నమస్తే తెలంగాణ క్రీడా విభాగం : ప్రపంచ ఫుట్‌బాల్‌లో అర్జెంటీనా అంటే ఓ జట్టు కాదు. సగటు అభిమాని గుండెచప్పుడు. మైదానంలో నీలం-తెలుపు వర్ణంలోని అర్జెంటీనా పదో నంబర్ జెర్సీ ధరించి మైదానంలోకి రావడం అంటే ఒక ఆట మాత్రమే కాదు.. ఒక దేశ భారాన్ని, కోట్లాది మంది ఆశలను భుజాన మోయడం..! ఒకప్పుడు డిగో మారడోనా అనే సాకర్ మాంత్రికుడు ఆ జెర్సీలో రెండు దశాబ్దాల పాటు అర్జెంటీనానే కాదు.. సాకర్ ప్రపంచాన్నే ఏలాడు. అంతటి మహాశక్తి, మర్రిచెట్టు లాంటి ఆటగాడి నీడలో జట్టులోకి వచ్చి ‘ఈ కుర్రాడు మనకు కప్పు తెస్తాడా?’ అనే అనుమానాల మధ్య ప్రయాణం మొదలుపెట్టిన లియోనల్ మెస్సీ.. చివరకు ఈ ఆటలో ఓ యోధుడిగా.. కోట్లాది మంది ఆరాధించే దేవుడిగా మారాడు. 2005లో మొదలైన ఆ ప్రయాణం కష్టాలు, కన్నీళ్లు, ఓటములు, బాధలు, విమర్శలు, నిష్క్రమణలు, పట్టు వదలని పోరాటాలతో చివరకు 2022లో ప్రపంచకప్‌ను ముద్దాడటంతో ఒక సంపూర్ణ మహాకావ్యంగా పూర్తయింది. ఇప్పుడు అంతర్జాతీయ కెరీర్‌కు మెస్సీ వీడ్కోలు పలకడంతో ప్రపంచ ఫుట్‌బాల్ చరిత్రలో ఒక సువర్ణాధ్యాయం ముగిసింది.
2005 ఆగస్టు 17. హంగేరీతో అర్జెంటీనా మ్యాచ్. అప్పటికే క్లబ్ స్థాయిలో అద్భుతాలు సృష్టించిన 18 ఏండ్ల బక్క పలుచని ఓ కుర్రాడు 18వ నంబర్ జెర్సీతో సబ్‌స్టిట్యూట్‌గా మైదానంలోకి అడుగుపెట్టాడు. కానీ, విధి అతనితో వింత నాటకమాడింది. బంతి కోసం పోరాడుతూ ప్రత్యర్థి చొక్కా పట్టుకున్నాడనే కారణంతో అంపైర్ అతనికి రెడ్ కార్డ్ ఇచ్చి పంపేశాడు. మైదానంలో దిగిన కేవలం 43 సెకన్లలోనే డ్రెస్సింగ్ రూమ్‌కు పరిగెత్తి, ఒక మూలన కూర్చుని వెక్కి వెక్కి ఏడుస్తూ.. ‘నేను అర్జెంటీనాకు పనికిరానేమో’ అని కుమిలిపోయాడు. ఆ కుర్రాడే లియోనల్ మెస్సీ అనే ఓ వీరుడిగా అదే దేశానికి ఆల్-టైమ్ టాప్ స్కోరర్‌గా మారతాడని నాడు ఎవరూ ఊహించలేకపోయారు.
బార్సిలోనా క్లబ్ తరఫున ట్రోఫీల వర్షం కురిపిస్తున్న మెస్సీకి, జాతీయ జట్టు జెర్సీ మాత్రం అగ్నిపరీక్షగా మారింది. మారడోనా వారసుడిగా పేరు తెచ్చుకోవడంతో ఆ దిగ్గజం మాదిరిగా మెస్సీ నుంచి అభిమానులు వరల్డ్ కప్ ఆశించారు. కానీ, 2014 ప్రపంచకప్ ఫైనల్లో జర్మనీ చేతిలో ఎక్స్ట్రా టైమ్‌లో ఓటమితో కండ్ల ముందే మెరుస్తున్న కలల కప్పును చూస్తూ మెస్సీ నిశ్చేష్టుడై నిలబడిపోయిన ఆ దృశ్యం ప్రపంచకప్ చరిత్రలోనే అత్యంత విషాదకర ఘట్టం. 2015, 2016 కోపా అమెరికా ఫైనల్స్‌లోనూ అర్జెంటీనాను, మెస్సీని ఓటమే వెక్కిరించింది. ముఖ్యంగా 2016 ఫైనల్లో చిలీపై పెనాల్టీ మిస్ చేసిన లియోనల్ మైదానంలోనే భోరున విలపించాడు. ఆ గుండెకోతతో నాడు ఆట నుంచి తప్పుకున్నాడు. కానీ, తన నిర్ణయంతో దేశం మొత్తం స్తంభించిపోయింది. ‘లియో.. మన జట్టును వదిలి వెళ్లొద్దు’ అంటూ కోట్లాది మంది అభిమానులు తనను వేడుకున్నారు. ఆ ప్రేమే మెస్సీని మళ్లీ మైదానంలోకి నడిపించింది.
