మళ్లీ కాంగ్రెస్ గ్రహణం
చిన్న జిల్లాల అభివృద్ధి కేంద్రంగా బీఆర్ఎస్ పాలన సాగింది. ప్రతి జిల్లాలో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయాలు నిర్మించి, జిల్లాకో మెడికల్ కాలేజ్ కట్టించి, ప్రతి జిల్లా కేంద్రాన్ని రాష్ట్ర రాజధానికి అనుసంధానించింది. ప్రతి ఊరికి, గిరిజన తండాకు, ఆదివాసీ గూడేనికి రోడ్డు వేసింది.
చిన్న జిల్లాల అభివృద్ధి కేంద్రంగా బీఆర్ఎస్ పాలన సాగింది. ప్రతి జిల్లాలో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయాలు నిర్మించి, జిల్లాకో మెడికల్ కాలేజ్ కట్టించి, ప్రతి జిల్లా కేంద్రాన్ని రాష్ట్ర రాజధానికి అనుసంధానించింది. ప్రతి ఊరికి, గిరిజన తండాకు, ఆదివాసీ గూడేనికి రోడ్డు వేసింది. అభివృద్ధికి ఊతమిచ్చే పాలనతో పురోగమిస్తున్న జిల్లా కేంద్రాల్లో ఇప్పుడు ప్రగతి పడకేసింది. కేసీఆర్ ముద్ర చెరిపేసే కుట్రతో మెడికల్ కళాశాలలపై, పథకాలపై కాంగ్రెస్ సర్కార్ వివక్ష పాటిస్తున్నది.
గతంలో దవాఖానకు పోయి ఇబ్బంది పడుడు కంటే బీమారి బాధే నయం! అన్నట్టుండేది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టరుండడు. ఏరియా దవాఖానలో సౌలత్లు ఉండవు. జిల్లా దవాఖనకు పోతే జనం ఎక్కువ… డాక్టర్లు తక్కువ. అంత పెద్ద జిల్లాకు ఒక్కటే దవాఖాన! పుట్టపగిలొచ్చినట్టు వచ్చే రోగుల్ని ఎవడూ పట్టించుకోడు. ఎవడి బాధ వాడు పడుతడులే అనుకుంట ప్రభుత్వాలు దశాబ్దాలు పాలన నడిపించుకుంట పోయినయి. తెలంగాణ ఏర్పడటంతోనే చిన్న జిల్లాలు అయినయి. ఆ తర్వాత జిల్లాకో మెడికల్ కాలేజ్ వచ్చింది. మెడికల్ కాలేజీలకు అనుసంధానిస్తూ 350 పడకల నుంచి 400 పడకల దవాఖానలు నిర్మించింది బీఆర్ఎస్ ప్రభుత్వం. నియోజకవర్గ కేంద్రాల్లో 50 పడకల నుంచి 100 పడకల ఆసుపత్రులను కట్టించింది. ఇప్పుడు దవాఖాన దగ్గరైంది. వైద్యం అందుబాటులోకి వచ్చింది. ఇది కేసీఆర్ మార్క్! ఎవరూ చెరపలేని సత్యం.
తెలంగాణ ఏర్పడే నాటికి రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ మెడికల్ కాలేజీలు అయిదే! బీఆర్ఎస్ ప్రభుత్వం తొమ్మిదేండ్లలో 29 మెడికల్ కాలేజ్‌లకు నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) అనుమతులు తెచ్చింది. వైద్య కళాశాలలు ప్రారంభించింది. మొదలు తాత్కాలిక భవనాల్లో వైద్య కళాశాలలు నడుపుతూనే.. శాశ్వత భవనాల నిర్మాణం, అనుబంధ దవాఖానల అభివృద్ధికి నిధులు మంజూరు చేసింది. మెడికల్ కాలేజీల విస్తరణ, మౌలిక సదుపాయాల కోసం దాదాపు రూ.7వేల కోట్ల నిధులు ఖర్చు చేసింది. జిల్లాకో ప్రభుత్వ వైద్య కళశాల ఏర్పాటు చేయబట్టి ఇప్పుడు మన తెలంగాణలో ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య 2,850కి పెరిగింది.
