కొలంబో: లైంగిక దాడి ఆరోపణల కేసులో లంక క్రికెటర్ దనుష్క గుణతిలకను ఆస్ట్రేలియా పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ క్రికెటర్‌పై శ్రీలంక క్రికెట్ బోర్డు నిషేధం విధించింది. తక్షణమే అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి దనుష్కను సస్పెండ్ చేస్తున్నట్లు ఇవాళ లంక క్రికెట్ బోర్డు ఎగ్జిక్యూటివ్ కమిటీ పేర్కొన్నది. ఆసీస్ పోలీసులు అతన్ని అరెస్టు చేసిన నేపథ్యంలో.. అతన్ని సెలెక్ట్ చేయబోమని క్రికెట్ బోర్డు వెల్లడించింది.
ఆస్ట్రేలియాలో జరిగిన ఘటన గురించి పూర్తి స్థాయిలో విచారణ చేపట్టనున్నట్లు లంక క్రికెట్ బోర్డు తెలిపింది. ఒకవేళ దనుష్క దోషిగా తేలితే, అప్పుడు చట్టం ప్రకారం అతన్ని శిక్షించనున్టన్లు క్రికెట్ బోర్డు వెల్లడించింది.
డేటింగ్ యాప్ ద్వారా పరిచయమైన తనపై దనుష్క లైంగిక దాడి చేసినట్టు ఓ మహిళ ఫిర్యాదు చేయడంతో న్యూసౌత్‌వేల్స్ పోలీసులు ఆదివారం క్రికెటర్ దనుష్కను అరెస్టు చేశారు. టీ20 ప్రపంచకప్‌లో ఒకే ఒక్క మ్యాచ్ ఆడిన దనుష్క.. ఆ తర్వాత గాయం కారణంగా జట్టుకు దూరమయ్యాడు. శనివారం ఇంగ్లండ్ చేతిలో ఓడిన లంక.. సెమీస్ అవకాశాలు కోల్పోవడంతో ప్రపంచకప్ నుంచి నిష్క్రమించింది. దనుష్క లేకుండానే జట్టు సభ్యులు స్వదేశానికి పయనమయ్యారు.