తెలంగాణ పల్లెలు వెండితెరమీద వెలుగులు జిమ్ముతున్నాయి. సినిమాలను నిర్మించేందుకు పైసలన్ని ధారపోసి భారీ సెట్లను వేయాల్సిన పనిలేకుండానే మనం పుట్టిపెరిగిన గ్రామాల్లోనే క్లాప్స్ కొడుతున్నారు ఈ ప్రాంతపు డైరెక్టర్లు. మన పల్లెల మట్టివాసనను ఇప్పటికే రుచిచూయించిన బలగం లాంటి సినిమాను చూసి ఎంతో మురిసిపోయినం. వెండితెరపై వెలుగులు పూయిస్తున్న ‘పళ్లబురుసు’ తెలంగాణ మట్టివాసన చూపింది. సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని లచ్చపేట ‘పళ్లబురుసు’కు లొకేషన్ అయింది. గ్రామస్తుల ప్రేమంతా మూటగట్టుకొని తెరకెక్కింది ఈ చిత్రం. సినిమా ట్రైలర్ లాంచింగ్‌కి లచ్చపేట వేదికైంది. తెలంగాణ నేపథ్యంలో తెరకెక్కిన ‘పళ్లబురుసు’ సినిమా షూటింగ్‌కు ఆతిథ్యమిచ్చిన లచ్చపేటకు రుణపడి ఉంటానంటున్నాడు ఆ చిత్ర దర్శకుడు ఉదయ్ చౌహాన్. ఆ ఊరి సంగతులు, అక్కడి షూటింగ్ ముచ్చట్లు ‘బతుకమ్మ’తో ఇలా పంచుకున్నాడు..
మాది మహబూబ్‌నగర్ జిల్లాలోని రాజ్‌నాయక్ తండా. చిన్నప్పటినుంచి సినిమాలు చూస్తూ పెరగడం వల్ల డైరెక్టర్ కావాలనే కోరిక బలంగా నాటుకుంది. ఇంట్లో అమ్మానాన్నలిద్దరూ ప్రభుత్వోద్యుగులే! నా ఆలోచనలు మాత్రం సినిమాల చూట్టూ తిరుగుతుండేవి. వెండితెర మీదున్న ఇష్టంతో పూణెలో స్క్రీన్‌ప్లే, డైరెక్షన్ కోర్సులు చేశాను. కొన్నాళ్లు ముంబైలో యాడ్ ఫిల్మ్‌లు తీశాను. ఆ తరువాత హైదరాబాద్‌కు వచ్చి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా యాడ్స్ చేయడం ప్రారంభించాను. ఈ సమయంలోనే చిన్నప్పటి కలను సాకారం చేసుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టాను. 2018లో ‘సీజన్ ఆఫ్ ఇన్నోసెన్స్’ పేరుతో తీసిన ఇండిపెండెంట్ సినిమా అహ్మదాబాద్ చిల్డ్రన్ ఫెస్టివల్‌కు ఎంపికైంది. 2021లో ‘పళ్లబురుసు’ కథ రాయడం ప్రారంభించాను. ఈ కథలో బలముందనే విశ్వాసంతో పెద్ద బ్యానర్ కింద ప్రజెంట్ చేస్తేనే ఎక్కువమందికి చేరుతుందని భావించి, అలాంటి అవకాశాల కోసం ఎదురుచూశాను. అలా 2024లో అన్నపూర్ణ స్టూడియోకి వెళ్లి నాగర్జున గారికి కథ చెప్పాను. ఆయన వెంటనే కథ నచ్చిందని చెప్పడంతో అందులో చిన్నచిన్న మార్పులు చేసుకొని 2025 నవంబర్‌లో ‘పళ్లబురుసు’ ప్రారంభించాం.
మొదటిసారి వెండితెరకు పరిచయమవుతున్నా. నా సినిమా నేపథ్యం పల్లెటూరు. అచ్చమైన పల్లెను ప్రతిబింబించే లొకేషన్లను అప్పటికే నా మదిలో డ్రాయింగ్ వేసి పెట్టుకున్నాను. గతేడాది జూలైలో లొకేషన్ల కోసం అన్వేషణ మొదలుపెట్టాం. సంగారెడ్డి, బాన్సువాడ, సిద్దిపేట చుట్టుపక్కల గ్రామాలన్నీ తిరిగాం. ఫైనల్‌గా దుబ్బాక మున్సిపాలిటీలోని లచ్చపేట నా సినిమాకు సరిగ్గా సరిపోతుంది అనిపించింది. ‘గ్రామం నడిబొడ్డున పెద్ద చెట్టు.. ఆ చెట్టు చుట్టూ గద్దె.. ఆ గద్దె మీద కూర్చొని పెద్ద మనుషుల ముచ్చట్లు’ ఇదీ నేను అనుకున్న సీన్. సరిగ్గా అలాంటి సీనే లచ్చపేటలో కనిపించింది. మిగతా సీన్లకు కూడా కావాల్సినన్ని లొకేషన్లు ఆ గ్రామంలోనే ఉన్నాయనిపించింది. ఆ ఊళ్లో ఇండ్లన్నీ విభిన్నంగా ఉంటాయి. ఒక్కో ఇంటిదీ ఒక్కో ప్రత్యేకత. కోట్ల రూపాయలు వెచ్చించి సెట్లు వేసినా వాటికి సరితూగవు. అవన్నీ చూడగానే.. నా సినిమా పూర్తయిపోయిందన్న భావన కలిగింది. దీంతో లచ్చపేటనే మా షూటింగ్ స్పాట్‌గా ఫైనల్ చేశాం. ఆ తరువాత చిన్న చిన్న సీన్ల కోసం పక్కనున్న పెద్దగుండవెళ్లి, చౌదర్పల్లి, బాన్సువాడ ప్రాంతాలను ఎంచుకున్నాం. సరిగ్గా 2025 నవంబర్ నెలలో షూటింగ్ ప్రారంభించాం. మొత్తం 42 రోజులు షూటింగ్ చేస్తే అందులో 20 రోజులు లచ్చపేటలోనే పూర్తి చేశాం. ఊళ్లో షూటింగ్ అంటే.. ఓ రెండు రోజులు ఉండి వెళ్లిపోతారేమో అనుకున్నారు లచ్చపేటవాసులు. కానీ, మేము ఇన్ని రోజులు అక్కడే ఉంటామని తెలిసి ఆశ్చర్యపోయారు. తమ గ్రామంలో షూటింగ్ జరుగుతున్నదని ఎంతో సంతోషించారు.

