రాంచీ : సొంతగడ్డపై వెస్టిండీస్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను ఘనంగా ఆరంభించిన టీమిండియా మరో విజయంపై కన్నేసింది శుక్రవారం జరిగే రెండో పోరులోనూ తొలి మ్యాచ్ జోరును కొనసాగించాలని భావిస్తోంది. శ్రేయస్ అయ్యర్ సారథిగా నియమితుడయ్యాక ఐర్లాండ్, ఇంగ్లండ్ సిరీస్‌లలో దారుణ వైఫల్యాలు చవిచూసినా జింబాబ్వే సిరీస్ నుంచి గెలుపు బాట పట్టిన టీమిండియా.. వరుసగా పది మ్యాచుల్లో గెలిచిన జోష్‌లో ఉంది. స్వదేశంలో అనుకూలించే పరిస్థితులను సద్వినియోగం చేసుకుంటూ వరుసగా 11వ విజయంతో పాటు సిరీస్‌లో 2-0 ఆధిక్యమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. మరోవైపు జట్టు నిండా హిట్టర్లు, ఆల్‌రౌండర్లు ఉన్నా తొలి మ్యాచ్‌లో స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయిన వెస్టిండీస్.. రాంచీలో అయినా పుంజుకునేందుకు ప్రణాళికలు రచిస్తున్నది. ఈ నేపథ్యంలో ఇరుజట్ల మధ్య మరో రసవత్తర పోరు జరుగనుండటం ఖాయంగా కనిపిస్తున్నది.
ఇంగ్లండ్ సిరీస్‌లో దారుణ ప్రదర్శనతో జట్టులో చోటు కోల్పోయినా మళ్లీ టీమ్‌లోకి వచ్చిన కేరళ వికెట్‌కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ మళ్లీ విఫలమవుతుండటం ఆందోళన కల్గిస్తున్నది. గత నాలుగు ఇన్నింగ్స్‌ల్లో అతడు చేసిన స్కోర్లు 9, 7, 2, 11గా నమోదయ్యాయి. ఓపెనింగ్ స్థానం కోసం వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీ నుంచి తీవ్ర పోటీ ఎదుర్కుంటున్న శాంసన్ రాంచీలో అయినా సత్తాచాటాలని టీమ్ మేనేజ్మెంట్ ఆశిస్తున్నది. ఈ మ్యాచ్‌లోనూ అతడు విఫలమైతే మరోసారి బెంచ్‌కు పరిమితమయ్యే ప్రమాదం పొంచి ఉందని చెప్పక తప్పదు. సంజూ విఫలమవుతున్నా అభిషేక్ మంచి ఫామ్‌లో ఉన్నాడు. తొలి మ్యాచ్‌లో జట్టుకు మెరుపు ఆరంభం ఇచ్చాడు. వరల్డ్ నంబర్ వన్ బ్యాటర్ ఇషాన్ కిషన్ మూడో స్థానంలో అంచనాలకు మించి రాణిస్తుండటం జట్టుకు కలిసొచ్చేదే. మిడిలార్డర్లో కెప్టెన్ శ్రేయస్ గత మ్యాచ్‌లో శతకంతో విమర్శకుల నోళ్లు మూయించడమే గాక తాను క్రీజులో ఉంటే ఎంత ప్రమాదకర బ్యాటరో మరోసారి చాటిచెప్పాడు. అతడితో పాటు వైస్ కెప్టెన్ తిలక్ వర్మ, నమన్ ధీర్, శివమ్ దూబే వంటి హిట్టర్లతో బ్యాటింగ్ విభాగం పటిష్టంగానే ఉంది.
బుమ్రా లేని భారత బౌలింగ్ లైనప్ బలహీనంగానే ఉందన్నది కాదనలేని వాస్తవం. లక్నో మ్యాచ్‌లో యువ పేసర్ మయాంక్ యాదవ్ భారీగా పరుగులిచ్చుకున్నాడు. అర్ష్‌దీప్ ఫర్వాలేదనిపించినా స్పిన్నర్లు కట్టడిచేసి విండీస్‌ను భారీ స్కోరు చేయకుండా అడ్డుకోకుంటే పరిస్థితి భిన్నంగా ఉండేది. మరి మయాంక్‌ను కొనసాగిస్తారా? లేక ప్రిన్స్ యాదవ్, ఆల్‌రౌండర్ నితీశ్‌కుమార్ రెడ్డిలో ఎవరికైనా ఒకరికి తుదిజట్టులో చోటిస్తారా? అన్నది చూడాలి. వన్డే సిరీస్‌లో నితీశ్‌తో ఆరంభ ఓవర్లలో బౌలింగ్ చేయించినా అది సత్ఫలితాలనివ్వలేదు. మయాంక్‌ను పక్కనబెడితే ప్రిన్స్‌ను తీసుకునే అవకాశాలే మెండుగా ఉన్నాయి. బంతితో అరంగేట్ర ఆల్‌రౌండర్ నమన్ మూడు వికెట్లతో సత్తాచాటాడు. కుల్దీప్, అక్షర్ వారి అనుభవంతో విండీస్‌ను నిలువరించారు.
తొలి మ్యాచ్‌లో మంచి ఆరంభమే దక్కినా తర్వాత క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయిన కరీబియన్ జట్టు అనుకున్నంత స్కోరు చేయలేకపోయింది. జట్టులో హెట్మయర్, పావెల్, హోప్, రూథర్‌ఫర్డ్, షెఫర్డ్ వంటి పక్కా టీ20 హిట్టర్లు ఉన్నా ఆ జట్టు తడబాటుకు గురైంది. క్రీజులో నిలబడితే వాళ్లెంత ప్రమాదకారి బ్యాటర్లో భారత్‌కు తెలుసు. కానీ విండీస్ బౌలింగ్ విభాగం అంత పటిష్టంగా లేదు. అకీల్ హుస్సేన మినహా గత మ్యాచ్‌లో మిగిలినవారెవరూ ఆశించినస్థాయిలో మెరవలేదు.