NED vs SA | చిన్న జట్టే కదా అని తక్కువ అంచనా వేస్తే.. ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందో దక్షిణాఫ్రికాకు బాగా తెలిసొచ్చింది. ‘‘చోకర్స్, గీకర్స్ జాన్తానై.. ఈ సారి కప్పు కొట్టాల్సిందే’’ అన్నట్లు వరల్డ్‌కప్‌లో అడుగుపెట్టి.. అందుకు తగ్గట్లే రెండు మ్యాచ్‌ల్లో అదరగొట్టిన సఫారీలకు మూడో మ్యాచ్‌లో నెదర్లాండ్స్ ముచ్చెమటలు పట్టిస్తూ మట్టికరిపించింది. ఇదంతా బలుపు కాదు వాపే అని తేల్చి పడేసింది! తొలి పోరులో శ్రీలంకపై నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడి వరల్డ్‌కప్‌లోనే అత్యధిక స్కోరు చేసిన దక్షిణాఫ్రికా.. నెదర్లాండ్స్ విసిరిన స్వల్ప లక్ష్యాన్ని ఛేదించలేక చతికిలబడింది. డికాక్, బవుమా, డసెన్, మార్క్రమ్, క్లాసెన్, మిల్లర్, జాన్సెన్ ఇలా చెప్పుకునేందుకు ఏడుగురు ప్రధాన బ్యాటర్లు ఉన్నా.. నెదర్లాండ్స్ క్రమశిక్షణాయుత బౌలింగ్ ముందు సెవన్ స్టార్ లైనప్ ఎందుకు పనికిరాకుండా పోయింది.
మొదట్లో నిప్పులు చెరిగే బౌలింగ్‌తో నెదర్లాండ్స్‌ను ఉక్కిరి బిక్కిరి చేసిన సఫారీ పేసర్లు.. ఒక్కసారి ప్రత్యర్థి ఎదురుదాడి ప్రారంభించాక మరీ నాసిరకంగా మారిపోయారు. పదే పదే ఫుల్‌టాస్‌లతో అప్పనంగా పరుగులు ఇస్తుంటే.. పదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన ఆర్యాన్ దత్ ఏకంగా మూడు సిక్సర్లు అరుసుకున్నాడు. నాణ్యమైన పేస్‌ను ఎదుర్కొంటూ లోయర్ ఆర్డర్ దమ్ము చూపితే.. బౌలర్లు శక్తికి మించి శ్రమించారు. ఫలితంగా 80 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి డచ్ జట్టు.. అక్కడి నుంచి కోలుకొని మెరుగైన లక్ష్యాన్ని నిర్దేశించగలిగింది. అఫ్గానిస్థాన్ నుంచి స్ఫూర్తి పొందారో లేక సఫారీల పని పట్టాలని కంకణం కట్టుకొని మైదానంలో అడుగు పెట్టారో కానీ.. స్టార్ బ్యాటర్లను అసలు నిలదొక్కుకోనివ్వలేదు. డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్‌పై అఫ్గాన్ విజయమే సంచలనం అనుకుంటే.. ఇప్పటి వరకు వరల్డ్‌కప్‌లో కేవలం రెండే విజయాలు నమోదు చేసుకున్న నెదర్లాండ్స్.. దక్షణాఫ్రికాను మట్టికరిపించడాన్ని మరేం అనాలో! మొత్తానికైతే చిన్న పామునైనా.. పెద్ద కర్రతో కొట్టాలనే నానుడిని ఈ రెండు మ్యాచ్‌లు మరోసారి గుర్తు చేశాయి. మరి గురువారం బంగ్లాదేశ్‌తో తలపడనున్న టీమ్ఇండియా కాస్త ఒళ్లు దగ్గర పెట్టుకోవాలని ఈ రెండు సంఘటనలు హెచ్చరిస్తున్నాయి!!