ద్రిషికా చందర్.. ఒక్క సినిమాతోనే ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నది. అంతర్జాతీయ స్థాయిలో నలభైకి పైగా ఉత్తమ నటి అవార్డులు అందుకొని ‘ఔరా!’ అనిపించుకున్నది. నాటకరంగంలోనూ అడుగుపెట్టి.. అక్కడా ప్రశంసలు దక్కించుకున్నది. అందం, అంతకుమించిన అభినయంతో తెలుగు, హిందీ, మలయాళ భాషల్లో వరుస ఆఫర్లు అందుకుంటున్నది. ఇటీవలే ‘సుయోధన’ సరసన మెరిసిన ద్రిషికా పంచుకున్న కార్వాన్ ముచ్చట్లు..
నా కెరీర్ మొదలైందే.. నాటక రంగం ద్వారా. ‘ఏవం ఇంద్రజిత్’ అనే హిందీ నాటికలో ఆరు విభిన్న కోణాలున్న మహిళ పాత్రను పోషించాను. ఆ నాటకానికి మంచి స్పందన వచ్చింది. నేను నాటకాల్లో నటించినప్పుడు నా పెర్ఫార్మెన్స్ చూసి ‘సుయోధన’లో అవకాశం ఇచ్చారు.
‘మనసానమః’ షార్ట్ ఫిల్మ్.. నాకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చింది. వెయ్యికి పైగా అవార్డులు కైవసం చేసుకొని, ప్రపంచంలోనే అత్యధిక అవార్డులు సాధించిన లఘు చిత్రంగా గిన్నిస్ రికార్డునూ సృష్టించింది. నాకూ అంతర్జాతీయ స్థాయిలో నలభైకి పైగా ఉత్తమ నటి అవార్డులు దక్కాయి. ఈ షార్ట్ ఫిల్మ్ 2022లో ఆస్కార్ అర్హత సాధించడం మాకెంతో గర్వకారణం.
‘బుచ్చి నాయుడు కండ్రిగ: తూర్పు వీధి’ నా మొదటి సినిమా. ప్రస్తుతం తెలుగుతోపాటు హిందీ, మలయాళ భాషల్లోనూ అవకాశాలు వస్తున్నాయి. రాబోయే రోజుల్లో విభిన్నమైన పాత్రల్లో అలరిస్తూ.. మంచి నటిగా పేరు తెచ్చుకోవడమే నా లక్ష్యం. అవకాశం వస్తే స్పోర్ట్ స్టార్ బయోపిక్‌లో నటించాలనేది నా కోరిక.
ఇండస్ట్రీలో నాకు రణ్వీర్ సింగ్ అంటే ఇష్టం. శ్రీదేవీ, రేఖ నటనను ఇష్టపడతా. నాకు కిక్ బాక్సింగ్ వచ్చు. డైవింగ్‌లోనూ శిక్షణ తీసుకున్నా.
మాది సినిమా నేపథ్యమున్న ఫ్యామిలీ. అరుంధతి సినిమాకు మా అమ్మే క్యాస్టూమ్ డిజైనర్. ఆ తర్వాత ఇండస్ట్రీలో ప్రొడక్షన్ డిజైనర్‌గా, ఆర్ట్ విభాగంలో, డైరెక్షన్ డిపార్ట్మెంట్లోనూ పనిచేసింది. ఆమె ప్రోత్సాహం వల్లే ఇక్కడిదాకా వచ్చా.
సినిమాల్లో నటించాలనే కోరిక నాకు చిన్నప్పటి నుంచే ఉండేది. కానీ, ‘చదువు పూర్తయిన తర్వాతే సినిమాలు’ అని అమ్మ చెప్పడంతో ఆవైపు మళ్లాను. ప్రతిష్ఠాత్మక న్యూయార్క్ ఫ్యాషన్ స్కూల్లో డిగ్రీ చేశాను. అక్కడి నుంచి నాటకరంగంలోకి, ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చాను.