సీజన్ చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నీలో సంచలనం నమోదైంది. పురుషుల సింగిల్స్‌లో డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన ప్రపంచ నంబర్‌వన్ మెద్వెదెవ్.. ప్రిక్వార్టర్స్‌లోనే
ఇంటిబాట పట్టాడు. ఆస్ట్రేలియా యువ సంచలనం నిక్కిర్గియోస్తో పోరులో తొలి రెండు సెట్లు భీకరంగాపోరాడిన మెద్వెదెవ్ ఆ తర్వాత పట్టు కోల్పోయాడు. మహిళల సింగిల్స్‌లో అమెరికా యంగ్‌స్టర్ గాఫ్ క్వార్టర్స్‌కు చేరింది.
న్యూయార్క్: యూఎస్ ఓపెన్‌లో టాప్ ర్యాంకర్ డేనియల్ మెద్వెదెవ్ మరోసారి టైటిల్ సాధించాలన్న కలలను ఆస్ట్రేలియా యువ సంచలనం నిక్ కిర్గియోస్ కల్లలు చేశాడు. సోమవారం పురుషుల సింగిల్స్ నాలుగో రౌండ్ మ్యాచ్‌లో కిర్గియోస్ 7-6 (13/11), 3-6, 6-3, 6-2తో మెద్వెదెవ్‌ను ఇంటిదారి పట్టించాడు. మెద్వెదెవ్ పరాజయంతో టోర్నీ ముగిసేలోపు కొత్త టాప్ ర్యాంకర్ అవతరించనున్నాడు. మహిళల విభాగంలో కొకొ గాఫ్, కరోలిన్ గార్సియాలు కూడా క్వార్టర్‌ఫైనల్‌కు చేరుకున్నారు. మూడు గంటలపాటు సాగిన పోరులో కిర్గియోస్, మెద్వెదెవ్‌లు పదునైన సర్వీసులతో అభిమానులను అలరించారు. ఇరువురూ పోటాపోటీగా 21, 22 ఏస్‌లను సంధించారు. కిర్గియోస్ డబుల్‌ఫాల్ట్స్ (7) ఎక్కువ చేసినా బ్రేక్ పాయింట్లలో (5/7) పైచేయి సాధించాడు. తొలి సెట్లో ప్రతిఘటన చూపి, రెండో సెట్‌ను గెలుచుకున్న మెద్వెదెవ్ ఆ తరువాతి సెట్లలో పూర్తిగా కుదేలయ్యాడు. నాలుగో సెట్లో ఒక దశలో బంతిని గోడకేసి కొడుతూ అసహనం ప్రదర్శించాడు. మరోవైపు కిర్గియోస్ సంయమనం పాటిస్తూ మ్యాచ్‌ను కైవసం చేసుకున్నాడు. మరో మ్యాచ్‌లో కచనొవ్ సుదీర్ఘ పోరులో 4-6, 6-3, 6-1, 4-6, 6-3తో పాబ్లొ కరెనొ బుస్టాపై విజయం సాధించాడు.
క్వార్టర్ఫైనల్లో గాఫ్
అమెరికా యువ సంచలన కొకొ గాఫ్ ఇక్కడ తొలిసారి క్వార్టర్‌ఫైనల్‌కు చేరుకుంది. ప్రిక్వార్టర్స్‌లో గాఫ్ 7-5, 7-5తో చైనాకు చెందిన జాంగ్ షుయి దూకుడుకు కళ్లెం వేసింది. ఉత్కంఠగా సాగిన పోరులో గాఫ్‌నే విజయం వరించింది. ఆరంభంలో జాంగ్ 2-0 ఆధిక్యం సాధించినా ప్రేక్షకుల మద్దతుతో పుంజుకున్న గాఫ్ బ్యాక్‌హ్యాండ్ విన్నర్‌తో తొలి సెట్‌ను సొంతం చేసుకుంది. రెండో సెట్లోనూ జాంగ్ బ్రేక్ సాధించి 5-3 ఆధిక్యం సాధించినా గాఫ్ పడిలేచిన కెరటంలా మళ్లీ ఆధిక్యంలోకి వెళ్లి సెట్‌ను, మ్యాచ్‌ను గెలుచుకుంది.