ఇరవై నాలుగేండ్లకే ప్రపంచ పర్యటన. అలా అని పెద్ద ధనవంతుడూ కాదు. సాధారణ మధ్యతరగతి కుటుంబం. చిన్నప్పటి నుంచీ స్వతంత్ర భావాలు ఎక్కువ. ఒకరిపై ఆధారపడకుండానే చదువుకున్నాడు. సొంతంగా డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీని ఏర్పాటు చేసుకున్నాడు. ఆన్లైన్ పనులు చక్కదిద్దుతూనే 18 దేశాలు తిరిగాడు. మళ్లీ ఇండియాకు వస్తే.. హిందువుగానే తిరిగి వెళ్తానని అంటున్నాడు మెక్సికోకు చెందిన డానియెల్ ఎంఎక్స్.
నేను ఇండియాతో ప్రేమలో పడిపోయాను. దుబాయ్‌లో డబ్బు సంపాదనలో సంతోషాన్ని చూస్తున్నారు. స్పెయిన్‌లో పార్టీల్లో ఆనందాన్ని వెతుక్కుంటున్నారు. ఒక్క ఇండియాలో మాత్రం కుటుంబంలోనే సంతోషాన్ని పొందుతున్నారు. రియల్లీ ఐ లవ్ ఇండియా. నాపేరు డానియెల్. మెక్సికోలోని హెలెస్కో సిటీ. మాది మధ్యతరగతి కుటుంబం. ముగ్గురు పిల్లల్లో చిన్నవాణ్ని. మెక్సికో మినహా.. ఇతర దేశాల్లో సంస్కృతి, సంప్రదాయాలు, ఆహారపు అలవాట్లు, జీవన విధానం, ఆలోచనలు తెలుసుకోవాలనే కుతూహలం కలిగింది. వ్యాపారాన్ని చూసుకుంటూనే మెక్సికో సహా 18 దేశాలు తిరిగాను. ఇంకా తిరగాల్సిన దేశాలు ఐదు దాకా ఉన్నాయి. వాటిని ఆరు నెలల్లో పూర్తిచేస్తాను. విదేశాలకు వెళ్లినప్పుడు ఎయిర్‌బీఎన్‌బీ
(ఏబీఎన్బీ యాప్) నుంచి లోకల్ హోస్ట్లను ఎంచుకుంటాను. అక్కడే వారం పదిరోజులు ఉంటాను. చుట్టుపక్కల ప్రదేశాలన్నీ తిరుగుతాను.
మెక్సికో విడిచిపెట్టక ముందు నేను వేరు… 18 దేశాలు తిరిగిన తర్వాత నాలో వచ్చిన మార్పులు వేరు. ఈ జర్నీలో నా లైఫ్ స్టైల్ మారిపోయింది. నేను ఏ పనైనా చేయడానికి ఒక్క క్షణం కూడా ఆలోచించను. పూర్తి చేసేవరకూ నిద్ర కూడా పట్టదు. డిజిటల్ మార్కెటింగ్ ఫీల్డ్‌లో ఉద్యోగం చేస్తున్నప్పుడే నాకు విదేశాలు చుట్టేసి రావాలనే కోరిక పుట్టింది. ఇంట్లో డబ్బు అడిగే పరిస్థితి లేదు. చిన్నప్పటి నుంచి స్వతంత్రంగానే బతుకుతున్నాను. నా డబ్బులు నేను సంపాదించుకోగలను. ఇతరులపై ఆధారపడటం నాకు ఇష్టం లేదు. లూనా మార్కెటింగ్ ఎంఎక్స్ పేరిట ఓ మార్కెటింగ్ ఏజెన్సీ ఏర్పాటు చేసి, దాని ద్వారా వచ్చిన లాభాలతోనే విదేశాలు తిరుగుతున్నాను. నాకు మెక్సికో, అమెరికా, దుబాయ్‌లలో క్లయింట్స్ ఉన్నారు. ఓ ఇద్దరికి ఉద్యోగం కూడా ఇచ్చాను. నా ప్రపంచ పర్యటనకు ముఖ్య కారణాల్లో ‘డిజిటల్ మార్కెటింగ్’ కూడా ఒకటి. ఒక్కో ప్రదేశంలో ఒక్కో విధంగా ఉంటుంది మార్కెట్. ఆ తీరుతెన్నులను అధ్యయనం చేస్తాను.