2022 ఖతార్ ప్రపంచకప్ కేవలం ఒక టోర్నమెంట్ కాదు.. అది మెస్సీ రాసిన ఓ దృశ్యకావ్యం అనొచ్చు. తొలి మ్యాచ్‌లోనే సౌదీ అరేబియా చేతిలో ఓటమి ఎదురైనా, సడలని విశ్వాసంతో ప్రతి మ్యాచ్‌ను ఫైనల్ లాగే ఆడాడు. 7 గోల్స్, 3 అసిస్ట్‌లతో టోర్నీలోనే అత్యుత్తమ ఆటగాడిగా నిలిచాడు. ఫ్రాన్స్‌తో మెగా ఫైనల్లో రెండు గోల్స్ చేయడమే కాకుండా, పెనాల్టీ షూటౌట్లో జట్టును ముందుండి నడిపించి అర్జెంటీనాకు మూడో ప్రపంచకప్‌ను అందించాడు. అరబ్ సాంప్రదాయ దుస్తులు ‘బిష్ట్’ ధరించి, పసిడి కప్పును ముద్దాడి గాలిలోకి ఎత్తిన వేళ.. మరాడోనా ఆత్మ ఆకాశం నుంచి ఆశీర్వదించినట్లు అనిపించింది. 39 ఏండ్ల వయసులోనూ కుర్రాళ్లతో పోటీపడుతూ 2026 వరల్డ్ కప్‌లో అర్జెంటీనాను ఫైనల్ చేర్చిన మెస్సీ మరో కప్పు సాధించలేపోయినా.. అప్పటికే అతని కెరీర్ పరిపూర్ణమైంది. ఓ వరల్డ్ కప్, రెండు కోపా అమెరికా కప్‌లు, ఒలింపిక్ స్వర్ణం అత్యంత విజయవంతమైన ఆటగాడిగా, నాయకుడిగా జాతీయ కర్తవ్యాన్ని ముగించాడు. నీలం-తెలుపు జెర్సీలో మెస్సీ ప్రయాణం ముగిసి ఉండవచ్చు.. కానీ అంతర్జాతీయ ఫుట్‌బాల్‌పై మెస్సీ వేసిన ముద్ర ఎప్పటికీ చెరిగిపోదు.
ఇంటర్నేషనల్ రిటైర్మెంట్ను వెనక్కుతీసుకొని తిరిగి జట్టులోకి వచ్చిన మెస్సీకి కోచ్ లియోనెల్ స్కలోని రూపంలో ఓ పెద్దన్న దొరికాడు. స్కలోని అర్జెంటీనా జట్టు స్వరూపాన్నే మార్చేశాడు. అదే సమయంలో ‘మెస్సీ ఒంటరి కాదు.. అతడి కోసం మేమంతా ఆడతాం’ అని డెపాల్, డిమారియా, ఎమిలియానో మార్టినెజ్ వంటి వీరులు ప్రతిజ్ఞ పూనారు. ఫలితం.. 2021 కోపా అమెరికా కప్. బ్రెజిల్‌ను వాళ్ల సొంతగడ్డపై మారాకానా స్టేడియంలో 1-0తో ఓడించి 28 ఏండ్ల అర్జెంటీనా ట్రోఫీ కరవును మెస్సీ తీర్చాడు. ఫైనల్ విజిల్ ఊదగానే జట్టు ఆటగాళ్లంతా పరుగెత్తుకెళ్లి మెస్సీని కౌగిలించుకుని, ఆకాశంలోకి ఎత్తి సంబరాలు చేసుకున్న దృశ్యం ప్రతి ఫుట్‌బాల్ ప్రేమికుడి గుండెల్లో నాటుకుపోయింది.
మెస్సీ అంతర్జాతీయ కెరీర్ 2005-2026
మ్యాచ్‌లు 207 (అర్జెంటీనా తరఫున అత్యధికం)
గోల్స్125 (అర్జెంటీనా టాప్ స్కోరర్)
ప్రధాన ట్రోఫీలు 1
ఫిఫా ప్రపంచకప్ (2022) 2
కోపా అమెరికా కప్ (2021, 2024)1
ఒలింపిక్ స్వర్ణం (2008)
8 బాలన్ డి ఓర్ అవార్డులు