పెళ్లికి వెళ్తాం. ఫొటోలు దిగుతాం. కానీ, అది చేతికి రాదు. కాలేజ్ ఫెస్ట్, కార్పొరేట్ ఈవెంట్లో డ్యాన్సులు వేస్తాం.కానీ, ఆ జోష్ని మళ్లీ మళ్లీ చూసుకుని ఎంజాయ్ చేద్దామంటే ఫొటో ఉండదు. ఏదైనా ఈవెంట్లోచాలామంది ఫొటోగ్రాఫర్లు కనపడతారు. కానీ, వాళ్లు తీసిన ఫొటోలు ఎవరికీ అందవు. చిత్రంగా సోషల్ మీడియాలో కనిపిస్తూ వ్యక్తిగతాన్ని బహిరంగం చేస్తాయి. ఇన్ని సమస్యలకూ ఒకే పరిష్కారం చూపించారు స్నేహితురాళ్లు బిందు, మౌనిక. వాళ్లు నిర్మించిన ‘చిత్రాలయంలో ఎవరి ఫొటో మిస్ కాదు. ఏ సందర్భమూ చెరిగిపోదు.
బిందు ఎంబీఏ చదివింది. ఒక ఇన్వెస్ట్మెంట్ కంపెనీలో ఉద్యోగంలో చేరింది. మౌనిక బీటెక్ చదివింది. జీఎంఆర్ ఇన్నోవెక్స్‌లో ఉద్యోగం చేస్తున్నది. హైదరాబాద్‌లో జరిగిన ఒక ఈవెంట్లో ఒకరినొకరు పరిచయం చేసుకున్నారు. అలా మొదలైన పరిచయం కాలం గడుస్తుంటే స్నేహంగా మారింది. కొత్త ఆలోచనలు పంచుకునే వీరిద్దరికీ ఓ ఆలోచన తట్టింది. వ్యక్తిగత ఫొటోలు వెతుక్కోవడం, భద్రపరుచుకోవడం కాలేజ్ డేస్‌లో వాళ్లకు పెద్ద సమస్యగా అనిపించింది. ఆ సమస్య లేకుండా టెక్నాలజీని వాడి కావాల్సిన ఫొటోని వెతికి పట్టుకోవడం సులభం చేయాలనుకున్నారు. గతేడాది మే నెలలో ‘చిత్రాలయ్’ నిర్మాణానికి పూనుకున్నారు. కార్పొరేట్ క్లయింట్స్, ప్రొఫెషనల్ ఫొటోగ్రాఫర్స్, స్కూళ్లు, వేడుకగా పెళ్లి-పేరంటాలు జరుపుకొనే కుటుంబాలు వాళ్ల క్లయింట్స్ అయ్యారు. ఇంకేముంది పేరుకు తగ్గట్టే వాళ్ల కంపెనీ పెద్ద ‘చిత్రాలయం’ అనిపించుకుంటున్నది!

కాలేజ్ ఫెస్ట్, క్యాంపస్ ఈవెంట్స్‌లో ఎంతోమంది పాల్గొంటారు. ఎవరెవరో ఫొటోలు తీస్తుంటారు. వాటిల్లో ఎవరున్నారో తెలియదు. తామున్న ఫొటోలు కావాలని అడిగితే వెతికి ఇచ్చేవాళ్లు ఉండరు. వెతుక్కోవడం కంటే కొత్తగా ఓ ఫొటో దిగడం బెటరనుకునేంత డాటా ముందేస్తారు. కొత్త ఫొటో దిగొచ్చు. కానీ, పాత సందర్భం మళ్లీ రాదుగా! అందుకే ‘అదే ఫొటో కావాలి. ఆ మూమెంటే చూడాలి’ అని చాలామంది కోరుకుంటారు. ఫొటోకు విలువ, ఆదరణ ఉన్నది ఇందుకే! ఫొటో ఎంత విలువైనదైనా, ఫొటోగ్రాఫర్ మాత్రం ఎవరి ఫొటోను వాళ్లకు ఎంతమందికని ఇస్తాడు? ఎన్నని వెతుకుతాడు? సాధ్యం కాదు కాబట్టే ఫొటోలన్నిటినీ నిర్వాహకులకు డ్రైవ్‌లో షేర్ చేస్తాడు.