డిజిటల్ మార్కెటింగ్‌కు సరైన వేదిక హైదరాబాద్. ఇక్కడ అన్నిరకాల వసతులు ఉన్నాయి. వివిధ రకాల ప్రజలున్నారు. ఒక్క రాష్ట్రంలోనే విభిన్న సంస్కృతులు చూశాను. ఇక్కడి ఆర్కిటెక్చర్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ప్రజల జీవన విధానం నన్ను కట్టిపడేశాయి. యాదాద్రి టెంపుల్ చూసి ఆశ్చర్యపోయాను. ఇక్కడ భిన్నత్వంలో ఏకత్వాన్ని గమనించాను. సిటీలో ఫ్లై
ఓవర్స్, మెట్రో ప్రయాణం.. చాలా బాగుంది. కోఠీలో షాపింగ్ చేశాను. ఇక్కడ వంద రూపాయలకు కూడా టీషర్టు దొరుకుతుంది. నార్త్‌తో పోలిస్తే.. ఇక్కడ వాతావరణం సూపర్.
ఇండియాలో ఇది మరో దేశంగా కనిపించింది. అయితే.. ఇక్కడి స్పైసీ ఫుడ్‌ను నేను పూర్తిగా ఆస్వాదించలేక పోయాను. ఆ కారం తట్టుకోలేకపోయాను. కాస్త మసాలా తగ్గించి వండితే హైదరాబాద్ బిర్యానీ అత్యద్భుతం.
కొన్ని దేశాల్లో ఆకలి బాధలను దగ్గరగా గమనించాను. యూరప్ దేశాలకంటే ఇండియాలో మంచి స్నేహభావం ఉంది. మా వంటి విదేశీయులకు చేతనైన సాయం చేస్తున్నారు. ఇక్కడి ఆచార వ్యవహరాలు నన్ను కట్టిపడేశాయి. కుటుంబానికి విలువ ఇస్తున్నారు. బంధాలలో ఆనందం వెతుక్కుంటున్నారు. ఇక్కడి దేవుళ్ల గురించి తెలుసుకున్నాను. ఇండియా వచ్చాకే దీపావళి ప్రశస్తి తెలిసింది. భారతీయ దేవాలయాల్లో తెలియని శక్తి ఏదో ఉంది. ఇక్కడి సంస్కృతికి ఫిదా అయ్యాను. అందుకే మరొకసారి ఇండియా వస్తాను. ఏదైనా దేవాలయంలో ఓ పదిరోజులు గడిపేస్తాను. ఇక్కడ మహిళలకు గౌరవ మర్యాదలు లభిస్తాయి. విదేశాల్లో ఇలా లేదు. నా ఏజెన్సీని విస్తరించాలనుకుంటే కచ్చితంగా హైదరాబాద్‌లో బ్రాంచ్ ఓపెన్ చేస్తాను. పరిస్థితులు బాగుంటే మార్కెటింగ్‌కు అనుకూలంగా ఉన్న అన్ని దేశాల్లోనూ బ్రాంచ్‌లు ఏర్పాటు చేస్తాను. ఒక్కో దేశానికి వెళ్లడానికి సుమారు రెండు లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుంది. ఈసారి ఇండియాకు వస్తే.. హిందువుగానే తిరిగి మెక్సికో వెళ్తాను.
– రవికుమార్ తోటపల్లి
“Vamsi Kalakuntla | అమెరికాలో పాప్ సాంగ్స్‌లో తెలుగు భాషకు ప్రాణం పోస్తున్న హైదరాబాదీ”