Wimbledon Grand Slam | వింబుల్డన్: సీజన్ మూడో గ్రాండ్‌స్లామ్ వింబుల్డన్ మహిళల సింగిల్స్‌లో టాప్ సీడ్ ఇగా స్వియాటెక్‌కు షాక్ తగిలింది. ఫేవరెట్‌గా బరిలోకి దిగిన స్వియాటెక్ క్వార్టర్స్‌లో పరాజయం పాలైంది. మంగళవారం జరిగిన పోరులో వైల్డ్‌కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన ఎలినా స్వితోలినా 7-5, 6-7 (5/7), 6-2తో స్వియాటెక్‌పై విజయం సాధించింది. బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత తిరిగి మైదానంలో అడుగుపెట్టిన స్వితోలినా.. దాదాపు మూడు గంటల పాటు సాగిన పోరులో స్వియాటెక్‌ను హడలెత్తించింది. తొలి సెట్ సునాయాసంగానే నెగ్గిన స్వితోలినా.. రెండో సెట్లో హోరాహోరీగా పోరాడి చివర్లో ఓడింది.
ఇక మూడో సెట్ ఆరంభం నుంచే పూర్తి ఆధిపత్యం కనబర్చిన స్వితోలినా.. ప్రపంచ నంబరవన్ ర్యాంకర్ స్వియాటెక్‌కు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా చెలరేగి విజయం సాధించింది. కెరీర్లో నాలుగు మేజర్ టైటిల్స్ నెగ్గిన స్వియాటెక్.. ఇటీవల ఫ్రెంచ్ ఓపెన్‌లోనూ విజేతగా నిలిచింది. అయితే తొలిసారి వింబుల్డన్ క్వార్టర్స్ బరిలోకి దిగిన స్వియాటెక్ ఆ అడ్డంకిని అధిగమించలేకపోయింది. 5 ఏస్‌లు సంధించిన స్వితోలినా 25 విన్నర్స్ కొట్టగా.. మూడు ఏస్‌లు బాదిన స్వియాటెక్ 37 విన్నర్స్ సాధించింది. 41 అనవసర తప్పిదాలు చేసిన స్వియాటెక్ అందుకు తగ్గ మూల్యం చెల్లించుకుంది. మరో క్వార్టర్ ఫైనల్లో వోండ్రుసోవా 6-4, 2-6, 6-4తో నాలుగో సీడ్ పెగులాపై నెగ్గి ముందంజ వేసింది. సెమీస్‌లో వోండ్రుసోవాతో స్వితోలినా అమీతుమీ తేల్చుకోనుంది.