బాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యువ నటి జాన్వీ కపూర్. దక్షిణాది చిత్రసీమలో మరో అడుగు వేసింది. దేవరతో టాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన ఈ ముద్దుగుమ్మ.. ‘పెద్ది’తో పెద్ద సక్సెస్ తన బుట్టలో వేసుకుంది. ఈ చిత్రంలో అందం, అభినయంతో సత్తా చాటింది. ఈ సందర్భంగా జగదేకవీరుడి కుమారుడితో జతకట్టిన ఈ అతిలోక సుందరి కుమార్తె పంచుకున్న కార్వాన్ కబుర్లివి.
చాలామంది కాలక్షేపం కోసం డ్యాన్స్ నేర్చుకుంటారు. నేను ఇష్టంతో నేర్చుకున్నాను. నాకు డ్యాన్స్ అంటే ఒక ఎమోషన్. శాస్త్రీయ నృత్యం అంటే మహా ఇష్టం. కథక్ నేర్చుకున్నాను. ఇప్పటికీ నృత్య సాధన కొనసాగిస్తూనే ఉన్నా. ఇది నాకు శారీరక ఫిట్నెస్తో పాటు మానసిక ఆరోగ్యాన్ని అందించింది.
ఎవరైనా బరువు తగ్గాలనుకుంటే రామ్‌చరణ్‌తో కలిసి డ్యాన్స్ చేస్తే చాలు.. సింపుల్‌గా వెయిట్‌లాస్ అవుతారు. మేము మూడు, నాలుగురోజులపాటు సాంగ్ షూటింగ్ చేసినప్పుడు చివరిరోజు డ్యాన్సర్లందరూ స్లిమ్‌గా అయినట్లు నాకు అనిపించింది. అంతలా డ్యాన్స్ చేసేస్తారు. తన వేగాన్ని అందుకోవడం అంత ఈజీ కాదు.
ప్రస్తుతం టెక్నాలజీ అభివృద్ధి చెందడంతో డీప్‌ఫేక్, ఏఐ ఆధారిత ఫొటోలు ప్రమాదకరంగా మారుతున్నాయి. ఇలాంటి ఘటన 15 ఏళ్ల వయస్సులో నాకే ఎదురైంది.ఇంటర్నెట్లో లోపించిన నైతికత ఆ క్షణంలో నాకు తెలిసొచ్చింది. ఆ పీడకల ఇప్పటికీ నన్ను వెంటాడుతూనే ఉంది.
మా అమ్మ సినీ ఇండస్ట్రీలో ఒక తారలా మెరిసింది. కేవలం గ్లామర్ రోల్స్ మాత్రమే కాకుండా అద్బుతమైన పాత్రల్లో అలరించింది. అందుకే ఆమెకు అభిమాని కానివారంటూ ఎవరూ ఉండరు. నేను కూడా ఆమె అభిమానినే. అమ్మకు తగిన
వారసురాలు అనిపించుకునే ప్రయత్నం చేస్తాను.
వ్యక్తిగత జీవితాన్ని చెప్పుకొంటే కూడా సామాజిక మాధ్యమాల్లో తప్పుడు పోస్టులు పెట్టి కొంతమంది పైశాచిక అనందాన్ని పొందుతున్నారు. ఇటీవల ఓ పాడ్‌కాస్ట్‌లో పాల్గొని నా జీవితంలో ఎదురైనా ఓ బాధాకరమైన విషయాన్ని బహిరంగంగా మాట్లాడాను. ఆ సమయంలో మానసికంగా చాలా కుంగిపోయి, కొంతకాలం మద్యం వైపు మళ్లిన విషయాన్ని కూడా నిజాయతీగా చెప్పాను. దానికి కూడా తప్పుడు ప్రచారం చేశారు. పాడ్‌కాస్ట్ నిర్వాహకులు స్పష్టత ఇచ్చేలోపు ఆ అబద్ధం ప్రపంచమంతా పాకిపోయింది.
నాకు తెలుగు రాకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడ్డాను. పెద్ది షూటింగ్ ప్రారంభంలో తెలుగు డైలాగులు చెప్పడానికి పెద్ద పెద్ద కసరత్తులే చేశాను. ఆ టైంలో రామ్‌చరణ్ నాకు ఎంతో సహకరించారు. డైలాగులు నేర్పిస్తూ నాలోని కంగారును పోగొట్టారు. ఆయన సెట్లో బుద్ధుడిలాగా ప్రశాంతంగా ఉంటారు. టాలీవుడ్లో ఇది రెండో సినిమా అయినా రామ్‌చరణ్ సహకారం వల్లే నా నటన మెరుగైంది.