‘వియ్ ద హ్యూమన్స్’.. ఒక ఆన్లైన్ వేదిక. ఇన్స్టాగ్రామ్ సాక్షిగా ఈ సామాజిక ఉద్యమం మొదలైంది. తమదైన గొంతుక వినిపించలేని వారికి ఇదొక ఆధారం. ‘నన్ను పట్టించుకునేవారు లేరే! నా బాధ వినేవారు కానరారే..’ అనుకునే వాళ్లంతా ఇక్కడ తమ మనసు విప్పొచ్చు. అదే వేదిక మీద స్పందించే హృదయాలూ ఉంటాయి. సాయం అవసరమైనవారు, సాయం చేయాలనుకునేవారు.. ఇద్దర్నీ ఒక చోట చేర్చడమే తన లక్ష్యమని వివరిస్తారు యశికా ఆనంద్.
చాలా సందర్భాల్లో మన గొంతుక వినే మనుషులు ఉన్నారనే భావనే.. సగం సమస్యను పరిష్కరిస్తుంది. అలాంటి ఓ అనుభవం తన ఆలోచనల్ని మార్చిందని చెబుతారు యశిక. డిప్రెషన్లో ఉన్న వ్యక్తుల బాధలను, కష్టాలను ఓపికతో వినే ఓ వ్యక్తి గురించి యశిక చేసిన రీల్ సంచలనం సృష్టించింది.
ఆ స్ఫూర్తితో మరికొందరు ముందుకొచ్చారు. అప్పుడే ఆమెకు ‘వియ్ ద హ్యూమన్స్’ ఆలోచన వచ్చింది. సామాజిక మాధ్యమాల్లో బాధ్యతలేని వ్యాఖ్యానాలు, దిగజారుడు మాటలు కొన్నిసార్లు ఇబ్బంది కలిగిస్తాయి కూడా. ‘తక్షణం ఆ కామెంట్లను తొలగించడం తప్పించి మనమేమీ చేయలేని పరిస్థితి’ అంటారామె కించిత్ నిరాశతో. అదీ తాత్కాలికమే.