ఒకరి ఫొటో మరొకరికి చేరొద్దని డ్రైవ్, సోషల్ మీడియాలో షేర్ అయ్యే డిజిటల్ ఫొటోలు చూసేందుకు, కాపీ చేసేందుకు చాలామందికి యాక్సెస్ ఉంటుంది. ఇది కొంతమంది ప్రైవసీని భంగపరుస్తుంది. అమ్మాయిలకు ఒక్కోసారి సమస్యలూ తెచ్చిపెట్టవచ్చు. కాబట్టి ‘ఎవరి ఫొటో వాళ్లకే చేరవేయాలి. ఆ పని చేసేదెవరు?’ అని ఆలోచించారు బిందు, మౌనిక. కాలేజ్ రోజుల్లో వాళ్లు ఎదుర్కొన్న ఈ సమస్యే కొత్త అవకాశం చూపింది. ఇద్దరూ కలిసి ‘చిత్రాలయ్’ పేరుతో స్టార్టప్ కంపెనీని ప్రారంభించారు. ఎవరి ఫొటోలను వాళ్లకు అందేలా చేస్తుందీ చిత్రాలయ్. అలాగే ఒకరి ఫొటో మరొకరికి చేరకుండా జాగ్రత్త వహిస్తుంది. ఫేస్ రికగ్నేషన్ టెక్నాలజీ, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో జరిగే ఈ ఫొటోల షేరింగ్ వ్యక్తిగత గోప్యతనూ కాపాడేలా నిర్వహిస్తున్నారు వాళ్లు.
చిత్రాలయ్ ఎలా పని చేస్తుందంటే.. ఒక ఈవెంట్‌కు సంబంధించి క్యూఆర్ కోడ్ తయారు చేసి, దానికి హాజరయ్యేవారికి షేర్ చేస్తుంది. ఆ క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేసి, సెల్ఫీ దిగితే చాలు. ఆ సెల్ఫీ ద్వారా.. సదరు ఈవెంట్లో తీసిన ఫొటోలు, వీడియోలను చిత్రాలయ్ ఫేస్ రికగ్నేషన్ ద్వారా గుర్తిస్తుంది. ఫొటోలో ఎంతమంది ఉంటే అంతమందిని గుర్తిస్తుంది. వారందరికీ ఆ ఫొటోలు పంపిస్తుంది. అంతేకాదు ఒకవ్యక్తి ఆ ఈవెంట్లో తీసిన ఎన్ని ఫొటోల్లో ఉంటే అన్ని ఫొటోలు, వీడియోలు వారికి షేర్ చేస్తుంది. అంటే, ఎవరి ఫొటోలు వాళ్లకు నేరుగా అందుతాయన్నమాట. వెతుక్కునే శ్రమ ఉండదు. ఒక్కరే దిగిన ఫొటో ఉంటే.. ఆ ఒక్కరికే పంపుతుంది. సమయం, ప్రైవసీని కాపాడేందుకు ఏఐని ఉపయోగించిన బిందు, మౌనిక జోడీని కార్పొరేట్ ఈవెంట్లకు పిలిచి ఫొటోలను ‘చిత్రాలయ్’కి అప్పగిస్తున్నారు.

వెడ్డింగ్ ఈవెంట్ మేనేజర్లు వచ్చాక ‘ఆకాశమంత పందిరి’ అనే మాట నిజమైపోయింది. పందిరే కాదు పెళ్లికి వచ్చే జనమూ అంతే సంఖ్యలో ఉంటున్నారు. సెలెబ్రిటీలు, సంపన్నులు పెళ్లి అయితే ఇసుకేస్తే రాలనంత జనం. పెళ్లికి వెళ్తే ఎక్కడెక్కడి చుట్టాలంతా కలుస్తారు. అందరినీ పలకరించినట్టే ఓ ఫొటో దిగి సంతోషపడిపోతుంటాం. కానీ, ఆ ఫొటో దొరక్కపోతే ఆ సంతోషాన్ని మించిన బాధ వెంటాడుతుంది. పెళ్లి, పేరంటాల్లో ఎవరెవరో ఫొటోలు తీస్తుంటారు. అక్కడక్కడా మోహరించినట్లుగా ఉండి మూవ్‌మెంట్స్‌ని క్యాప్చర్ చేసే ప్రొఫెషనల్ ఫొటోగ్రాఫర్సే కాదు, బంధువుల ప్రేమను, పరిచయస్తుల పలుకరింపులను అందరూ ఫొటోలు తీస్తూ ఉంటారు.