వైరస్ కన్నా ప్రమాదం కాంగ్రెస్ వివక్ష
బీఆర్ఎస్ ప్రభుత్వం కొత్తగా మొదలుపెట్టిన మెడికల్ కాలేజ్‌లను ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం చిన్నచూపు చూస్తున్నది. మెడికల్ కాలేజ్‌లకు అనుబంధంగా ఉన్న దవాఖానల్లో పడకలు పెంచడంలేదు. వైద్య పరికరాలు సమకూర్చడం లేదు. బోధనా సిబ్బంది నియామకం జరుగుత లేదు. ప్రయోగశాలలు లేవు. క్లినికల్ ప్రాక్టీస్‌కు కావాల్సిన మౌలిక సదుపాయాలు అసలే లేవు. ఈ లోపాలన్నీ ఎన్ఎంసీ గుర్తించింది. రాష్ట్రంలోని 34 ప్రభుత్వ వైద్య కళాశాలల్లో గాంధీ, ఉస్మానియా, రిమ్స్ (ఆదిలాబాద్), నిజామాబాద్, మహేశ్వరం, యాదాద్రి, వికారాబాద్ మెడికల్ కాలేజ్‌లు తప్ప మిగతా 26 మెడికల్ కాలేజ్‌లకు ఎన్ఎంసీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. తెలంగాణ హెల్త్ సెక్రటరీ, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ నేరుగా ఎన్ఎంసీ ముందు హాజరుకావాలని, వివరణ ఇయ్యాలని ఆదేశించింది. ఈ కాలేజ్‌లు ఇప్పటికిప్పుడు గుర్తింపును కోల్పోయే ప్రమాదం లేకున్నా ప్రభుత్వం మేల్కొనకపోతే ప్రజలకు ఇబ్బందులు తప్పేలా లేవు. జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేసి తెలంగాణ మెడికల్ హబ్‌గా మార్చాలన్న బీఆర్ఎస్ సంకల్పం కాంగ్రెస్ సర్కార్ కారణంగా నీరిగారి పోతున్నదనడానికి ఇంతకు మించిన సాక్ష్యాలు ఇంకేం కావాలి?
చిన్న జిల్లాలపై చిన్న చూపు
బీఆర్ఎస్ పాలన చిన్న జిల్లాల అభివృద్ధి కేంద్రంగా సాగింది. కాంగ్రెస్ ఏలుబడిలో వీటి ఉనికే ప్రశ్నార్థకమైంది. జిల్లాల పునర్వ్యవస్థీకరణ పేరుతో కొత్త చర్చ తెరలేపి గందరగోళం సృష్టించినరు. కొన్ని జిల్లాల సరిహద్దులు మారుస్తమని, కొన్ని జిల్లాలను మొత్తానికే రద్దు చేస్తమని లీకులు ఇస్తున్నరు. జిల్లా కేంద్రం కావడంతో అభివృద్ధి చెందుతామని భావించిన స్థానిక జనంలో ఆందోళనలు చెలరేగాయి. ప్రజా వ్యతిరేకతతో కాంగ్రెస్ సర్కార్ వెనక్కి తగ్గింది. మరోవైపు జిల్లా కేంద్రాల్లో అభివృద్ధి బీఆర్ఎస్ హయాంలో జరిగిందే తప్ప.. కాంగ్రెస్ చేపట్టి పూర్తి చేసిన పని ఒక్కటీ లేదు. బీఆర్ఎస్ హయాంలో నిధులు మంజూరైన పనులకు శంకుస్థాపనలు, కేసీఆర్ పానలలో చేపట్టిన నిర్మాణాలకు రిబ్బన్ కటింగ్‌లు చేయడం తప్ప కొత్తగా చేసిందేమీ లేదు. కొన్ని జిల్లాల్లో కాంగ్రెస్ సర్కార్ పనులు మొదలుపెట్టినా మూడేండ్లుగా పూర్తి కాకుండానే ఉన్నయి.
బుల్డోజర్ సర్కార్
రేవంత్ హయాంలో అభివృద్ధి కుంటుపడింది. మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టు ఉపాధి లేని పేదలపై సర్కార్ బుల్డోజర్లతో విరుచుకుపడుతున్నది. హైదరాబాద్‌లో హైడ్రా తరహాలో చాలా జిల్లాల్లో కూల్చివేతలకు, విధ్వంసానికే ప్రాధాన్యమిస్తున్నది. ఖమ్మం నగరంలో మున్నేరు ముప్పుని ఎదుర్కొన్న కాలనీల్లో నిర్మాణాలను తొలగించింది. వెలుగుమట్లలో పేదల ఇళ్లను బుల్డోజర్లతో దుర్మార్గంగా కూల్చింది. కొత్తగూడెం, పాల్వంచ మున్సిపాలిటీలలో షెడ్లను నేలమట్టం చేసింది. జిల్లాల్లో అభివృద్ధి పనుల పేరుతో ఇష్టారాజ్యంగా పేదల ఇళ్లు కూల్చివేస్తున్నది. ఈ అరాచక పాలనల అభివృద్ధికి గ్రహణం పట్టింది, అదే సమయంలో విధ్వంసం మాత్రం ఘనంగా సాగుతుండటం విచారకరం.
– గుల్లపెల్లి సిద్ధార్థ గౌడ్, మంచిర్యాల

House Damage

Worried
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