షూటింగ్ కోసం గ్రామస్తులు సహకరిస్తారో, లేదోనని నాలో చిన్న అనుమానం ఉండేది. కానీ, షూటింగ్ మొదటిరోజే నా ఆలోచన తప్పని వాళ్లు నిరూపించారు. మేము ఉదయం ఆరు గంటల వరకు లొకేషన్‌కు చేరుకునేవాళ్లం. మాకోసం వాళ్లంతా ఉదయాన్నే లేచి టీ, టిఫిన్లు సిద్ధం చేసేవాళ్లు. మధ్యాహ్నం తినడానికి తమ ఇండ్లకు తీసుకెళ్లి రుచికరమైన భోజనం పెట్టేవాళ్లు. అప్పాలు చేసి ఇచ్చేవాళ్లు. ఒకరిద్దరికి మాత్రమే కాకుండా మా టీం మొత్తాన్ని తీసుకెళ్లి తిండిపెట్టేవాళ్లు. షూటింగ్ కోసం ఫలనా ఇల్లు కావాలని అడిగితే క్షణాల్లో సిద్ధం చేసి ఇచ్చేవాళ్లు. కరెంట్ పోతే ఫోన్ చేసి నిమిషాల్లోనే సమస్యను పరిష్కరించేవాళ్లు. ఆ చెట్టు చుట్టూ కావాల్సిన దుకాణాలు ఏర్పాటు చేసుకొని షూట్ చేసుకునేందుకు వాళ్ల సామాను తీసుకొచ్చి ఇచ్చేవాళ్లు. ఈ సినిమాలో ఆ ఊరు, వాళ్ల ఇండ్లు, దుకాణాలు మాత్రమే కాకుండా లచ్చపేటవాసులు కూడా కనిపిస్తారు. కొన్ని డైలాగులూ చెప్పారు. షూటింగ్ జరిగినన్ని రోజులు నా సొంతూరిలో ఉన్న భావనే కలిగింది. ఆ ఊరిని, అక్కడి జనాలను విడిచిపెట్టి రావడం చాలా కష్టం అనిపించింది. నా మొదటి సినిమాతో ముడిపడిన ఆ ఊరు నాకు మరో జన్మస్థలం. ఇప్పటికీ అక్కడి నుంచి ఎవరో ఒకరు ఫోన్ చేస్తూనే ఉంటారు. మళ్లీ ఎప్పుడొస్తారని అడుగుతుంటారు. లచ్చపేట సినిమాను మాత్రమే ఇవ్వలేదు. కొన్ని బంధాలను ఇచ్చింది. అందుకే వాళ్లందరి ఆనందం కోసం ఆ ఊర్లోనే ట్రైలర్ విడుదల చేద్దామని నాగార్జున గారితో చెప్పాను. ఆయన ఒప్పుకోవడమే కాకుండా మా టీం తరుఫున ఆ గ్రామస్తుల ప్రేమకు ధన్యవాదాలు చెప్పారు. ట్రైలర్ చూసి కొంతమంది ఫోన్ చేసి చాలా సంతోషపడ్డారు. వాళ్లిచ్చిన ఆ ప్రేమ ముందు నేను చేసింది చాలా చిన్నదే కదా. లచ్చపేటను మదిలో నిలుపుకొంటూనే మరిన్ని కథలతో ఇలాంటి లచ్చపేటలను పరిచయం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాను.
షూటింగ్ మొదలైన రోజునుంచీ ఊరి వాతావరణమే మారిపోయింది. ప్రతిరోజూ ఓ పండుగగా సాగిపోయింది. వాళ్లు మా వస్తువులు ఉపయోగించుకుని కొంత పారితోషికం కూడా ఇచ్చారు. మా ఊరోళ్లకు పరోక్షంగా పని కూడా లభించింది. నేనొక ఈవెంట్ మెనెజర్ని. ఈ సినిమాలో పెళ్లి సీన్ సెటప్ మొత్తం నేనే వేశాను. ట్రైలర్ లాంచ్ చేసిన రోజు మా ఊరి వాళ్లకే ఆ సెటప్ అంతా అప్పగించాం. మా ఊరిలో షూటింగ్‌ను పక్కూర్లనుంచి వచ్చి చూసేవారు. ఈ షూటింగ్ వల్ల నాకు ఉదయాన్నే లేవడం అలవాటైంది. షూటింగ్ పూర్తిచేసి వెళ్లిపోతున్న సమయంలో చాలామందిమి బాధపడ్డాం. పల్లబురుసు సినిమా షూటింగ్ మాకొక అద్భుతమనే చెప్పాలి.
– అర్జున్, లచ్చపేట
– రాజు పిల్లనగోయిన