ఓ విజేత చరిత్ర

హిందీ చిత్ర సీమలో పైడి జయ్‌రాజ్ పసిడిలా మెరిశారు. కొన్ని దశాబ్దాలపాటు నిశ్శబ్ద విజేతగా
నిలిచారు. కానీ, ఆయన సాధించిన విజయాలను తెలుగువాళ్లు పట్టించుకున్న దాఖలాలు లేవు. అందుకే, చరిత్ర సృష్టించిన ఓ యోధుడి చరిత్రను సచిత్రంగా ‘టు బాంబే విత్ లవ్- పి.జయ్రాజ్స్ లైఫ్, టైమ్స్ అండ్ ఫిల్మ్స్’ పేరుతో పుస్తకరూపంలో ఆవిష్కరించారు హైదరాబాద్‌కు చెందిన
రచయిత, పరిశోధకుడు టి.శ్రీకాంత్. ఈ ప్రయత్నం వెనుకున్న కృషి ఆయన మాటల్లోనే..
1985 ప్రాంతం, నేనప్పుడు టీనేజ్ కుర్రాణ్ని! ఆ సమయంలోనే మా నాన్న టీవీ కొన్నారు. ఓ రోజు అందులో పాత హిందీ సినిమా చూస్తున్న. అందులో హీరో ఆరడుగుల ఆజానుబాహుడు. గుర్రం మీద కోట గోడ మీది నుంచి దబీమని దూకి మెరుపులా దూసుకుపోతున్నాడు. రెప్పార్పకుండా చూస్తున్నా. ఎంత అందంగా ఉన్నాడో అనుకొని, మా నాన్నతో ‘ఆ హీరో పేరేంటి?’ అని అడిగా. అప్పుడు మా నాన్న..‘తను పైడి జయ్‌రాజ్. మన తెలంగాణ వాడే! కరీంనగర్ బిడ్డ. హైదరాబాద్‌లో చదువుకున్నాడు. బాంబేలో పెద్ద హీరో!’ అన్నాడు. ఆయన రూపం, సాధించిన ఘనత అలా నా మనసులో ముద్రపడిపోయింది. మన తెలుగువాడు హిందీ సినిమాల్లో హీరోగా రాణించడం గొప్పే అనుకున్నా!
రోజులు గడిచిపోయాయి. సంవత్సరాలు దాటిపోయాయి. చదువుల్లో బిజీ అయిపోయా. ఎమ్మెస్సీ జువాలజీ చదివాను. అధ్యాపక వృత్తిపై ఆసక్తి లేక అప్పట్లో కొత్తగా వచ్చిన మల్టీమీడియా కోర్సులు చేశా. ఓ సంస్థలో గ్రాఫిక్ డిజైనర్‌గా కొన్నాళ్లు పనిచేశా. అక్కడే నాకు సినిమాలతో మళ్లీ అనుబంధం ఏర్పడింది. పాత సినిమాలను డీవీడీలుగా రూపొందించే వర్క్‌లో నా పాత్ర ఉండేది. అలా సినిమాలపై మళ్లీ మక్కువ ఎక్కువైంది. కొన్నాళ్లకు ఉద్యోగం వదిలేసి, సొంతంగా బుక్ డిజైనింగ్, క్రియేటివ్ వర్క్ చేయడం మొదలుపెట్టా. కరపత్రాలు, పుస్తకాలు డిజైన్ చేస్తుండేవాణ్ని.
అనగనగా ఓ సందర్భం
సహజంగా సినిమాలపై ఇష్టం ఉండటంతో నా వర్క్ సినిమా సాహిత్యంతో ఎక్కువగా ముడిపడేలా చూసుకునేవాణ్ని. అలా చిత్రసీమకు చెందిన పలువురు ప్రముఖుల పుస్తకాలను డిజైన్ చేసే అవకాశం దక్కింది. 2005 ప్రాంతంలో సీనియర్ నటుడు కాంతారావు బయోగ్రఫీ రాయాలనే ఆలోచన తట్టింది. దాదాపు ఆరు నెలలు తిరిగి జీవిత చరిత్ర రాయడానికి ఆయన్ను ఒప్పించా. నా స్నేహితుడు జగన్మోహన్తో కలిసి ‘అనగనగా ఓ రాకుమారుడు’ పుస్తకం 2007లో తీసుకొచ్చాం. ఆ ఏడాది ఉత్తమ ఫిల్మ్ బుక్‌గా నంది అవార్డు కూడా దక్కింది. అదే సమయంలో తెలంగాణ మలిదశ ఉద్యమం ఊపందుకుంటున్నది. నా తర్వాతి ప్రాజెక్ట్ తెలంగాణ కళాకారుల జీవితంపై ఎందుకు చేయకూడదని అనిపించింది. అది బాంబే ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలంగాణవాడి సత్తా చాటిన పైడి జయ్రాజ్ది ఎందుకు కాకూడదని భావించా. అలా 2009లో పైడి జయ్‌రాజ్ చరిత్రను ఈ తరానికి పరిచయం చేయాలని సంకల్పించాను.
లబ్ధప్రతిష్ఠులను కలిసి..
