
బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ సాధించింది. వినిత్ మూడున్నర దశాబ్దాల కృషి ఫలించింది.
వింటేజ్ మైల్స్ మ్యూజియంలో కొలువ దీర్చిన వందలాది వాహనాలు చూస్తూ ముందుకు నడుస్తుంటే ఓ వింత అనుభూతి కలుగుతుంది. యాక్సెలరేటర్ బైక్‌ని ముందుకు పరుగెత్తించినట్టే ఆకట్టుకునే పాత బైక్‌లు ఆలోచల్ని గతంలోకి నడిపిస్తాయి. భారతీయ ద్విచక్ర వాహనాల పరిశ్రమ పరిణామ కథను వినిత్ ఏర్పాటు చేసిన వింటేజ్ మైల్స్ మ్యూజియం కళ్లకు కడుతుంది. బైక్‌లంటే ఇష్టం ఉండేవాళ్లకు ఈ మ్యూజియం సందర్శన ఓ అద్భుత ప్రయాణం! ఆటోమొబైల్ రంగంలోని ఒడుదొడుకుల ప్రయాణంలో ద్విచక్ర వాహన విజయ ప్రస్థానం గురించి సమగ్రంగా తెలుసుకునేలా డాక్యుమెంట్లు, ఫొటోలు, పత్రికా వార్తలు, ప్రకటనలు సేకరించి ఇక్కడ ప్రదర్శిస్తుంటారు. ‘బైక్ అంటే ప్రయాణమే కాదు నా ప్రాణం’ అనుకునే బైక్ లవర్స్ చూడాల్సిన, తెలుసుకోవాల్సిన మ్యూజియం ఇది!