‘అల వైకుంఠపురములో..’ సినిమా చూశారా? అందులో హీరో అసలు తల్లిదండ్రులు ఒకే ఇంట్లో ఉన్నప్పటికీ ఎవరికి వారే అన్నట్టు ఉంటారు గమనించారా? అది కేవలం సినిమాలోనే కాదు, ఇప్పుడు చాలా జంటలు అలాగే ఉంటున్నాయి. దీన్నే సైకాలజీలో ఎమోషనల్ డిస్టెన్స్ అంటారు. అసలు ఈ దూరం ఎందుకు వస్తుంది? ఆ దూరాన్ని ఎలా తగ్గించుకోవచ్చో తెలుసుకుందాం. భార్యాభర్తలు శారీరకంగా పక్కపక్కనే ఉన్నప్పటికీ, మనసులు కలవకపోవడాన్ని, ఒకరినొకరు అర్థం చేసుకోలేకపోవడాన్ని ఎమోషనల్ డిస్టెన్స్ అంటారు. చాలా సందర్భాలలో భాగస్వాములు గొడవపడటం కంటే, ఒకరినొకరు పట్టించుకోకుండా మౌనంగా ఉండటమే బంధానికి ఎక్కువ ప్రమాదకరం.
లక్షణాలు ఇలా..
భాగస్వామితో మీకు దూరం పెరుగుతున్నదని చెప్పడానికి సంకేతాలు ఇలా ఉంటాయి.మాట్లాడుకోవడం తగ్గడం: కేవలం ఇల్లు, పిల్లలు, ఆఫీస్, ఖర్చులు వంటి అవసరమైన విషయాలు తప్ప వ్యక్తిగత భావాలు, సంతోషాలు, బాధల గురించి మాట్లాడుకోవడం మానేస్తారు.మౌనం లేదా ఉదాసీనత: భాగస్వామి ఏం చేసినా కోపం రాకపోవడం, అసలు వారు ఏం చేసినా పట్టించుకోకపోవడం. ‘నువ్వు ఎలా ఉంటే నాకేంటి?’ అనే భావన రావడం.ఫోన్‌కు అంకితం: ఒకే గదిలో ఉన్నా ఇద్దరూ ఎవరి ఫోన్లలో వారు మునిగిపోవడం, ఒకరినొకరు చూసి నవ్వడం లేదా కళ్లు కలపడం తగ్గడం.శారీరక దూరం: కౌగిలింతలు, చేతులు పట్టుకోవడం, కనీసం పక్కపక్కన కూర్చోవడం వంటి స్పర్శ పూర్తిగా తగ్గిపోవడం.
ఒంటరితనం: భాగస్వామి పక్కన ఉన్నప్పటికీ లోలోపల ఏదో తెలియని ఒంటరితనం వేధించడం.
ఎందుకు అలా?
బంధంలో ఒక్కరోజులోనే దూరం రాదు. కాలక్రమేణా కింది కారణాల వల్ల ఇది పెరుగుతుంది. తెలిసో, తెలియకో చేసే కొన్ని పనుల వల్ల ఎమోషనల్‌గా దూరం పెరిగిపోతుంది.
వేంటో చూద్దాం.
కేర్ తీసుకుంటే సరి..
భార్యాభర్తల మధ్య మానసిక దూరాన్ని తగ్గించడానికి C-A-R-E సూత్రం ఉపయోగపడుతుంది.
సి – కమ్యూనికేషన్ (నిజాయతీతో కూడిన సంభాషణ)
చాలా జంటల్లో గొడవలు జరగడం లేదు అంటే వారు సుఖంగా ఉన్నారని అర్థం కాదు. ఒక్కోసారి మాట్లాడటానికి ఏమీ లేక మౌనంగా ఉండిపోతారు. దీనినే ‘సైలెంట్ కిల్లర్’ అంటారు. సాధారణంగా మనం మాట్లాడేటప్పుడు ఎదుటి వ్యక్తిని నిందించేలా మాట్లాడుతాం. ఉదాహరణకుకు ‘నువ్వు ఎప్పుడూ ఇంతే, నన్ను అస్సలు పట్టించుకోవు, ఆఫీస్ పనులే ఎక్కువ నీకు’ అనడం లాంటివి. దీనివల్ల భాగస్వామి డిఫెన్సివ్ మోడ్‌లోకి వెళ్లిపోయి, వాదించడం లేదా మౌనంగా ఉండటం చేస్తారు.