పెళ్లంటే ఇప్పుడు సెల్ఫీల సందడిగా మారిపోయింది. ఈ సందట్లో ఎవరు తీసిన ఫొటోలో ఎలా ఉన్నామోననే సందేహం, ఏ ఫొటో అందంగా వచ్చిందో చూసుకోవాలని కుతూహలం ఉంటాయి. కానీ, ఫొటోలు మళ్లీ చూస్తామన్న గ్యారెంటీ లేదు. చిత్రాలయ్ ఇలాంటి సమస్యకు తావులేకుండా చేసింది. పెళ్లిలో ఉండే ప్రొఫెషనల్ ఫొటోగ్రాఫర్లు ఆ ఈవెంట్ ఫొటోలను అప్లోడ్ చేస్తే చిత్రాలయ్ ఎవరి ఫొటోలు వాళ్లకు పంపిస్తుంది. అలాగే పెళ్లికి వచ్చిన బంధువులు, స్నేహితులు, ఇరుగుపొరుగు వాళ్లూ ఫొటోలు తీస్తారు. వాళ్లు కూడా ఇందులో ఫొటోలను అప్లోడ్ చేయొచ్చు. ఇలా పెళ్లి వేడుకలో అందరూ తీసిన ఫొటోలను చిత్రాలయ్ విశ్లేషిస్తుంది. తెలియని వాళ్లు తీసిన ఫొటోలో తెలియకుండా పడ్డా సరే ఆ ఫొటోలో ఉన్నారు కాబట్టి వాళ్ల ఫొటో వాళ్లకు ఇచ్చేస్తుంది. ఇలా పెళ్లి వేడుకను పెద్ద ఫొటోల సందడిగా మార్చింది చిత్రాలయ్.
కొంతమంది క్యూఆర్ కోడ్ సాయంతో గతంలో జరిగిన ఈవెంట్లో సెల్ఫీతో రిజిస్టర్ కాలేదనుకోండి. వాళ్ల ఫొటోతో (గూగుల్ ఇమేజ్ రివర్స్ సెర్చ్ లాగా) సెర్చ్ చేసి ఫొటోలను రాబట్టుకోవచ్చు! నిర్వాహకులు ఆ వేడుక కోసం ఏదైనా లోగోని రూపొందిస్తే అందరికీ చేరే ఫొటోలపై ఆ లోగో కూడా ఉంటుంది. చిత్రాలయ్లో రిజిస్టర్ అయిన వాళ్లు సమయం, ఈవెంట్ ఆధారంగా సెర్చ్ చేసి పాత ఫొటోలను వెతుక్కోవచ్చు. చిత్రాలయ్లో ఉన్న సౌలభ్యాన్ని చూసి ప్రొఫెషనల్ ఫొటోగ్రాఫర్స్తోపాటు యాభై సంస్థలు దీని సేవలు ఉపయోగించుకుంటున్నాయని బిందు చెప్పారు. వీటిలో టీ-హబ్, జీఎంఆర్, హెక్సగాన్, వెడ్డింగ్ ఈవెంట్ కంపెనీలు, స్కూళ్లు, కాలేజీలు, క్రీడా సంస్థలు ఉన్నాయని చెబుతున్నారు. ఈ చిత్రమైన ప్రయోగం ‘ఇండియన్ వెడ్డింగ్ ఫొటోగ్రఫీ ఫెస్టివల్ 2026’లో ఇన్నోవేషన్ కేటగిరిలో అవార్డు అందుకుంది.
– నాగవర్ధన్ రాయల