Vaibhav vs Bumrah : ఐపీఎల్ పంతొమ్మిదో సీజన్లో అదరగొడుతున్న వైభవ్ సూర్యవంశీ(Vaibhav Sooryavanshi)కి అసలైన పరీక్ష ఎదురవ్వనుంది. తొలి రెండు మ్యాచుల్లో ధనాధన్ ఆటతో ప్రత్యర్ధి బౌలర్లకు దడ పుట్టించిన ఈ చిచ్చరపిడుగు నేడు జస్ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah)ను ఎదుర్కోనున్నాడు. పవర్ ప్లేలో పవర్ స్ట్రోక్‌తో విరుచుకుపడే వైభవ్ .. మేటి బ్యాటర్లను సైతం వణికించే బుమ్రాను ఉతికేస్తాడా? ఆడలేక వికెట్ ఇచ్చేస్తాడా? అనేది ఆసక్తి రేపుతోంది.
పంతొమ్మిదో సీజన్లో ఆసక్తికర పోరాటానికి మరికాసేపట్లో తెరలేవనుంది. వరసగా రెండు విజయాలతో జోరు మీదున్న రాజస్థాన్ రాయల్స్ తమ సొంత గడ్డపై ముంబై ఇండియన్స్‌ను ఢీ కొడుతోంది. ఈమ్యాచ్‌లో అందరి కళ్లు వైభవ్ సూర్యవంశీ మీదే ఉండనున్నాయి. ఎందుకంటే అతడు తొలిసారిగా వరల్డ్ బెస్ట్ బౌలర్‌ను ఢీకొట్టబోతున్నాడు. అయితే.. తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌పై 16 బంతుల్లోనే మెరుపు అర్ధశతకం బాదిన వైభవ్.. ఆపై గుజరాత్ టైటాన్స్‌పైనా చెలరేగాడు.
“I will doff my hat”: On potential Vaibhav Sooryavanshi vs Jasprit Bumrah clash, ex-India star’s stunning remark#RRvMI #IPL2026https://t.co/jJaeIJ4akK
— CricketNDTV (@CricketNDTV) April 7, 2026
ఓపెనర్ యశస్వీ జైస్వాల్‌తో కలిసి రాజస్థాన్‌కు శుభారంభాలిస్తున్న ఈ 15 ఏళ్ల సంచలనం ప్రధాన పేసర్లను అలవోకగా ఆడుతున్నాడు. గత రెండు మ్యాచుల్లో 237.14 స్ట్రయిక్ రేటుతో ఔరా అనిపించిన వైభవ్ గువాహటిలో జస్ప్రీత్ బుమ్రాను ఎలా ఎదుర్కొంటాడు? అని క్రీడాభిమానులు ఆసక్తి కనబరుస్తున్నారు. ప్రపంచ స్థాయి బ్యాటర్లను ఇరుకున పెట్టే బుమ్రాను కాచుకొని.. వైభవ్ క్రీజులో నిలవడమే గొప్ప విషయం అని కొందరు, లేదు మనోడు ఇరదీస్తాడు చూడండి అని మరికొందరు చర్చించుకుంటున్నారు.

ఇప్పటికే ఈ లీగ్‌లో అంతర్జాతీయ బౌలర్లను ఓ ఆట ఆడుకున్న ఈ బుడ్డోడు.. యార్కర్ కింగ్‌ను సైతం ఉతికేశాడంటే రాజస్థాన్‌కు తిరుగుండకపోవచ్చు. గువాహటిలో రాత్రి 7:30 గంటలకు రాజస్థాన్, ముంబై మ్యాచ్ జరుగనుంది.