న్యూఢిల్లీ: రెండేండ్ల విరామం తర్వాత సెర్బియా వీరుడు నొవాక్ జొకోవిచ్ అమెరికా గడ్డపై తొలి టైటిల్ ఖాతాలో వేసుకున్నాడు. హోరాహోరీగా సాగిన సిన్సినాటి ఓపెన్‌లో ప్రపంచ రెండో ర్యాంకర్ జొకోవిచ్ 5-7, 7-6 (9/7), 7-6 (7/4)తో వరల్డ్ నంబర్‌వన్ కార్లోస్ అల్కరాజ్ (స్పెయిన్)పై విజయం సాధించాడు. దాదాపు నాలుగు గంటల పాటు సాగిన పోరులో జొకోవిచ్ ఐదు మ్యాచ్ పాయింట్లు కాచుకోవడం విశేషం. గత నెలలో వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఫైనల్లో అల్కరాజ్ చేతిలో ఓడిన జొకోవిచ్..
మ్యాచ్ అనంతరం ప్రత్యర్థిపై ప్రశంసలు కురిపించాడు. ‘ఈ కుర్రాడు వదిలిపెట్టే రకం కాదు. అతడిపై గెలువడం చాలా కష్టం’ అని జొకో అన్నాడు. 1990 తర్వాత ఏటీపీ టూర్ టోర్నీల్లో సుదీర్ఘంగా సాగిన పోరుగా ఈ ఫైనల్ చరిత్రకెక్కగా.. మ్యాచ్ అనంతరం జొకో చొక్క చింపేసుకొని మరీ సంబురాలు చేసుకున్నాడు.