జయ్రాజ్ను ఈ తరానికి పరిచయం చేయడం అనుకున్నంత తేలిక కాదని ప్రాజెక్ట్ మొదలుపెట్టిన కొద్ది రోజులకే నాకు అర్థమైంది. ఆయన గురించి సమాచారం ఏదీ అందుబాటులో లేదు. ఇంటర్నెట్లో అరకొరగానే ఉంది. నేను ప్రాజెక్ట్ అనుకునే నాటికే జయరాజ్ శతజయంతి అయిపోయింది. అంటే, వందేండ్లు వెనక్కి వెళ్లి చరిత్రను వెలికితీయాలి. ఇందుకోసం అందుబాటులో ఉన్న అన్ని మార్గాలనూ అన్వేషించాను. జయరాజ్‌తో సంబంధం ఉన్న వ్యక్తులను, వ్యవస్థలనూ సంప్రదించాలని అనుకున్నా. ఆయన కొడుకు దిలీప్‌రాజా, మనవడు శ్రీ రాజన్‌ను సంప్రదించాను. ఆయనతో కలిసి పనిచేసిన తారలను, టెక్నీషియన్స్‌ను కలిశాను. మూవీ లెజెండ్స్ దిలీప్‌కుమార్, సైరాబాను, ఆయనతో హీరోయిన్గా చేసిన జబీన్, ప్రతినాయకుడు ప్రేమ్చోప్రా, జయ్‌రాజ్ పర్సనల్ డాక్టర్ గోఖలే, మేకప్‌మన్ పండరీ జుకర్ ఇలా ఆయనతో అనుబంధం ఉన్న లబ్ధప్రతిష్ఠులను వెతికి వెతికి పట్టుకున్నా. పదే పదే కలుసుకుని కావాల్సిన సమాచారం రాబట్టుకున్నా.
అందరి సహకారంతో..
మూకీ చిత్రాల కాలం నుంచే జయ్‌రాజ్ సూపర్ హీరో. టాకీల్లోనూ హీరోగా అనేక చిత్రాల్లో నటించారు. ఆ సినిమాల సమాచారం కోసం ఆ కాలంలో వచ్చిన మ్యాగజైన్స్‌ను జల్లెడ పట్టాను. ముంబయికి ఎన్నోసార్లు వెళ్లాను. ‘ఫిల్మ్ ఇండియా’ మ్యాగజైన్స్ ఎడిటర్ బాబూరావ్ పటేల్ భార్య సుశీలారాణి పటేల్ పరిచయం ఈ ప్రాజెక్ట్‌కు ఎంతగానో ఉపకరించింది. పుణెకు చెందిన ఓ జర్నలిస్ట్ ముకుంద్ బాపట్ నుంచి విలువైన సమాచారం లభించడంతో జయరాజ్ పుస్తక క్రతువు ఊపందుకుంది. ఎన్నో వ్యయప్రయాసలకోర్చి ఈ పుస్తకాన్ని అందంగా తీర్చిదిద్దా. ఇందులో ఆయన జీవిత విశేషాలు, చేసిన సినిమాలు, ఆయనపై ప్రముఖుల అభిప్రాయాలు ఇలా ఎన్నో విశేషాలు పొందుపరిచాను. 1980లోనే దాదాసాహెబ్ ఫాల్కె అవార్డు అందుకున్న గొప్ప నటుడాయన. బాలీవుడ్లోనే కాదు హాలీవుడ్ సినిమాల్లోనూ తళుక్కుమన్న తార. వందేండ్ల నాటి ఆయన చరిత్ర ఈ తరం గుండెల్లో కలకాలం నిలిచి ఉంచే సంకల్పంతో ఈ ప్రాజెక్టు చేపట్టాను. మన తెలంగాణ ఆణిముత్యానికి ఇంతకన్నా గొప్ప నివాళి ఏమివ్వగలను!
శ్యామ్ బెనగల్ ముందుమాట
పుస్తక ప్రచురణలో ఫొటోలది కీలక పాత్ర. వాటి సేకరణ కోసం చాలా కష్టపడ్డాను. సామాజిక మాధ్యమాలను ఆశ్రయించా. క్లాసిఫైడ్ ప్రకటనలూ ఇచ్చా. అవి చూసి ఎందరో నన్ను సంప్రదించి, కావాల్సిన వివరాలు అందించారు. పుణెలోని నేషనల్ ఫిల్మ్ ఆర్కివ్స్ ఆఫ్ ఇండియా అందించిన సహకారం మరువలేనిది. దాదాపు ఎనిమిదేండ్లు శ్రమించి అరుదైన చిత్రాలెన్నో సేకరించి ఈ పుస్తకాన్ని రూపొందించా. దీనికి హైదరాబాద్‌కే చెందిన దర్శక దిగ్గజం శ్యామ్ బెనగల్ ముందుమాట రాయడంతో నా శ్రమకు ఫలితం దక్కింది. ఈ అరుదైన హీరో చరిత్రను తెలుగులోనూ తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నా.
(పుస్తక ప్రతులకు: 9848506964)
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
- Tags
RELATED ARTICLES
తాజా వార్తలు
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