ఆచరణాత్మక అడుగు: వారంలో కనీసం ఒక్కసారైనా ‘ఈ వారం మన బంధం ఎలా సాగింది? నేను నీకు ఇంకా ఎలా సహాయపడగలను?’ అని కూర్చుని మాట్లాడుకోవాలి.
ఏ- అటెన్షన్ (పూర్తి శ్రద్ధ- సమయం)
ఒకే ఇంట్లో ఉండటం, ఒకే మంచంపై పడుకోవడం అంటే కలిసి సమయం గడపడం కాదు. నేటి డిజిటల్ యుగంలో ఇద్దరి మధ్య భౌతిక దూరం కంటే ‘డిజిటల్ దూరం’ ఎక్కువైపోతున్నది. భార్య ఏదో ముఖ్యమైన విషయం చెప్తుంటే, భర్త ఫోన్ చూస్తూ ‘ఉమ్.. చెప్పు వింటున్నా’ అనడం, లేదా భర్త మాట్లాడుతుంటే భార్య టీవీ చూస్తూ వినడం. దీనివల్ల భాగస్వామికి ‘నాకు ఈ బంధంలో విలువ లేదు’ అనే భావన కలుగుతుంది.
ఆచరణాత్మక అడుగు: డైనింగ్ టేబుల్ మీద, బెడ్రూమ్లో పడుకునే ముందు 30 నిమిషాలు ఫోన్లు పూర్తిగా వాడకూడదని రూల్ పెట్టుకోండి. ఆఫీస్ నుంచి రాగానే కనీసం 15 నిమిషాలు ఇద్దరి ఉద్యోగ బాధ్యతలను పక్కన పెట్టి, కేవలం వారి మానసిక స్థితి ఎలా ఉందో అడిగి తెలుసుకోండి.
ఆర్ – రీ కనెక్ట్ (బంధాన్ని మళ్లీ బలోపేతం చేయడం)
పెళ్లయిన కొత్తలో ఉన్న ఆకర్షణ, ఉత్సాహం కొన్ని సంవత్సరాల తర్వాత బాధ్యతల వల్ల తగ్గిపోతుంది. బంధం ఒక మెకానికల్ లైఫ్ లాగా మారిపోతుంది. కేవలం భార్యాభర్తలుగా, పిల్లల తల్లిదండ్రులుగా మాత్రమే మిగిలిపోతారు తప్ప… ఒకప్పటి ప్రేమికులు అనే విషయాన్ని మర్చిపోతారు. బంధంలో మళ్లీ ఆ పాత ‘స్పార్క్’ రావాలంటే ఉద్దేశపూర్వకంగా కొన్ని ప్రయత్నాలు చేయాలి.
ఆచరణాత్మక అడుగు: నెలకు కనీసం ఒక్కసారి లేదా రెండుసార్లు పిల్లలను ఇంట్లో వాళ్ల దగ్గర ఉంచి, ఇద్దరే కలిసి సినిమాకో, డిన్నర్‌కో వెళ్లాలి. ఉదయం ఆఫీస్‌కు వెళ్లేటప్పుడు ఆరు సెకండ్స్ పాటు ఒకరినొకరు కౌగిలించుకోవడం, ఆఫీస్ టైమింగ్ మధ్యలో ఒక చిన్న ‘మిస్ యూ’ మెసేజ్ పంపడం, నడుస్తున్నప్పుడు చేతులు పట్టుకోవడం లాంటివి చేయండి. ఇవి చాలా చిన్న విషయాలుగా అనిపించినా మెదడులో ప్రేమను పెంచే హార్మోన్లను విడుదల చేస్తాయి.
ఈ-ఎంపతీ (సహానుభూతి, క్షమాగుణం)
ఎమోషనల్ డిస్టెన్స్ పెరగడానికి అతిపెద్ద కారణం మనసులో చేదు జ్ఞాపకాలను దాచిపెట్టుకోవడం. ఏదైనా చిన్న గొడవ జరిగినప్పుడు, ‘ఐదేళ్ల క్రితం నీ ఇంట్లో వాళ్లు నన్ను ఇలా అన్నారు, ఆ రోజు నువ్వు నాకు సపోర్ట్ చేయలేదు’ అంటూ పాత విషయాలన్నిటినీ తవ్వి తీయడం. దీనివల్ల సమస్య పెద్దదవుతుంది తప్ప పరిష్కారం దొరకదు. ఎదుటి వ్యక్తి తప్పు చేసినప్పుడు కోప్పడటానికి ముందు, అసలు వారు ఎందుకు అలా ప్రవర్తించాల్సి వచ్చిందో వారి స్థానంలో నిలబడి ఆలోచించాలి. తప్పులు అందరూ చేస్తారు. గతాన్ని పదే పదే గుర్తు చేయడం వల్ల ప్రస్తుత జీవితం నాశనమవుతుంది. ఒక విషయాన్ని పరిష్కరించుకున్నాక దాన్ని అక్కడితో వదిలేయాలి.ఆచరణాత్మక అడుగు: గొడవ జరిగినప్పుడు ‘గెలవాల్సింది నేను కాదు, మన బంధం’ అని గుర్తుపెట్టుకోండి. ఈగో పక్కన పెట్టి ఎవరు ముందు సారీ చెప్తే వారు గొప్ప అనే భావనను అలవర్చుకోండి.
బంధం ఒక మొక్క లాంటిది. దానికి రోజూ నీళ్లు పోసి కేర్ తీసుకుంటేనే అది బతుకుతుంది. మీ బంధంలో మానసిక దూరం కనిపిస్తే ఈ రోజే ఈ నాలుగు సూత్రాలలో కనీసం ఒకదానితో మీ ప్రయత్నాన్ని ప్రారంభించండి. ఎమోషనల్ డిస్టెన్స్ అనేది ఏ బంధంలోనైనా రావచ్చు. కానీ, దానిని అలాగే వదిలేయకుండా ఇద్దరిలో ఎవరో ఒకరు మొదట అడుగు ముందుకు వేసి మాట్లాడాలి. బంధాన్ని నిలబెట్టుకోవడానికి ఈగో పక్కన పెట్టడం ఎంతైనా అవసరం. సమస్య మరీ తీవ్రంగా ఉంటే ప్రొఫెషనల్ కపుల్స్ కౌన్సెలింగ్ తీసుకోవడం ఉత్తమమైన మార్గం.
తత్వం తెలుసుకుంటే..
భార్యంటే బానిస కాదు. భర్తంటే భరించేవాడనీ కాదు. పెనిమిటిని సుతారంగా పెనవేసుకున్న తీగ ఆమె. ఆలి ఆలింగనంతో తరిస్తున్న తరువు ఆయన. ఆ తీగ పందిరి ఎక్కకున్నా.. ఈ తరువు బరువుగా భావించి కుంగిపోయినా దాంపత్యం భారమవుతుంది. ఒకరికొకరు అవకాశం కల్పిస్తూ అల్లుకుపోవడమే దాంపత్య రహస్యం. ఒకరినొకరు అర్థం చేసుకోవడమే సంసార సూత్రం. సరసాల దాంపత్యం, నవరసాల సంసారం కలగలిసిందే జీవితం. ఈ ఆట ఆడే ఆలుమగలిద్దరూ సమవుజ్జీలు అయినప్పుడే.. జీవితం రంజుగా సాగుతుంది. ప్రతి మలుపులోనూ ఇద్దరి గెలుపూ సాధ్యమవుతుంది.
-బి. కృష్ణ, సీనియర్ సైకాలజిస్ట్
ఇగ్నిషియో చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్,హైదరాబాద్, 99854 28261